అనిల్ దగ్గర ఏదో మ్యాజిక్ వుంది!

Published: Fri,January 11, 2019 11:30 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటించిన చిత్రం ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా చిత్ర బృందం గురువారం రాత్రి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతికి నా నుంచి వచ్చిన ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదిరించారు. ఈ సారి వస్తున్న ఎఫ్2 కూడా అలానే సక్సెస్ అవుతుందన్న నమ్మకముంది. ఓ కథ విన్నప్పుడు ప్రేక్షకుడిలానే వింటా. దర్శకుడితో స్నేహితుడిలా అభిప్రాయాలు పంచుకుంటా. అనిల్ రావిపూడిలో ఏదో ఓ మాయ ఉంది. తను వినోదాన్ని అత్యున్నత స్థాయిలో చూపించాడు.

సాధారణంగా కామెడీ పండించడం చాలా కష్టం. ఒకట్రెండు టేకుల్లో సీన్ ఓకే అయిపోవాలి. లేదంటే మళ్లీ రాదు. ఓ సీన్ చేశాక అనిల్ సహయ దర్శకులతో చర్చించేవాడు. దాంతో మళ్లీ చేయమంటారేమో అయిపోయాన్రా అని భయపడేవాడిని అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ తొలిసారి ఓ మాస్ పాత్రని ప్రయత్నించాను. ఈ సినిమా షూటింగ్ ఎలా మొదలైందో, ఎలా ముగిసిందో అర్థం కావడం లేదు. అనిల్ రూపంలో మంచి స్నేహితుడు దొరికాడు. మా ఇంట్లో రాజేంద్రప్రసాద్‌గారు నటించిన సీడీలు వుంటాయి. నవ్వుకోవాలని అనిపించినప్పుడు ఆయన సినిమాలు చూసేవాడిని. అలాంటి నటుడితో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని 80 శాతం కామెడీతోనే నింపేశాం. టైమింగ్ వున్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు.

వెంకీ, తమన్నా మధ్య వుండే కెమిస్ట్రీ, కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. వరుణ్ తెలంగాణ యాసతో ఆకట్టుకుంటాడు అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ఓ సినిమా సిద్ధం కావడానికి 24 విభాగాలు శ్రమించాల్సిందే. ఈ సినిమాకు మేమంతా అలాగే కష్టపడ్డాం. కలియుగ పాండవులుతో వెంకటేష్‌గారికి అభిమానిని అయ్యా. ఆయనతో రెండవ సారి కలిసి పనిచేసే అవకాశం దక్కింది. కథ విన్న వెంటనే వరుణ్ ఒప్పుకున్నాడు. అనిల్ దగ్గర ఓ మ్యాజిక్ వుంది. పూర్తి స్క్రిప్ట్ లేకుండా సినిమా తీయడానికి ఒప్పుకోను. కానీ నాకు సన్నివేశాలు మాత్రమే చెప్పి ఒప్పిస్తాడు అన్నారు.

2999

More News