గుర్త్తుండిపోయే సినిమా!


Wed,September 5, 2018 11:02 PM

manu movie Released on 7th

కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపనతో చేసిన చిత్రం మను అన్నారు రాజా గౌతమ్. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటించిన తాజా చిత్రం మను. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో రాజా గౌతమ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ బసంతి తరువాత సినిమా చేయడానికి మూడున్నరేళ్లు పట్టింది. ఈ సమయంలో చాలా లఘు చిత్రాలు చూశాను. మధురం, బ్యాక్‌స్పేస్ నాకు బాగా నచ్చాయి. వాటిని రూపొందించిన ఫణీంద్ర నర్సెట్టికి ఫోన్‌చేసి బాగా తీశావని అభినందించాను. ఆ తరువాత ఇద్దరం ఓ కాఫీషాప్‌లో కలిస్తే మను గురించి 15 నిమిషాలు చెప్పాడు. ఎవడు చేస్తాడో తెలియదు కానీ వాడికి మంచి పేరొస్తుంది అని మనసులో అనుకున్నాను.

ఒక రోజు మను పాత్ర మీరే చేస్తున్నారు అని ఫణీంద్ర నాకు సందేశాన్ని పంపించాడు. సినిమాలో నా పాత్ర పేరు మను. ఆర్టిస్ట్ట్‌గా కనిపిస్తాను. ఎక్కువ మాట్లాడను. సందర్భాన్ని బట్టి నాలోని భావోద్వేగాల్ని వ్యక్తపరుస్త్తుంటాను. నా పాత్ర ఎలా వుంటుంది అనేది తెరపైన చూడాల్పిందే. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నా పాత్ర తప్పకుండా నచ్చుతుంది. క్రౌడ్ ఫండింగ్ విధానంలో ఈ చిత్రాన్ని నిర్మించాం. దాదాపు 115 మంది ఈ చిత్రానికి సహకారం అందించారు. డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశాం అనడం కంటే సమయాన్ని వెచ్చించి పూర్తి స్పష్టతతో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాం. ఇలాంటి సినిమాలు విజయవంతమైతే మరి కొంత మంది యువ ప్రతిభావంతులు వస్తారని ఆశిస్తున్నాను. మను నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ చిత్ర ఫలితాన్ని బట్టి తదుపరి చిత్రాన్ని ఎంచుకుంటాను అన్నారు.

3347

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles