అబ్బర పులీ....తోక బారెడు


Sun,June 30, 2013 12:11 AM

‘అబ్బర పులీ అంటె తోకబాడు’...‘తె’ అంటే తెలంగాణ ఇచ్చినట్టే. తెలంగా ణ అనుభవాల సారం ఏమిటంటే పులి ఉండదు. తోక బారెడూ ఉండదు. తీరా పులి వచ్చేసరికి రక్షించేవాడూ ఉండడు. డిసెంబర్‌కు జూన్‌కు మధ్య కేవలం ఏడు నెలల కాలమే. ‘పోయిన కాంగిరేసు ప్రతిష్ట’ తిరిగొచ్చుటానికి ఏడు నెలల కాలంలో రెండో దఫా ప్రయత్నాల సమయంలోనూ తెలంగాణ సమాజం ఆగమాగంగున్నది. కొందరు వాటాల కోసం, పీఠాల కోసం కలగంటూ ఉన్నారు. కొందరు చలో అసెంబ్లీ గాయాలను తడుముకుంటున్నారు. కొందరు యూనివర్సిటీల నుంచి నేరుగా అసెంబ్లీకి ప్రణాళికలు రచిస్తున్నారు.

కుక్కిన పేనులు, బానిసలు, కుమ్మక్కు నాయకులు అన్న కాంగ్రెస్ వాళ్లు మాత్రం నిజాం కాలేజీలో నేడు ఊరేగుతున్నరు. చాలాచాలా పురాతన నినాదం. తెలంగాణ సాధన. చాలా చాలా భంగపడ్డ ఆకాంక్ష తెలంగాణ సాధన. చాలాచాలా మోసపోయిన డిమాండ్ తెలంగాణ సాధన. అయినా రంగస్థం మీద సదా నాటకాలు నడుస్తూ ఉంటాయి. రక్తికడుతూ ఉంటాయి. గుబులు గుబులుగ ఉంటది. అడివీల పొద్దు గూకినట్టుంటది. ఒక ఆశల దీపం వెలిగి, హఠాత్తుగా మలుగుతుంది. మళ్లీ ఒక ఆత్మహననం. మళ్లీ ఒక ఉరిపోసుకున్న ఆత్మ. కొందరు తెలివిమీరిన మనుషులు చివరికి చావులనూ శంకించి వేట కుక్కల్లా శవాలనూ మురుక చూస్తుంటా రు. ఏమీ చెయ్యలేం.

అదీ తెలంగాణ కోసమే. జీవితమూ,పోరాటమూ కొన్ని కొన్ని భావోద్వేగసహిత, రోమాంఛిత సంఘటనలతో సహా సజావుగా జరుగుతూ ఉంటుంది. అట్లని నిరాశేమీ లేదు.
హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నాటకరంగాన్ని తెరిచింది. రెడ్డొచ్చె కాదు కాదు ‘డిగ్గీ రాజా వచ్చె మొదలాడె’..ఇక తెలంగాణ పరుగులు పెడ్తుంది. ఆధారాలేమిటి? అయినా చిగురిస్తున్న ఆశలకు ఆహ్వానాలుంటాయి గానీ ఆధారాలేముంటాయి. డిసెంబర్ 28న ఒక అఖిలపక్షం జరిగింది. నెలరోజుల్లో తేల్చేస్తామన్నారు హోంమంత్రి షిండే. నెలంటే నెల కాదన్నడు ఆజాద్. ఆజాద్ హిందూ ఫౌజ్ ఏదైనా మాట్లాడగలరు. అప్పు డు కూడా ఇదే హడావుడి సందర్భమూ అచ్చంగా ఇలాంటిదే. పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట తిరిగి రావడంఎజెండా. సంప్రదింపులు జరిగాయి. ఊహలు పెరిగాయి. ఆశల దీపాలు వెలిగాయి. ఊహలకు రెక్కలు మొలిచాయి.

చివరికి కొన్ని ఇళ్లల్లో ఆత్మహత్యల తో దీపాలు మలిగాయి. అప్పుడు తెలంగాణ ఎంపీలు ఇక మా వల్ల కాదు. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామన్నారు. చాలా జాగ్రత్తగా సోనియాగాంధీకి రాజీనామా లు ఇచ్చారు. షిండే తెలంగాణను తేల్చేస్తామన్నారు. పార్టీలను పిలిచారు. గతితార్కిక చారివూతక భౌతికవాదం కూడా తెలిసిన నారాయణ కూడా మోసపోయాడు. తెలంగాణకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయని ఆయన ప్రకటించేశారు. కేసీఆర్ పసిగట్టారు. బంద్ జరిగింది. మెల్లమెల్లగా మాటలు పెరిగాయి. నాలుకలు మడతలుపడ్డాయి. తెలంగాణే కదా! ఒక దురదృష్ట భూమి. ధాతూ ఫిర్యాదులేని భూమి. ఇడ్లీ, దోసెల డైలాగులూ విన్నది తెలంగాణ. కానీ మళ్లీ తనను ప్రోది చేసుకున్నది. రాస్తారోకో చేసింది.

చలో అసెంబ్లీ నిర్వహించింది. గాయపడింది. నెత్తురోడింది. రోడ్డు మీద మళ్లీ పతాక ఐంది. తెలంగాణ రాలేదు. అయినా పార్లమెంటులో ప్రకటించిన ‘తెలంగాణ ప్రక్రియకే’ దిక్కులేదు. దారిలేదు. తెన్ను లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇదొక అలవాటుగా మారింది. సోనియ మ్మ తప్ప ప్రతివాళ్లూ మాట్లాడతారు. ఏ ఒక్క మాటా నిలవదు. ఇవ్వాళ్ల మాట్లాడిన మాటను రేపెవడో తలకు మాసినవాడు అడ్డం పొడుగూ సాగలాగి బతుకు మీదనే రోత పుట్టిస్తాడు. గందరగోళం చేస్తాడు. అది తెలంగాణ పట్ల దశాబ్దాలుగా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం. అధికారం కోసం స్వయంగా నలభై ఒక్కమంది ఎమ్మెల్యేలను ఎగదోసిన వాడే ఆ తర్వాత శత్రువు అవుతాడు. కాంగ్రెస్‌కు అధికారం దక్కుతుంది. తెలంగాణకు మళ్లీ వీధులు దక్కుతాయి.

ఆ తర్వాత పొత్తులు పెట్టుకున్నవాడు డిసెంబర్ 10న చీకటి కరచాలనాలతో తెలంగాణకు చిమ్మచీకటి మిగులుస్తాడు. రెండు కండ్లంటడు. అయినా ఇప్పుడా దేవదేవుడు మాట్లాడను కూడా మాట్లాడడు. ఆయన ఒక ప్రవక్త. కేవలం ఉత్తరాఖండ్ తప్ప... విమానాలు, కోటిన్నర, బాధితుల ఫోటోలు తప్ప ఆయనకేమీ పట్టదు. ఎన్ని సెంటిమీటర్ల నిడివిలో ‘దేవుడి తయారీ’ జరిగిందన్నదే ఇప్పుడాయనకు అన్ని లక్ష్యాలుగా విస్తరించిన యావ. ఒక్కొక్కసారి శవాలూ ఓట్లు రాలుస్తాయి. నిస్సహాయంగా. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఒక్క తెలంగాణ ఒంటరిగా మిగులుతుంది. క్షతగాత్ర తెలంగాణ.ఇస్తనన్న వాడు ఇవ్వడు. తెస్తన్నన్న వాడు తేడు.

తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని మళ్లీ బాంచెతనంలోకి వెళ్లినాక అంతా ఒల్లక్కమే. తుప్పోల్. నేనట్లా అనలేదు. విచ్చుకున్న కండెలో చిక్కుదారంలాగా మళ్లీ ఒకే మాట ‘చర్చలు జరుపబడును’.. జాగ్రత్త ఒక చర్చకు, ఒక సంప్రదింపులకు మధ్యన నిడివి ఎంత? అన్నది కాదు. ఎన్ని ఆత్మహత్యలు జరిగాయన్నదే కొలమానం. ఆ ఒక్కటీ ఎవడికీ పట్టదు. సమ్మెలో ఇంటి వద్ద సంతకాలు పెట్టిన వాడూ హఠాత్తుగా తెలంగాణవాది అవుతాడు.
ఇప్పుడూ అలాంటిదే సందర్భం. బానిసల తిరుగుబాటు. ఇక వశం కాదనుకుని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని నిశ్చయించుకొని, ఆత్మ మేల్కాంచిన ముగ్గురు పార్టీ మారారు.

కాంగ్రెస్‌లో ఇక గెలుపు కల్ల. కాంగ్రెస్‌లో ఇక ఉండడం వల్ల కాదనుకున్న వాళ్లు జెండెత్తారు. పోయింది ముగ్గురే. కానీ.. పోదామని దస్తీలు వేసుకుంటున్న వాళ్లు చాలామందే. హఠాత్తుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ‘దురస్త్’ చేయాల్సి ఉన్నది. పోయిన కాంగ్రెస్ ప్రతిష్టను పొందవలసియేయున్నది. అనివార్యం. వెక్కిరించిన కృష్ణుని స్థానం లో కొంటె కృష్ణుని స్థానంలో గంభీరంగా ఉండే కృష్ణుడు తెరమీద ఆడారు. అంతకుముందే ఇంకా బానిసతనం వీడని కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కు ఎప్పటికయ్యది. తక్షణ కర్తవ్యం. మంత్రిగా ఉండాలి. ఎమ్మెల్యేగా ఉండాలి. కానీ తెలంగాణ సాధన కోసం పోరాడినట్టుగా కూడా ఉండాలి.

తెలంగాణ కోసం మాట్లాడినట్టుగా ఉండాలి. పోట్లాడినట్టుగా ఉండాలి. అవ్వా కావాలి. బువ్వా కావాలి. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. తెలంగాణను పూర్తిగా వ్యతిరేకించే కిరణ్ ప్రభుత్వంలో మంత్రిగానూ ఉండాలి. చెక్క భజనలు చేయాలి. కిరణాయనాలు పాడాలి. కానీ తెలంగాణ కోసం కూడా నాలుక కింది నుంచి ఓ మాట మాట్లాడాలి. ముందు సర్పంచ్ ఎన్నికలు. ఆనక జడ్‌పీ ఎన్నికలు. ఆనక మునిసిపల్ ఎన్నికలు. ఆనక అస్సల్ ఎన్నికలు. బస్. నాలుగు కోరల, నాలుగు కన్నుల, క్రూరమృగాల ద్రోహపు మొఖాలతో ప్రజల్లోకి వెళ్లలేము. కోరల్ని దాచాలి. కన్నుల్ని దాచాలి. ముఖానికి మళ్లీ తెలంగాణ జెండా అతికించుకోవాలి. ఇది సారాంశమే. నిజానికి కొత్తగా జరిగిందేమీ లేదు. డీ.శ్రీనివాస్ సోనియాగాంధీని కలిశారు.

కిరణ్‌కుమార్‌డ్డి ఢిల్లీకి వెళ్లారు. బొత్స సత్యనారాయణ కూడా వెళ్లారు. గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్రానికి ఇన్‌చార్జిని చేసింది. అంతే. సంప్రదింపులు అతి పురాతన మాట. అయినా ఒక చానల్ ఒకనాడు ప్యాకేజీ అంటది. మరోరోజు అదే చానల్ తెలంగాణ ఇచ్చేస్తారని భయం భయంగా రెచ్చగొడ్తది. యాంకర్ కూడా మారడు. ప్యాకేజీ రాసిన వార్తా పత్రిక, తెలంగాణ రాస్తది. రెండూ రాసిన అదే పత్రిక రాయల తెలంగాణ అంటది. లాక్కోనాం.. పీక్కోనాం..చర్చలు జరుగుతుంటవి. కడుపు దేవుతుంటది. సోనియాగాంధీ ఎప్పటిలాగే మాట్లాడదు. దిగ్విజయ్‌సింగ్ అందరిలాగే ఆకుకు అందకుండా,పోకకు పొందకుండా మాట్లాడ్తడు. ఎవరూ తెలంగాణ ఇస్తామని చెప్పరు. ఇవ్వకపోతే ఛస్తామని చెప్పరు.

కొత్తగా మంత్రి కిరీటం పెట్టుకున్న కావూరి మాత్రం నేనిప్పుడు సమైక్యవ్యాధిని కాదు. సర్పంచ్‌ను అంటడు. బస్‌చాలు ‘తె’ అంటే తెలంగాణ డి. శ్రీనివాస్ మాత్రం తెలంగాణకు అనుకూలం అంటడు. అంతే. బిల్లుపెట్టుడెప్పుడో? ఇచ్చుడెప్పు డో. తెచ్చుడెప్పు డో? బస్. ఇక చాలు మళ్లీ ఒక ఆశ. దామోదర రాజనర్సింహ ఎన్నడూ లేనిది ఢిల్లీ వెళ్లి వచ్చి నిజాం కాలేజీ సభకు సన్నద్ధం అంటడు. జైపాల్‌డ్డిని దిగ్విజయ్ కలిసిండు. బస్‌చాలు. ఇకనేం ఇక ఇప్పుడు కాంగ్రెస్ సర్వదోహాలూ, సర్వమోసాలూ, సర్వపాపాలూ చెల్లుకు చెల్లూ. జానాడ్డే ఇప్పుడు పక్కా తెలంగాణవాది. ఎన్నడూ కనీసం కనపడని, వినపడని స్వరాలేవో వినిపిస్తూ ఉంటాయి. కలత నిద్రలో కలవరిస్తుండేది అప్పుడూ.. ఇప్పుడూ తెలంగాణ వాది మాత్రమే.

కాంగ్రెస్ పార్టీ ఒక ఆక్టోపస్ అనేక ఎన్నికల యుద్ధముల ఆరితేరిన మోసగత్తే. నీ కాళ్ల కింది నేలను గుంజి ఉత్త ప్రతిమను చేసే చైతన్యం, చావు తెలివితేటలు కాంగ్రెస్‌కు ఉన్న వే. కన్నవే. విన్నవే కొత్త ఏమీకాదు. అది దశాబ్దాలుగా మోసం చేస్తూనే ఉన్నది. ముఖ్యం గా తెలంగాణ మోసపోతూనే ఉన్నది. తెరమీద కొత్త కొత్త వర్తమానం నాటకాలకు అది ప్రయోక్త. పడిపోవద్దు. పడిపోవద్దు. నిజమే ఇప్పుడు కాంగ్రెస్‌కు అనివార్యమే. కేంద్రంలో రాహూల్‌గాంధీ ప్రధాని కావాలి. యూపీఏ ప్రభుత్వం రావాలి. సవాలక్ష కుంభకోణాలు. ఊపిరి సలపనివ్వని నిందలు కాంగ్రెస్ పరిస్థితులేమీ బాగాలేవు. ఆంధ్రవూపదేశ్ రెండుసార్లూ అధికారం ఇచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెత్తనం ఇచ్చింది. కానీ భంగపడింది. ఇక పుట్టగతులు లేవు. ద్రోహం చేసింది ఎవరో తెలంగాణకు తెలు సు. తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌ను బొందపెట్టడం తప్ప మరి మార్గంలేదనీ తెలు సు. పార్టీ ఖాళీ కావడం ఖాయం. ధోకాబాజీ ఎవరో తెలంగాణకు తెలుసు. యూపీఏ మళ్లీ పీఠం ఎక్కాలంటే తెలంగాణ సీట్లు పక్కా కావాలి. తెలంగాణ ఇవ్వడం తప్ప మరి మార్గం లేదు. ఇట్లాంటి రాజకీయ అనివార్యత, ఇట్లాంటి రాజకీయ ప్రయోజనం లేకుం డా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు. నిజమే. తెలంగాణను గెలుచుకోవడమే. కానీ ఈ అనివార్యతలు కాంగ్రెస్‌కు మూడున్నరేళ్ల కిందనే ఏర్పడి తెలంగాణ ప్రకటన వచ్చింది.

అప్పటి నుంచీ కాంగ్రెస్‌కు ఈ అనివార్యత మెడమీద కత్తి మాదిరిగా భయపెడ్తూనే ఉన్నది. చాలా సార్లు సంప్రదింపులు జరిగాయి. చాలాసార్లు కాంగ్రెస్ అధిష్ఠానం ‘తె’ అన్నది అది తెలంగాణ కాలేదు. తెలంగాణ రాలేదు. ఎక్కడో ఏదో మర్మం ఉన్నది. తెలంగాణ అన్న ప్రతిసారీ సమైకాంధ్ర తమాషా జరుగుతూ ఉంటుంది. గొట్టాల ముందు విషం చిమ్మే మనుషుల ముఖాలూ ప్రత్యక్షమవుతాయి. సమైకాంధ్ర సాఫ్‌సీదా ఢిల్లీకి కి వెళ్తుంది. అక్కడ ఏదో జరుగుతుంది. పెట్టుబడి బుసలుకొడుతుంది. మెజా ర్టీ ఆధిపత్యం అహంకారం ప్రదర్శిస్తుంది. అక్కడేదో జరుగుతుంది. అధిష్ఠానం నాలుక మళ్లీ మళ్లీ మడతపడుతూ ఉంటుంది. అక్కడ ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇది దశాబ్దాల అనుభవం. ఇది దశాబ్దాల చర్విత చరణం.

అసలేం జరగనేలేదు. ప్యాకేజీల కోసం ఎక్కడైనా వెయ్యిమంది చనిపోతరా?రాయల తెలంగాణ కోసం ఎక్కడైనా వీధుల్లో నెత్తురు గడ్డకడ్తదా?? జరగదు. భ్రమా జనిత ఊహా స్వర్గాలు నిర్మితమవుతాయి. ఎవడి పైత్యం వాడిదే. సోనియా మాట్లాడదు. మళ్లీ మోసపోవడానికి మనం సిద్ధమా? కాదా? అన్నదే అసలు సమస్య. నిజాం కాలేజీలో సభపెట్టి తెలంగాణ సాధన కోసం సభ అంటే చాలా? మోసం చేసిన, ద్రోహం చేసిన, దగా చేసిన తెలంగాణ బతుకును ఛిద్రం చేసిన, తెలంగాణ బతుకును ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీని కనీసం విడిచి పెడ్తామని కాంగ్రెస్‌లో ఉండబోమని ప్రకటిస్తరా! ఉన్నరా! కాంగ్రెస్‌ల బానిసలు కానివాళ్లు. అదీ అసలు సమస్య. మోసం చేసిన వాడి ప్రతినిధే మళ్లీ తెలంగాణ అంటే నమ్మడం ఎట్లా?

మాకు తెలంగాణ కావాలి
కలిసి ఉంటే కలదు సుఖం
అమ్మా! మాకు తెలంగాణ కావాలి
అది జటిలమైన సమస్య
అయ్యా! మాకు తెలంగాణ కావాలి
సంప్రదింపులు సాగుతున్నయ్..
ఒరేయ్ .. నీ సంప్రదింపులకు
అగ్గి దల్గ.. మాకు తెలంగాణ కావాలె.
(నారాకు కృతజ్ఞతలతో..)

-అల్లం నారాయణ
[email protected]


35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles