జెర్సీ.. ఓ జీవిత పాఠం


Tue,April 16, 2019 12:20 AM

victory venkatesh superb speech at jersey movie pre release

ప్రతి ఒక్కరు జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు. వాటిని ధైర్యంగా ఎదురించి లక్ష్యాన్ని చేరుకోవాలని నాని ఈ సినిమాతో చెబుతున్నారు. అందరికి ఓ జీవితం పాఠంగా ఈ సినిమా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను అని అన్నారు వెంకటేష్. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 19న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో వెంకటేష్‌కు నాని తొలి టికెట్‌ను అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఈ వేడుకకు రాలేదు. జెర్సీ లాంటి నిజాయితీతో కూడిన సినిమాపై ఉన్న ప్రేమ నన్ను ఇక్కడకు రప్పించింది. ఫస్ట్‌లుక్‌తోనే ఈ సినిమా నాకు చాలా నచ్చింది. రియలిస్టిక్ ఫీల్ కనిపించింది. దర్శకుడు గౌతమ్ తాను ఏం చెప్పాలని అనుకున్నాడో దానిని పరిపూర్ణంగా తెరపై ఆవిష్కరించారు.

ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇలాంటి నిజాయితీతో కూడిన సినిమాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి మంచి సినిమాలో నాని నటించడం సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాల్లో నటులకు తమ పాత్రల్లో జీవించే అవకాశం దొరుకుతుంది. సినిమా పూర్తయిన వదిలిపెట్టి రావాలని అనిపించదు. ఎమోషనల్ అయిపోతాం. స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఇది అలాంటి సినిమానే. కథను నమ్మి మంచి సినిమాను తెరకెక్కించారు నిర్మాతలు. తొలి సినిమా అష్టాచమ్మా నుండి నాని ప్రతి సినిమాతో నటుడిగా ఎదుగుతూనే ఉన్నాడు. నాని లాంటి నాచురల్ యాక్టర్ తెలుగు చిత్రసీమలో ఉండటం గర్వంగా ఉంది అని తెలిపారు. శ్రద్ధాశ్రీనాథ్ మాట్లాడుతూ మంచి సినిమాలు, శక్తివంతమైన మహిళా ప్రధాన పాత్రలు చేయాలనుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ ప్రయాణంలో గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకులతో పనిచేయడం ఆనందంగా ఉంది. నాని, సత్యరాజ్, అనిరుధ్ లాంటి ప్రతిభావంతులు పనిచేసిన సినిమాలో నేను చిన్న భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది.

వెంకటేష్‌తో సినిమా చేయాలనుంది: నాని
నాని మాట్లాడుతూ వెంకటేష్ అవకాయ లాంటి వారు. ఆయనను ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బిగ్ స్క్రీన్‌పై చూసి వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చిన ఏకైక స్టార్ వెంకటేష్. ఆయన నా సినిమా వేడుక రావాలనే కోరిక ఈ జెర్సీతో తీరింది. ఇద్దరం కలిసి నటించి ఒకే వేదికను పంచుకోవాలనే కోరిక నా మనసులో ఇంకా బలంగా అలాగే ఉంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. మల్టీస్టారర్ టాపిక్ ఎప్పుడు వచ్చినా నేను వెంకటేష్ కలిసి నటిస్తే బాగుంటుందని చాలా మంది చెప్పారు. ఏప్రిల్ 19న నాతో పాటు మా టీమ్‌ను చూసి ప్రతి ఒక్కరూ గర్వపడతారు. అందరూ గర్వించే సినిమాలో నేను భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను.

బ్లాక్‌బాస్టర్ సినిమా లాంటి మాటలు చెప్పాలనిపించడంలేదు. మంచి సినిమా పక్కన అలాంటి పదాలు పెట్టను. గొప్ప సినిమా చేశానన్న సంతృప్తి ఉంది. దర్శకుడు గౌతమ్ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. గౌతమ్ ఈ వేదికపై లేకపోయినా అతడి సినిమా మాట్లాడుతుంది. సంగీతం, ఎడిటింగ్, కెమెరా, నటీనటులు అందరూ కథ చెప్పడంలో ఓ భాగం అయ్యారు. అందమైన సినిమా చేశానన్న అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నానుఅని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్‌వర్మ, మారుతి తదితరులు పాల్గొన్నారు.

991

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles