మరణం నుంచి పుట్టిన కథ ఇది!


Wed,September 13, 2017 12:03 AM

కథా రచనలోనే అంతులేని సంతృప్తి దాగివుందని, ప్రతి కథను హృదయం లోతుల్లోంచి ప్రేమించి రాస్తానని అన్నారు ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్. పాతికేళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటివరకూ స్పృశించనటువంటి థ్రిల్లర్ కథతో శ్రీవల్లీ సినిమా చేస్తున్నానని చెప్పారాయన. బాహుబలితో తెలుగు సినిమా నడతను మార్చారు విజయేంద్రప్రసాద్. రచయితగా విశ్వవేదికపై తెలుగు సినిమా ప్రాభవాన్ని చాటారు.విజయేంద్రప్రసాద్ కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విజయేంద్రప్రసాద్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి....
VijayendraPrasad

శ్రీవల్లీ కథకు ఎప్పుడు అంకురార్పణ జరిగింది?

-శ్రీవల్లీ కథ విషాదం నుంచి పుట్టింది. రమేష్ అని నాకో స్నేహితుడుండేవాడు. మేమిద్దరం కలిసే చదువుకున్నాం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అతడితో సంబంధాలు తెగిపోయాయి. 2010లో వినాయక చవితి రోజు అతను చాలా గుర్తొచ్చాడు.ఆ తర్వాత రెండు సంవత్సరాలకు విజయవాడ వెళ్లినప్పుడు ఓ స్నేహితుడి ద్వారా రమేష్ ఇంటికి వెళ్లాను. కానీ వాడు చనిపోయాడని తెలిసింది. చనిపోయే ముందు నన్ను చూడాలని కలవరించాడని, ఆ విషయాన్ని డైరీలో రాసుకున్నాడని వాళ్ల అమ్మ చూపించింది. నేను హైదరాబాద్‌లో ఉండి అతడి గురించి తలచుకుంటున్న సమయంలో విజయవాడలో ఉన్న రమేష్ నా గురించే ఎలా ఆలోచించగలిగాడు? అదేలా సాధ్యమనే ఆలోచన మొదలైంది. ఆ పాయింట్ నుంచే కథ పుట్టింది. అలా నా మిత్రుడి మరణం నుంచి ఈ కథకు బీజం పడింది.

శ్రీవల్లీతో ఏం చెప్పబోతున్నారు?

-పుట్టుకతో ఎవరూ వ్యసనపరులు, దుర్మార్గులు కారు. పరిస్థితుల వల్ల అలా మారిపోతారు. మనిషి మనసును చూడటం వల్ల అతడిని సన్మార్గుడిగా మార్చవొచ్చనే అంశాలకు నాటకీయతను మేళవించి ఈ సినిమాను రూపొందించాం. అశోక్ మల్హోత్రా అనే శాస్త్రవేత్త మనిషి భావతరంగాలను కొలవగలిగే మిషన్‌ను తయారు చేస్తాడు. ఆ ప్రయోగాన్ని శ్రీవల్లీ అనే అమ్మాయిపై చేస్తాడు. ఈ ప్రయోగం వల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? రెండు జన్మల మధ్య ఏర్పడిన సంఘర్షణ నుంచి ఆమె ఎలా బయటపడింది? అన్నదే చిత్ర ఇతివృత్తం.

దర్శకుడిగా, కథకుడిగా ఈ సినిమా మీకు ఎలాంటి సంతృప్తిని మిగిల్చింది?

-నా కెరీర్‌లో ఇప్పటివరకు థ్రిల్లర్ కథను రాయలేదు. సరదాగా రాద్దామనే ఆలోచనతో ఈ సినిమా చేశాను. ఈ సినిమా విషయంలో మూడు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన పీహెచ్‌డీ వచ్చినంత గర్వాన్ని తెచ్చిపెట్టింది. ఇటీవలే ఈ చిత్రాన్ని రచయిత పరుచూరి గోపాలకృష్ణకు చూపించాను. సినిమాలో వచ్చే ప్రతి మలుపు తదుపరి వచ్చే సన్నివేశమేమిటో ఊహించి చెప్పమని ఆయన్ని అడిగాను. సినిమా మొదలైన తర్వాత ఆయన అందులో పూర్తిగా లీనమైపోయారు. మొత్తం చూసిన తర్వాత చాలా బాగా చేశావు, ఇంకో ముప్పై సెకన్లలో సినిమా అయిపోతుందనగా కూడా సస్పెన్స్ కొనసాగడం బాగుందని అన్నారు. ఎక్కడ నా ఊహలకు అందకుండా ఆసక్తికరంగా సాగిందని చెప్పారు. నా పాతికేళ్ల రచనా ప్రస్థానంలో ఆయన మాటలే పెద్ద అవార్డుగా అనిపించాయి. అంత గొప్ప రచయితను మెప్పించడం ఆనందాన్నిచ్చింది.

బాహుబలి తర్వాత మీ కథలకు మార్కెట్ పెరిగింది. అలాంటప్పుడు ఈ సినిమాను కొత్తవారితో రూపొందించాలనే ఆలోచన ఎందుకొచ్చింది?

-రెండేళ్ల క్రితం ఈ చిత్ర నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌లు సినిమా చేసిపెట్టమని నా దగ్గరకు వచ్చారు. వారికి రెగ్యులర్ కమర్షియల్ కథలు చెప్పాను. దానికి వారు నిర్మాతగా మా తొలి సినిమా ఇదే. ఈ సినిమా ద్వారా ఎంత సంపాదించామనేది కాకుండా ఇప్పటివరకూ ఎవరు చేయని ప్రయత్నం చేశామనే తృప్తి, పేరు ముఖ్యం. అలాంటి కథను చెప్పండి అన్నారు. కమర్షియల్ కథల్లో ఎక్కడో ఒక దగ్గర పోలికలు కనిపిస్తాయి. బాహుబలి చూసుకుంటే అత్తా కోడళ్లు, అన్నాదమ్ముల మధ్య వైరంతో ఈ సినిమా ఉంటుంది. కథా పరంగా చూసుకుంటే అందులో ఎలాంటి నవ్యత లేదు. దానికి నాటకీయత మేళవించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో గొప్ప సినిమా అయింది. కొత్తగా చేయాలనే ఇప్పటివరకు టచ్ చేయని థ్రిల్లర్ కథాంశంతో ఈసినిమా చేశాను.

రాజమౌళి ఈ సినిమా చూశారా?

-కథ చెప్పాను. విని చాలా థ్రిల్‌గా ఫీలయ్యాడు. రాజమౌళితో పాటు క్రిష్, సుకుమార్ ఇలా పలువురికి వినిపించాను. ఇప్పటివరకు ఇలాంటి కథను వినలేదు, చూడలేదు అనిప్రతి ఒక్కరు అన్నారు.

బాహుబలి తర్వాత దక్షిణాది సినిమాల పట్ల బాలీవుడ్‌లో గౌరవం పెరిగిందని అనుకుంటున్నారా?

-1985లో చిత్రసీమతో నా అనుబంధం మొదలైంది. ఆ రోజుల్లో త్రివిక్రమరావు, మురారి, దేవీప్రసాద్ ఇలా నిజమైన నిర్మాతలతో పనిచేశాను. వారంతా మంచి కథలు రాయమని చెప్పేవారు. కథ రాసిన తర్వాతే హీరో, దర్శకుడు ఎవరనేది నిర్ణయించేవారు. రాను రాను ఆ ధోరణి తెరమరుగైపోయింది. బజరంగీ భాయిజాన్, బాహుబలి తర్వాత మళ్లీ ఆ పంథా నాతో తిరిగి మొదలైనందుకు గర్వపడుతున్నాను. బాలీవుడ్ నుంచి పలువురు నిర్మాతలు నా దగ్గరకు వచ్చి మంచి కథ రాయండి. ఆ తర్వాత హీరో, దర్శకుల్ని తామే వెతుక్కుంటామని చెబుతున్నారు. రచయితల విలువను గుర్తించడం ఆనందంగా ఉన్నది.

విజయ్ చిత్రం మెర్సల్‌తో తొలిసారి తమిళంలో అడుగుపెట్టడం ఎలా ఉంది?

-మెర్సల్ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చాను. ఆ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వేడుకలో జరిగిన ఓ సంఘటన నాలో ఆనందాన్ని నింపింది. వేదికపై ఉన్న ఏ.ఆర్.రహమాన్ నా దగ్గరకు వచ్చి ఓ పాయింట్ ఉందని దానిని డెవలప్ చేసి పెట్టమని అడగటం మరచిపోలేని ఆనందాన్నిచ్చింది.

దర్శకుడిగా రాజమౌళి సాధిస్తున్న విజయాల్ని చూస్తుంటే తండ్రిగా ఏమనిపిస్తుంది?

-మహాభారతం ఎప్పుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్నాను. బాహుబలి మొదలయ్యే సమయంలో జానపద చిత్రం ఎందుకు చేస్తున్నానో మీరు ఊహించగలరా అని నన్ను రాజమౌళి అడిగాడు. యుద్ధ్దాలంటే ఇష్టం కాబట్టి చేస్తున్నావని చెప్పాను. ఎప్పటికైనా మహాభారతం తీయాలన్నది నా కల. అది నేను చేయగలనో? లేదో ? ఈ సినిమాతో నన్ను నేను పరీక్షించుకోవడానికి చేస్తున్నానని చెప్పాడు. మహాభారతాన్ని ఒక భాగంలో చెప్పడం సాధ్యం కాదు. అలా చేస్తే న్యాయం జరగదు. ఐదారు భాగాలైనా ఉంటుందని అనుకుంటున్నాను.

చిరంజీవి, రామ్‌చరణ్ కలయికలో మగధీర-2చేస్తానని అన్నారు.

-మనసులో ఆ కోరిక ఉన్నది. చిరంజీవి, రామ్‌చరణ్‌ల కలయికలో కథ రాయాలని ఆ అవకాశం నాకు దక్కాలని ఎదురుచూస్తున్నాను. శ్రీవల్లి ప్రీరిలీజ్ వేడుకకు రామ్‌చరణ్ అతిథిగా రావడంతో ఎంతో ఆనందపడ్డాను.

మళ్లీ దర్శకత్వం ఎప్పుడూ చేయబోతున్నారు?

VijayendraPrasadV
-తెలుగుతో పాటు హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. దసరా రోజున ఆ వివరాల్నివెల్లడిస్తాను.

-గతంలోతెలుగువారితో పోలిస్తే తమిళులు తెలివైన వారనే భావన ఉండేది.కొన్ని సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి. తెలుగు కథలతో తమిళంలో రూపొందిన సినిమాలు తక్కువే ఉండేవి. బాహుబలితో ఆ ధోరణిలో మార్పువచ్చింది. తెలుగులో తెలివైన వాళ్లు ఉన్నారు. మంచి సినిమాలు తీయగలరనే నమ్మకం పెరిగింది.

-దర్శకత్వం అంటే నాకు చాలా ఇష్టం. సమయం, వీలు దొరికితే చేస్తుంటాను. దర్శకత్వం చేయడం కోసమే ఈ కథ రాశాను. సినిమాలు రాకపోవడంతోనే రాజన్న తర్వాత విరామం వచ్చింది. ఇన్నాళ్లు నా కథలకు తగ్గ హీరోలు దొరక్కపోవడంతో పాటు హీరోలను ఒప్పించగల కథలు నేను చెప్పలేక పోయాను. దానితో పాటు బజరంగీ భాయిజాన్, బాహుబలి కథలతో బిజీగా ఉండటంతో దర్శకత్వం చేయడం కుదరలేదు. కారణాలు ఏవైనా తప్పు చేయడానికి మనసు ఇష్టపడదు.

1516

More News

VIRAL NEWS