రోజా సినిమాతో నా కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయేది!


Fri,January 11, 2019 01:40 PM

Venkatesh Interview About F2 Movie

ఫలితం ముందే తెలిస్తే జీవితంలో కిక్ అనేది వుండదు. అప్పుడప్పుడు తప్పులు దొర్లితేనే వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. మనం బాగుండాలని కోరుకోవడం కంటే మన పక్కవాడు బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే అంతా బాగుంటుంది అన్నారు హీరో వెంకటేష్. వరుణ్‌తేజ్‌తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటున్నారు సినిమా ఎలా వుండబోతోంది?

సినిమాలో పాత్రల మధ్య ఫ్రస్ట్రేషన్ కారణంగా కామెడీ పుడుతుంటుంది. మేము తీసుకున్న అంశమే పూర్తి స్థాయి వినోద భరితంగా సాగుతుంది. చాలా మంది జీవితాల్లో పెళ్లికి ముందు, పెళ్లి తరువాత ఎదురయ్యే సంఘటనల సమాహారంగా ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఇటీవల నేను నటించిన దృశ్యం, గురు చిత్రాలు నా పంథాకు భిన్నంగా సీరియస్‌గా సాగుతాయి. తరువాత చేయబోయే సినిమా వాటికి భిన్నంగా వుండాలనుకున్నాను. కథ వింటున్నప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్, మళ్లీశ్వరి చిత్రాల్లోని సన్నివేశాలు గుర్తొచ్చాయి. అందుకే వెంటనే అంగీకరించాను.

ఇమేజ్‌ని పట్టించుకుంటే ఇలాంటి చిత్రాల్లో నటించడం కష్టంగా వుంటుంది. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా?

చాలా సందర్భాల్లో చాలా మంది నన్ను ఈ ప్రశ్న అడిగారు. ఇమేజ్ అనే పదమే నాకు అర్థం కాదు. అందుకే దాని గురించి సమాధానం చెప్పడానికి తర్జన భర్జన పడుతుంటాను. నేను చేస్తున్న పనిని తప్ప మరో విషయంపై ఎప్పుడూ శ్రద్ధపెట్టను. ప్రేక్షకులు నా పనిని అభినందిస్తున్నారు. అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అంత వరకే నా ఆలోచన వుంటుంది. నాకంటూ ఒక ఇమేజ్ వుండాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఇమేజ్ అనేది ప్రేక్షకులు కల్పించేది. అది నా చేతుల్లో వుండదు. అందుకే దాని గురించి నేను పెద్దగా ఆలోచించను.

గురు తరువాత రెండేళ్లు విరామం తీసుకోవడానికి కారణం?

గురు తరువాత చాలా కథలు అనుకున్నాను. కానీ ఏదీ కుదరలేదు. ఓ స్థాయికి వచ్చాక ఏదీ మన చేతుల్లో వుండదు. అయితే గురు తరువాత చేయబోయే సినిమా కొత్తగా వుండాలనుకున్నాను. రెగ్యులర్ కథలు చేయకూడదనుకున్నాను. యంగ్ హీరోలంతా ప్రస్తుతం కొత్త తరహా చిత్రాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏదైనా కొత్తగా చేయాలనే విరామం తీసుకున్నాను.

దృశ్యం ,గురు చిత్రాల తరువాత పంథా మార్చారని అంతా అనుకున్నారు. కానీ మీరు మాత్రం మళ్లీ పాత పంథాలోనే ఎఫ్2తో వస్తున్నారు?

రెగ్యులర్ చిత్రాల్లోనే కొత్తగా ప్రయత్నించాలని చేసిన సినిమా ఇది. కథ పాతదే అయినా పాత్రల చిత్రణ, ఎంటర్‌టైన్‌మెంట్ రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటాయి. పైగా ఇదొక మల్టీస్టారర్ చిత్రం. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత అనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఇంత వరకు ఏ సినిమా రాలేదు. ఇలా ప్రతి విషయంలోనూ ఎఫ్2 కొత్తగా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

నిర్మాణ దశలోనే సినిమా ఫలితం తెలిసిపోతుంటుందని ఆ మధ్య అన్నారు. ఈ సినిమా విషయంలో మీకు ఫలితం ముందే తెలిసిందా?

గత ఐదేళ్ల కాలంలో కుటుంబ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయదగ్గ సినిమా ఏదీ సంక్రాంతికి విడుదల కాలేదు. ఆ లోటును తీర్చే సినిమా ఎఫ్2 అవుతుందని కచ్చితంగా చెప్పగలను. తప్పకుండా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ధియేటర్‌కు వస్తారు.

మీ తరం నటులకు, నేటి తరం నటులకు మీరు గమనించిన తేడా?

నటన పరంగా నేను ఎలాంటి వ్యత్యాసాన్ని గమనించలేదు. అయితే కొంత మందికి సహజంగా ఓ టాలెంట్ వుంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీయడానికి మంచి సందర్భం వస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్లేంటనేది అందరికి అర్థమవుతుంది. ఓపికతో ప్రయత్నిస్తే ఎవరికైనా ఎప్పటికైనా మంచి స్థాయి ఏర్పడుతుంది. అలాంటి సమయం కోసం ఓపికతో ఎదురుచూడటం అనేది మన చేతుల్లో వుంది. చేసే పనిని ఆస్వాదిస్తూ ముందడుగు వేస్తే ఏదో ఒక రోజు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటాం.

సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఏదైనా సందేశం వుంటుందా?

మగవాళ్లు ఆడవాళ్ల విషయంలో ఎంత బెట్టుని ప్రదర్శించినా చివరికి మాత్రం ఆడవాళ్లను గౌరవించాల్పిందే అని ఈ చిత్రం ద్వారా మంచి సందేశాన్ని అందిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ అంగీకరిస్తారు. అందరూ తప్పులు చేస్తారు. వాటిని సరిదిద్దుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఇవ్వాలన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. మన దైనందిన జీవితంలో మహిళలకున్న ప్రాధాన్యత గురించి చక్కగా వివరించే ప్రయత్నం చేశాం.

మీ సుదీర్ఘ్గ ప్రయాణంలో ఇలాంటి పాత్ర చేయలేకపోయానే అని ఎప్పడైనా అనిపించిందా? అమీర్‌ఖాన్ తరహాలో ఎందుకు చేయలేకపోతున్నానని, బాహుబలి లాంటి సినిమా మనకెందుకు రాలేదని నాకే కాదు అందరికి వుంటుంది. అలా అని అలాంటి పాత్రలు అందరికి రావు. చూసి వదిలేయాలి అంతే. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అప్పట్లో రోజాలో నటించే అవకాశం నాకే వచ్చింది. అది చేసుంటే నా కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయేది. దురదృష్ణ వశాత్తు నాకు ప్రమాదం జరగడం వల్ల ఆ సినిమాలో నటించలేక పోయాను.

మీ తదుపరి చిత్రం వెంకీ మామ ఎలా వుంటుంది?

పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగే చిత్రమిది. బంధాలు, అనుబంధాల గురించి తెలియజేస్తుంది.

త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది త్వరలోనే సెట్స్‌పైకి వస్తుంది.

మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి కారణం?

మల్టీస్టారర్స్ చేస్తే కొత్త వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. అంతే కాకుండా తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుత జనరేషన్ ఏం కోరుకుంటున్నారు? ఎలా పనిచేస్తున్నారు అనే విషయాల పట్ల పూర్తి స్పష్టత ఏర్పడుతుంది. అందుకే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాను. ఎఫ్2 చేస్తున్న సమయంలో కొత్తగా అనిపించింది. ఈ సినిమా విషయంలో నేను ఎంత ఎైగ్జెట్ అయ్యానో టీజర్ విడుదలైన తరువాత అంతా అలాగే ఫీలయ్యారు. టీజర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాలు ముందు ప్లాన్ చేసి చేసినవి కాదు. ఇన్‌స్టంట్‌గా వచ్చాయి అంతే. నేల మీద బామ్మలతో కూర్చుని చెప్పే సంభాషణలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

8102

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles