బ్యాడ్‌బాయ్‌గా కనిపించడమే ఇష్టం!


Mon,September 9, 2019 11:12 PM

Valmiki Trailer To Release At 4 PM On 14 Reels

మంచి కథలతో ఇతర భాషల్లో చాలా సినిమాలు రూపొందుతుంటాయి. కొన్ని మాత్రమే రీమేక్ చేయాలనే స్ఫూర్తినిస్తాయి. జిగర్తాండ అలాంటి సినిమానే. సినీ పరిశ్రమ గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది అని అన్నారు వరుణ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. హరీష్‌శంకర్ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్‌ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అధర్వమురళీ కీలక పాత్రధారి. పూజాహెగ్డే, మృణాళిని రవి కథానాయికలు. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదలచేశారు. నాపైన పందాలేస్తే గెలుస్తరు నాతోటి పందాలేస్తే సస్తరు..గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పీలహరి పాట కొట్టుడు, నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టు సేమ్ అంటూ తెలంగాణ యాసలో వరుణ్‌తేజ్ చెప్పిన సంభాషణలతో టీజర్ మాస్ పంథాలో సాగింది. ఈసందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేయడం సరైన నిర్ణయమేనా అనే అనుమానం ఉండేది. గద్దలకొండ గణేష్ పాత్రను నేను చేయగలననే నమ్మకాన్ని హరీష్ శంకర్ ఇచ్చారు. సినిమాల్లో మంచోడి కంటే బ్యాడ్‌బాయ్‌గా కనిపించడానికే ఇష్టపడతాను. బయట మాత్రం మంచోడిగా ఉంటాను.

నెగెటివ్ షేడ్స్ పాత్ర కోసం ప్రత్యేకంగా ఎవరిని స్ఫూర్తిగా తీసుకోలేదు. నన్ను నేను కొత్తగా ఎలా ఆవిష్కరించుకోవాలో ఆలోచించి నటించాను. తొలుత ఓ ప్రేమకథతో సినిమా చేయాలని హరీష్ శంకర్ నా దగ్గరకు వచ్చాడు. అది పక్కనపెట్టి ఈ సినిమా చేశాం అని అన్నారు. హరీష్‌శంకర్ మాట్లాడుతూ వరుణ్‌తేజ్ పాత్ర భావోద్వేగభరితంగా ఉంటుంది. అతడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. అంతర్లీనంగా చక్కటి ప్రేమ కథ ఉంటుంది. తమిళ మాతృకలో చిన్న చిన్న మార్పులు చేసి రూపొందించాం. కమర్షియాలిటీ కోసం కాకుండా కథ డిమాండ్ చేయడంతోనే తెలుగు సూపర్‌హిట్ పాటను రీమిక్స్ చేశాం అని తెలిపారు. నేను ఇప్పటివరకు మెలోడీ, క్లాసిక్ ప్రధానంగా సాగే చిత్రాలకే సంగీతాన్ని అందించాను. తొలిసారి మాస్ కథకు మ్యూజిక్ అందించే అవకాశం ఈ సినిమాతో దొరికింది అని మిక్కీ జే మేయర్ పేర్కొన్నారు. సినిమా విజయంపై అందరం బలమైన విశ్వాసంతో ఉన్నామని, ఈ నెల 20న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు పేర్కొన్నారు.

398

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles