నాకు గౌరవాన్ని తెచ్చిన సినిమా ఇది


Fri,October 12, 2018 12:16 AM

Trivikram About Aravinda Sametha Movie Success

అరవింద సమేత..పై అంచనాలను తగ్గించాలనుకున్నా కుదరలేదు. సినిమా చూసి నాకు తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు నా ఫోన్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి నన్ను అభినందిస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. దర్శకుడిగా నాకు గౌరవాన్ని తెచ్చిన సినిమా ఇది. మా అందరికంటే ఈ చిత్ర కథని బలంగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్. ఈ విషయంలో ఆయనకు రుణపడి వుంటాను అన్నారు త్రివిక్రమ్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం అరవింద సమేత వీరరాఘవ. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించారు. పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని నైజాంలో నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ జనతాగ్యారేజ్, జై లవకుశ చిత్రాల తరువాత మా సంస్థ ద్వారా విడుదల చేసిన హ్యాట్రిక్ హిట్ చిత్రమిది. తొలి ఆటకే యునానిమస్‌గా హిట్ అనే టాక్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఈ చిత్రం హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందని అంటున్నారు.

ఈ దసరాకు ఈ సినిమా ఏస్థాయి ట్రెండును సృష్టిస్తుందో చూడాలి. త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేశారు. అరవింద సమేత ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. గతంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఆది, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు చిత్రాల్లో హీరోయిజాన్ని చాలా వీరోచితంగా చూపించారు. ఆయతే వాటికి భిన్నంగా ఈ సినిమాలో హీరో పాత్రని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిత్రపరిశ్రమ మంచి విజయం కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ విజయాన్ని అందించినందుకు దర్శకుడు త్రివిక్రమ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ తననుంచి అభిమానులు కోరుకునే డ్యాన్సులు తగ్గుతున్నాయా? ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సవుతోందా? అనే ఆలోచనలేవీ పెట్టుకోకుండా నేను అనుకున్న కథను అనుకున్నట్టు తీయమని ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా జన్యూన్‌గా కథ చెప్పాలనుకున్నాం. 1950, 60ల కాలంలో కథాబలమున్న సినిమాల్నే ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించారు. అది మళ్లీ మన తెలుగు చిత్రపరిశ్రమలో మొదలైంది. ఆ ప్రభావం వల్లే గత ఏడాదిన్నరగా కథాబలమున్న చిత్రాలే విజయం సాధిస్తున్నాయి. జెన్యూన్ హిట్ అయితే సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులే ప్రచారం చేస్తున్నారు.

మా సినిమాకూ అలాంటి స్పందనే లభిస్తోంది అన్నారు. సునీల్ మాట్లాడుతూ ఇలాంటి పాత్రలో నన్ను చూసుకుని చాలా రోజులవుతోంది. నిడివి ఎక్కువ వల్ల నాకు సంబంధించిన మూడు సన్నివేశాల్ని తొలగించాల్సి వచ్చింది. ఫ్యాక్షన్ చిత్రాల్లో క్లాసిక్‌గా నిలిచే చిత్రమిది అన్నారు. అందాల రాక్షసి చిత్రం తరువాత అంతా నన్ను అందాల రాక్షసి సూర్య అని పిలిచారు. ఈ సినిమా తరువాత నన్ను బాల్‌రెడ్డి అని పిలుస్తారు అని నవీన్‌చంద్ర తెలిపారు. తమన్ మాట్లాడుతూ 2010లో దసరా సమయంలో బృందావనం సినిమాతో హిట్టు కొట్టాం. మళ్లీ అదే దసరాకు అరవింద సమేత..తో విజయాన్ని అందుకోవడం ఆనందంగా వుంది. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఇది పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్మాం. ఊహించినట్టుగానే హిట్ కావడం సంతోషాన్ని కలిగిస్తోంది అన్నారు. ఎంత నిడివి గల పాత్ర చేశామన్నది కాదు ఎంత ప్రాముఖ్యత వున్న పాత్ర చేశామన్నదే ముఖ్యం. అలాంటి పాత్రని ఈ సినిమాలో చేసినందుకు ఆనందంగా వుంది. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌కు కృతజ్ఞతలు అని శతుృ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ నవీన్‌నూలి పాల్గొన్నారు.

- త్రివిక్రమ్

5746

More News

VIRAL NEWS

Featured Articles