సమంత సలహాలు తీసుకుంటాను..


Wed,September 12, 2018 11:01 PM

Naga Chaitanya Stills From Shailaja Reddy Alludu Movie Interview

అహంభావ మనస్తత్వం కారణంగా మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నమవుతాయనే సందేశానికి చక్కటి భావోద్వేగాల్ని, వినోదాన్ని మిళితం చేసి దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని రూపొందించారు అని అన్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో నాగచైతన్య చిత్ర విశేషాల్ని పాత్రికేయులతో ముచ్చటించారు.ఆ సంగతులివి..

మీ గత చిత్రాలతో పోలిస్తే శైలజారెడ్డి అల్లుడుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?

పూర్తిస్థాయి వినోదభరిత పాత్రలో నేను నటిస్తున్న తొలి చిత్రమిది. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. స్వేచ్ఛగా తన మనసులోని భావాల్ని వ్యక్తీకరించే యువకుడిగా సరదాగా దర్శకుడు మారుతి నా పాత్రను తీర్చిదిద్దారు. కుటుంబ విలువలకు అమితమైన ప్రాధాన్యతనిచ్చే చైతన్య అనే యువకుడిగా కనిపిస్తాను. ఇగో మనస్తత్వం వల్ల అతడికి ఎదురైన ఇబ్బందులేమిటన్నది తెరపై వినోదాన్ని పంచుతుంది.

గతంలో అత్తాఅల్లుళ్ల కథాంశాలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా ఎంతవరకు భిన్నంగా ఉంటుంది?

ఈకాన్సెప్ట్‌తో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ అత్తాఅల్లుళ్ల పోరు ప్రధానంగా నడిచాయి. కానీ ఈ సినిమా మాత్రం వినోదం, భావోద్వేగాల మిళితంగా ఉంటుంది. పక్కా మారుతి మార్కు సినిమా ఇది.

లవర్‌బాయ్ ఇమేజ్‌నుంచి దూరమయ్యే ఆలోచనలో ఉన్నారా?

ప్రేమకథలంటే నాకు చాలా ఇష్టం. ఇకపై ప్రేమను మూలంగా తీసుకొన్ని భిన్నమైన నేపథ్యాలతో సినిమాలు చేస్తాను.

సినిమాల ప్రచారం విషయంలో సమంత ఆధునికంగా అడుగులు వేస్తున్నట్లుంది?

నిజమే(నవ్వుతూ).సినిమాలకు సంబంధించి సమంత నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను.

నవతరం కథానాయకుల మధ్య పోటీ పెరిగిపోయింది కదా. దీనిని మీరు ఎలా స్వీకరిస్తారు?

ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోలంతా నవ్యత వైపు అడుగులు వేస్తున్నారు. భిన్నమైన నేపథ్యాలతో సినిమాలు చేస్తున్నారు. వారిని అందుకోవాలంటే ప్రతి సినిమాకు శ్రమించాల్సిందే. నా వరకు ప్రతి ఒక్కరిని పోటీగానే భావిస్తాను. అయితే వారితో పోటీ పడి హిట్ కొట్టాలనే ఆలోచన మాత్రం లేదు.

బంగార్రాజు సినిమాలో నాన్ననాగార్జునతో కలిసి మీరు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బంగార్రాజు కథ నాకు చాలా నచ్చింది. ప్రాంచైజ్ మాదిరిగా ఈ కథతో ప్రతి రెండేళ్లకు ఓ సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. నేను, నాన్న కలిసి ఓ భాగం, ఆ తర్వాత నాన్న ,అఖిల్ మరో పార్ట్‌లో నటించాలని అనుకుంటున్నాం.

కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు వచ్చి ప్రయోగాలు చేసే ఆలోచన ఉందా?

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. కథ బాగుంటే చిన్న సినిమా , పెద్ద సినిమా అనే పట్టింపులు లేకుండా హిట్ చేస్తున్నారు. కమర్షియల్, సేఫ్‌జోన్ అనే మాటలు వినిపించడం లేదు. కథ బాగుంటే ప్రయోగాలు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

గతంలో కొత్త దర్శకులతో వరుసగా సినిమాలు చేశారు? మళ్లీ ఆ ఆలోచన ఉందా?

కొత్త దర్శకులతో సినిమాలు చేయడం నాకు ఇష్టమే. కానీ గతంలో ఎదురైన ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని గ్యాప్ తీసుకున్నాను. ఆ సినిమాల విషయంలో దర్శకుల్ని తప్పుపట్టడం లేదు. నా జడ్జిమెంట్ సరిగా లేక అవి ఆడలేదు. కొన్ని విజయాలు వచ్చిన తర్వాత మళ్లీ కొత్తవారితో సినిమాలు చేస్తాను.

మీ సినిమాల ఎంపికలో నాన్న జోక్యం ఎంతవరకు ఉంటుంది.

తొలినాళ్లలో నా ప్రతి కథను నాన్న వినేవారు. గత కొన్నాళ్లుగా మంచి, చెడు, ఏదైనా నిర్ణయం నువ్వే తీసుకో అని చెబుతున్నారు. నా సినిమాలకు సంబంధించి స్నేహితుడి మాదిరిగా నిజాయితీగా నాన్న తన అభిప్రాయాల్ని చెబుతారు. నాన్న తర్వాత సమంత సలహాలు తీసుకుంటాను.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

ఒక పాట మినహా సవ్యసాచి పూర్తయింది. నవంబర్‌లో ఈ సినిమా విడుదలకానుంది శివనిర్వాణ దర్శకత్వంలో చేయనున్న ప్రేమకథా చిత్రం అక్టోబర్‌లో ప్రారంభంకానుంది. వెంకటేష్‌తో కలిసి నటించనున్న వెంకీమామా కూడా అక్టోబర్ నెలలోనే సెట్స్‌పైకి రానుంది.

3931

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles