పరాజయాలు బాధించాయి!


Fri,September 7, 2018 12:11 AM

Anu Emmanuel on Shailaja Reddy Alludu Movie Relese Date 13th

కెరీర్ ప్రారంభంలో తప్పులు చేశాను. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఇంతకు ముందు కీర్తిసురేష్ నటన గురించి చాలా మంది కామెంట్‌లు చేశారు. మహానటి తరువాత ఆమెను కీర్తిస్తున్నారు. దర్శకుడు మంచి సినిమాలో అవకాశం ఇస్తే అందులో నటించిన వాళ్ల జీవితమే మారిపోతుంది అన్నారు అను ఇమ్మాన్యుయేల్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో అను ఇమ్మాన్యుయేల్ పాత్రికేయులతో ముచ్చటించారు.

కోపిష్టి అమ్మాయిగా..

సినిమాలో నా పాత్ర పేరు అనురెడ్డి. ఇగో వున్న కోపిష్టి అమ్మాయిగా కనిపిస్తాను. తన చుట్టూ వున్న వాళ్ల కంటే తనే నెంబర్‌వన్ అని గర్వంతో వుంటుంది. అయితే ఒక్కసారి ఎవరినైనా అభిమానిస్తే, ప్రేమిస్తే వారిని అమితంగా ఇష్టపడుతుంటుంది. తల్లికి, తనకు పెద్దగా పడదు. అలాంటి అమ్మాయి ప్రేమలో పడితే ఎలా వుంటుంది? తల్లీ కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా వుంటాయి? అన్నది సినిమాలో చూడాల్సిందే. రమ్యకృష్ణ, నా కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఇందులో రమ్యకృష్ణ నాకు తల్లిగా నటించారు. సెట్‌లో నన్ను చూసిన చాలా మంది అనురెడ్డి పాత్ర నా మనస్తత్వానికి చాలా దగ్గరగా వుందనేవారు. గత చిత్రాల్లో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం నా పాత్ర ఎక్కువ మాట్లాడుతుంది. నటిగా నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. సినిమాలో పాత్ర లాగే నిజజీవితంలోనూ నాకూ కోపం ఎక్కువే. అయితే దాన్ని ఎవరి మీద పడితే వారిమీద చూపించను. అలా చూపిస్తే ఇక్కడ వుండేదాన్నే కాదు.

ఆ కథలు విన్నాకే అంగీకరించాను...

పవన్‌కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రాన్ని కథ విన్నాకే అంగీకరించాను. అజ్ఞాతవాసి నా కెరీర్‌ను మూడు నాలుగేళు,్ల నా క్రేజ్‌ను కొనసాగిస్తుందని భావించాను. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని కూడా కథ విన్నాకే అంగీకరించాను. అయితే ఈ రెండు చిత్రాలు నా అంచనాల్ని తలకిందులు చేయడం నన్ను బాధించింది. కెరీర్ ప్రారంభంలో తప్పులు చేశాను. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఇంతకు ముందు కీర్తిసురేష్ నటన గురించి చాలా మంది కామెంట్‌లు చేశారు. మహానటి తరువాత కీర్తిసురేష్‌ను కీర్తిస్తున్నారు. దర్శకుడు మంచి సినిమాలో అవకాశం ఇస్తే అందులో నటించిన వాళ్ల జీవితమే మారిపోతుంది.

మిస్సయ్యాననే బాధ ఉంది..

గీత గోవిందంలో నటించే అవకాశం ముందు నన్నే వెతుక్కుంటూ వచ్చింది. అయితే ఆ సమయంలో నేను నా పేరు సూర్య.., శైలజారెడ్డి అల్లుడు చిత్రాల్ని ఒప్పుకున్నాను. దాంతో గీత గోవిందం చేయలేనని చెప్పేశాను. కనీసం అతిథి పాత్రలో అయినా కనిపించండి అని దర్శకుడు పరశురామ్ కోరడంతో అంగీకరించాను. సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ నేను ఆ చిత్రాన్ని చూడలేదు. ఇంత మంచి హిట్ చిత్రంలో నటించలేకపోయాననే బాధ మాత్రం వుంది.

తుది నిర్ణయం నాదే..

ఏదైనా సినిమా అంగీకరించాలంటే ఫైనల్ నిర్ణయం నాదే. అందులో ఎవరి ప్రమేయం వుండదు. నాకంటూ డ్రీమ్ రోల్స్ ఏమీ లేవు. మహానటి చిత్రం కీర్తిసురేష్ కెరీర్‌నే మార్చేసి మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాంటి పాత్రలు చేయాలని వుంది. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నేను గుర్తుండి పోవాలి. అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. తొలినాళ్లతో పోలిస్తే నటిగా చాలా నేర్చుకున్నాను. తెలుగు భాష అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. తెలుగులో ఇంకా ఏ సినిమా అంగీకరించలేదు. శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ తరువాతే మరో సినిమా అంగీకరిస్తా.

4830

More News

VIRAL NEWS