జీవితకథలపై ఇష్టం ఏర్పడింది!


Sun,December 30, 2018 12:04 AM

writer sai madhav burra at ntr biopic interview

ఎన్టీఆర్‌కు నేను వీరాభిమానిని. ఆయన జీవితకథకు మాటలు రాసే అవకాశం నాకు దక్కడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను అని అన్నారు సాయిమాధవ్ బుర్రా. కంచె, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గౌతమి పుత్రశాతకర్ణి, మహానటి చిత్రాలతో ప్రతిభావంతుడైన మాటల రచయితగా పేరుతెచ్చుకున్నారాయన. సాయిమాధవ్ బుర్రా సంభాషణలుసమకూర్చిన తాజా చిత్రం ఎన్టీఆర్. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సాయిమాధవ్‌బుర్రా పాత్రికేయులతో ముచ్చటించారు.

ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి సమాజానికి, ప్రజలకు ఉపయోగకరమైన విషయాల్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాను రూపొందించాం. ఆయన వల్ల సమాజంలో, చిత్రసీమలో వచ్చిన మార్పులను సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం, ఎన్టీఆర్ జీవితంలో ప్రపంచానికి తెలియని ఆసక్తికర సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిని అందరికి చెప్పాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రయాణంలో జరిగిన సంఘటనల్ని యథాతథంగా చూపించాం. ఇందులో ఎవరినీ కించపరచలేదు. ఇతరుల్ని బాధపెట్టే సన్నివేశాలు ఉండవు. అసంపూర్తిగా, అసంతృప్తిగా సినిమా ఉందనే భావన కలగదు.

ఎన్టీఆర్‌ను చూసినట్లుంది..

తొలుత ఈ సినిమాను ఒకే భాగంగా తెరకెక్కించాలని అనుకున్నాం. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని రెండు భాగాలుగా రూపొందించాం. ఎన్టీఆర్ జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించాలంటే పది, పదిహేను భాగాలైనా సరిపోవు. తండ్రి పాత్రలో బాలయ్యను చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్‌ను చూసినట్లుగా అనిపించింది. ఆయన్ని చూసి ఎన్టీఆర్ అని భ్రమపడిన సందర్భాలున్నాయి.

ఎన్టీఆర్ మేకప్‌మెన్‌గా..

రచయితగా నాకు వందశాతం సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ప్రతి సంభాషణ అద్భుతంగా ఉండాలనే ఆలోచనతో మనసుపెట్టి ఈ సినిమా కోసం పనిచేశాను. నా కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. బయోపిక్ కోసం కాకుండా స్వయంగా ఎన్టీఆర్‌కు సంభాషణలు రాస్తున్న భావనను కలిగించింది. రెండు భాగాలకు పనిచేయడం సవాల్‌గా అనిపించింది. రచయితగానే కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ వ్యక్తిగత మేకప్‌మెన్ పీతాంబరంగా కీలక పాత్రను పోషించాను. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల్లో ఎక్కువ నిడివి కలిగిన పాత్ర ఇదే.

ఇష్టపడి..

బయోపిక్‌లకు సంభాషణలు రాయడాన్ని కష్టంగా ఎప్పుడూ భావించలేదు. ప్రముఖుల జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసి వారి భావాలను అర్థం చేసుకొని సంభాషణలు రాయడంలో కొత్త అనుభూతి ఇమిడి వుంటుంది. అందుకే జీవిత కథలపై ఇష్టం ఏర్పడింది. నా సంభాషణల్లో కావాలనే తాత్వికతను చొప్పించే ప్రయత్నం ఎప్పుడూ చేయను. అవసరం లేకుండా ఏదీ రాయను. అలాగని సమాజానికి మంచి చెప్పే అవకాశం వస్తే వదులుకోను.

ఆత్రేయ స్ఫూర్తి..

రచయితగా ఆత్రేయ నాకు స్ఫూర్తి. అలాగే జంధ్యాల, పరుచూరి బ్రదర్స్ రచనాశైలిని ఇష్టపడతాను. సంభాషణలతో పాటు కృష్ణవందేజగద్గురుమ్, గౌతమిపుత్రశాతకర్ణి సినిమాల్లో పాటలు రాశాను. ప్రస్తుతం ఓ సినిమా కోసం కథ రాస్తున్నాను. దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంతో పాటు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు మాటలు రాస్తున్నాను.

1379
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles