కలల సాకారంలో విలేజ్ రాక్‌స్టార్స్


Mon,September 24, 2018 12:02 AM

Village Rockstars is India official entry to Oscars 2019

కలార్దియా..అస్సాం రాష్ట్రంలోని మా మారుమూల గ్రామం. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు ఉన్న రిమాదాస్ సొంతం ఊరు అది. ఒకరోజు యథాలాపంగా ఊరిలోని వీధిలో నడిచి వెళుతున్న ఆమెకు ఓ బాలబాలికల బృందం కనిపించింది. డమ్మీ వాయిద్య పరికరాలతో వారంతా ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. ఆ చిన్నారుల ప్రపంచంలో ఏదో తెలియని ఆకర్షణ కనిపించిందామెకు. తాము సొంతంగా తయారుచేసుకున్న వాయిద్య పరికరాలతో ఆ పిల్లలు అద్భుతమైన ప్రతిభను కనబరచడం ఆమెను ముగ్ధ్ధురాలిని చేసింది. ఆ సంఘటన స్ఫూర్తితో రిమాదాస్ అస్సామీ భాషలో రూపొందించిన చిత్రమే విలేజ్ రాక్‌స్టార్స్...ప్రస్తుతం ఈ చిత్రం భారత్ తరపున 2018 సంవత్సరానికిగాను అధికారికంగా ఆస్కార్ ఎంట్రీగా ఎంపికై సంచలనం సృష్టించింది. పన్నెండుమందితో కూడిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బృందం ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో భారత్ నుంచి విలేజ్ రాక్‌స్టార్స్‌ను అధికారికంగా ఎంపికచేసింది. దాదాపు 28 చిత్రాలను పరిశీలించిన కమిటీ చివరకు విలేజ్ రాక్‌స్టార్స్ వైపు మొగ్గు చూపింది.

రిమాదాస్..ఓ స్వాప్నికురాలు

అస్సాంకు చెందిన రిమాదాస్ సోషియాలజీలో మాస్టర్స్ చేసింది. ఎందరో ఆశావహుల మాదిరిగానే వెండితెరపై వెలిగిపోదామని కొన్నేళ్ల క్రితం ముంబయిలో అడుగుపెట్టింది. కొన్ని నాటకాలు చేసింది. అయితే నటిగా అంతగా రాణించలేకపోయింది. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా దర్శకత్వంవైపు దృష్టిపెట్టింది. ప్రపంచ సినిమాను పరిశోధిస్తూ అమోఘమైన పరిజ్ఞానాన్ని సంపాదించింది. తొలి ప్రయత్నంగా మ్యాన్ విత్ ది బైనాక్యులర్ (2013) అనే చిత్రాన్ని తీసింది. ఇది పలు అవార్డులు గెలుచుకుంది. ఇదే స్ఫూర్తితో 2014లో విలేజ్ రాక్‌స్టార్స్ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు నాలుగేళ్లు శ్రమించింది. దర్శకత్వం మొదలుకొని ఎడిటింగ్, ప్రొడక్షన్, సినిమాటోగ్రఫీ...ఇలా అన్ని వ్యవహారాల్ని దగ్గరుండి పర్యవేక్షించింది. ఈ సినిమా అనుభవాల గురించి రిమాదాస్ మాట్లాడుతూ దర్శకత్వ విభాగంలో నేను ఎవరి దగ్గరా పనిచేయలేదు. సినిమా మీద వ్యామోహమే నన్ను దర్శకత్వం వైపు నడిపించింది.

విలేజ్ రాక్‌స్టార్స్ చిత్రాన్ని మొత్తం నా స్వగ్రామంలోనే తెరకెక్కించాను. ఇక్కడి పిల్లల్ని నటీనటులుగా ఎంపిక చేసుకున్నాను. మీతో సినిమా చేస్తున్నాను అని చెప్పగానే వారు ఎక్సైట్ అయ్యారు. వారి కళ్లలో ఏదో మెరుపు కనిపించింది. షూటింగ్‌కు ముందు వారితో కొన్ని రోజులు వర్క్‌షాప్ నిర్వహించాను. పిల్లలందరూ అద్భుతమైన నటనను కనబరిచారు. వారికి తాము యాక్టింగ్ చేస్తున్నామనే విషయం తెలియదు. అందుకే ప్రతి సన్నివేశం సహజంగా వచ్చింది అని చెప్పింది రిమాదాస్. విలేజ్ రాక్‌స్టార్స్ చిత్రాన్ని సాధారణ కెమెరాతో చిత్రీకరించారు. ఆర్థికపరమైన పరిమితుల కారణంగా చిత్రీకరణకు నాలుగేళ్ల సమయం పట్టింది. ఈ ఏడాది ప్రకటించిన జాతీయ అవార్డుల్లో విలేజ్ రాక్‌స్టార్స్ ఉత్తమ చిత్రం, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్..విభాగాల్లో అవార్డుల్ని గెలుచుకుంది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు 70కిపైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సత్తా చాటింది. సినిమాలో ఒక్కసీన్ కోసం పదిరోజులు శ్రమించిన సందర్భాలున్నాయి. ఏ పనిచేసినా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాను. ఎలాంటి పరిధులు లేకుండా నాలో సృజనాత్మక తృష్ణను ఆవిష్కరించుకోవాలనే సొంతంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టాను అని చెప్పింది రిమాదాస్.

విలేజ్ రాక్‌స్టార్స్ కథేమిటంటే..

దును అనే పదేళ్ల అమ్మాయి కథ ఇది. ఊరిలో అమ్మకు చేదోడువాదోడుగా ఉంటూ జీవితాన్ని సాగిస్తుంటుంది. ఓ సారి గ్రామంలో సంగీత విభావరి జరుగుతుంది. అది చూసి దునుకు సంగీతం పట్ల వ్యామోహం కలుగుతుంది. ఎలాగైనా ఎలక్ట్రానిక్ గిటార్ సంపాదించుకొని సంగీతం నేర్చుకోవాలనుకుంటుంది. తన కలలు నెరవేరాలంటే ఓ మ్యూజిక్ బ్యాండ్ వుండాలనే నిర్ణయానికి కొస్తుంది. అందుకోసం కష్టించి డబ్బు సిద్ధం చేస్తుంది.

ఈ లోగా గ్రామం వరదల బారిన పడుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో దును ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తన స్వప్నాలకు, వాస్తవానికి మధ్య ఏ విధంగా నలిగిపోయింది? అన్నదే చిత్ర కథ. సార్వజనీన, మానవీయ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం అస్సామీ పరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నటించిన బన్నితాదాస్ ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలవడంతో మరో ఘనతను సాధించినట్లయింది. ఈ నెల 28న విలేజ్ రాక్‌స్టార్స్ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

2499

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles