దొరసానితో మ్యాజిక్ సృష్టించారు


Mon,July 8, 2019 11:50 PM

Vijay Devarakonda finally reveals why he stopped talking to Dorasani actor Anand

ఇక్కడ మనల్ని ప్రేమిస్తారు, ద్వేషిస్తారు. అర్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుంటారు. ఎవరేమనుకున్నా మన ధర్మం పాటిస్తూ ముందుకెళ్లాలి. అప్పుడే విజయాలు వరిస్తాయి అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం దొరసాని. రాజశేఖర్ తనయ శివాత్మిక నాయికగా అరంగేట్రం చేస్తున్నది. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మాతలు. ఈ నెల 12న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ తన తమ్ముడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ తమ్ముడు ఇంటికి డబ్బులు పంపించేవాడని, వాడి సహాయం వల్లనే తానీ స్థాయిలో ఉన్నానని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తమ్ముడు సినిమాల్లోకి వస్తానంటే వద్దని చెప్పాను.

స్క్రిప్ట్ మొదలుకొని సినిమా విడుదల వరకు ఎన్నో కష్టాలుంటాయని వారించాను. కథ బాగా నచ్చింది.. సినిమా చేస్తానన్నాడు. సినిమా కష్టాలేమిటో వాడే స్వయంగా తెలుసుకోవాలని వదిలేశాను. ప్రమోషన్ విషయంలో కూడా జోక్యం చేసుకోలేదు. చిన్నప్పుడు నేను, తమ్ముడు పుట్టపర్తిలో చదువుకున్నాం. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు వాడు ఒకటో తరగతిలో చేరాడు. స్కూల్ ప్రారంభమైన రోజున ఉరుక్కుంటూ వచ్చి మా క్లాస్ ముందు కూర్చున్నాడు. ఐదు నిమిషాలకొకసారి నా వైపు చూస్త్తూ నేనున్నానని ధైర్యంగా ఫీలయ్యాడు. అలా మూడు రోజులు నా క్లాస్‌లోనే కూర్చున్నాడు. నేనంటే తమ్ముడికి అంత ఇష్టం. ఈ వేడుకకు వచ్చేముందు సినిమా చూపించమని అడిగా. సినిమా చూశాక దర్శకుడు మహేంద్ర ఓ మ్యాజిక్ క్రియేట్ చేశాడనిపించింది. కొన్ని చోట్ల సంభాషణలు లేకుండా పర్‌ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. శివాత్మిక అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంటుంది. ఆనంద్ నటన గురించి నేను చెబితే బాగుండదు.

సినిమా విడుదలయ్యాక మీరే మాట్లాడుతారు. మహేంద్ర నాకోసం కథ రాస్తున్నానని చెప్పాడు. త్వరగా పూర్తి చేసి నాకు వినిపించమన్నాను. పరిశ్రమలో ప్రతి నటుడికి విమర్శలు ఎదురవుతాయి. వాటిని స్వీకరించినప్పుడే ఇక్కడ నిలబడగలుగుతాం అన్నారు. దొరసాని కథ దాచుకోలేని ఓ ఎమోషన్. వాస్తవికత..కొత్తదనం కలబోతగా ఆకట్టుకునే పీరియాడిక్ ప్రేమకథ అని దర్శకుడు తెలిపారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ జీవితంలో డబ్బుల గురించి చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాం. గత మూడేళ్లలో అవన్నీ తీరిపోయాయి. విజయ్ కష్టం వల్లే అది సాధ్యమైంది. నా వెనక దేవరకొండ అనే పేరు ఉందని సినిమా చేయడం లేదు. దర్శకుడు మహేంద్ర చెప్పిన కథ నన్ను కదిలించింది. రాజు అనే పాత్రలో ప్రేక్షకులు నన్ను స్వీకరిస్తారని నమ్ముతున్నాను అన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టర్ కావాలన్నది తన కోరికని, అది ఈ సినిమాతో తీరిందని శివాత్మిక చెప్పింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, జీవిత, నందినిరెడ్డి, రామజోగయ్యశాస్త్రి, తరుణ్‌భాస్కర్, గోరటి వెంకన్న, ప్రశాంత్ విహారి, వెంకట్ సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1274

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles