కథానాయిక - ప్రతినాయిక

Mon,February 4, 2019 11:07 PM

సినిమాలో కథానాయకుడి ధీరత్వం, శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శించాలంటే ప్రతినాయకుడి పాత్ర కూడా అంతే బలంగా ఉండాలి. ఇది సినిమా తాలూకు సార్వజనీన సూత్రం. తెలుగు చిత్రసీమ చరిత్రను పరిశీలిస్తే హీరోలతో సమానంగా విలనిజానికి ప్రేక్షకులు జేజేలు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్‌ను మన నాయికలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రతి నాయిక ఛాయలున్న పాత్రల్లో తమ అభినయకౌశలాల్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమలోని మరో కోణాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి సంసిద్ధులవుతున్నారు. పలువురు అగ్ర నాయికలు ఇదే బాటను అనుసరించడం ఇప్పుడు దక్షిణాదిన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కోవలో ప్రతినాయిక పాత్రల్లో నటిస్తున్న కథానాయికలపై కథనమిది..

కొద్ది రోజుల క్రితం విడుదలైన తమిళ చిత్రం సూపర్‌డీలక్స్ టీజర్ అందరిని షాక్‌కు గురిచేసింది. చూడముచ్చటై రూపంతో సాత్విక, చలాకీ అభినయానికి పేరుపొందిన చెన్నై సోయగం సమంత ఆ ట్రైలర్‌లో ఓ వ్యక్తి తలను పదునైన కత్తితో నరకబోతున్నట్లు చూపించారు. ఈ టీజర్‌తో సినిమాలో సమంత పాత్ర చిత్రణ ఏమిటో తెలుసుకోవాలని అందరిలో ఆసక్తిమొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సమంత వేంబూ అనే పేరుగల హంతకురాలి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ప్రతీకారేచ్ఛతో కూడిన ఈ పాత్రలో సమంత నెగెటివ్‌షేడ్స్‌తో కనిస్తుందట. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమా గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. నాయికా పాత్రల్లో నవ్యతకోసం అన్వేషిస్తున్నారు. సూపర్‌డీలక్స్‌లో నా క్యారెక్టర్ షాకింగ్‌గా ఉంటుంది అని పేర్కొంది. సమంత మాటలు ఈ సినిమాపై మరింత ఉత్సుకతను పెంచాయి.
Samantha
తమన్నా కథానాయికగా నటించిన తమిళ చిత్రం దేవి తెలుగులో అభినేత్రి పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా దేవి-2 తెరకెక్కుతున్నది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభుదేవా కథానాయకుడు. ప్రతి సినిమాలో వినూత్న కథాంశాల్ని ఎంచుకుంటూ ప్రయోగాలు చేసే దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని సంగీతనేపథ్యంలో హారర్ అంశాల్ని మేళవించి రూపొందిస్తున్నారు. ఇందులో తమన్నా దెయ్యం పాత్రలో నటిస్తున్నది. కథానుగుణంగా ఆమె పాత్ర భీతిగొలిపేలా ఉంటుందని చెబుతున్నారు. పాలసంద్రం నుంచి స్నానమాడి వచ్చిన దేవకన్య అని అభిమానులు అభివర్ణించుకునే ఈ సొగసరి దెయ్యం పాత్రలో భయపెట్టడానికి పూనుకోవడం ఆసక్తికరంగా మారింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
Tamanna
ఢిల్లీ సొగసరి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో సత్తాచాటుతున్నది. సామాజిక నేపథ్య ఇతివృత్తాల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. గత ఏడాది విడుదలైన నీవెవరో చిత్రంలో ప్రతినాయిక పాత్రలో కనిపించిన ఈ సుందరి మరోసారి విలనీ పండించడానికి సిద్ధమవుతున్నది. గేమ్‌ఓవర్ పేరుతో తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్‌శరవణన్ దర్శకుడు. మాదకద్రవ్యాల నేపథ్యంలో క్రైమ్ కథాంశమిది. ఈ సినిమాలో తాప్సీ పాత్ర చిత్రణ నెగెటివ్‌షేడ్స్‌తో సాగుతుందని తెలిసింది. సినిమాలో తాప్సీ పాత్ర ఎక్కువభాగం వీల్‌ఛైర్‌కే పరిమితమైనప్పటికీ కథాంశం మొత్తం ఆమె చుట్టే పరిభ్రమిస్తుందని చిత్ర బృందం వెల్లడించింది.
catherine-tresa
ఇలా అగ్ర నాయికలు కథల్లో నవ్యతకు ప్రాధాన్యతనిస్తూ విలనీ పండించడానికి సిద్ధమవడం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్.ఎక్స్.100 చిత్రంలో పాయల్‌రాజ్‌పుత్ నెగెటివ్ షేడ్స్ పాత్ర చేసినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళంలో ఎక్కువగా ప్రతినాయిక పాత్రల్లోనే కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు. త్రిష గతంలో కొడి (తెలుగులో ధర్మయోగి పేరుతో విడుదలైంది), మోహిని చిత్రాల్లో విలన్‌గా మెప్పించింది. ఒకప్పుడు ప్రతినాయిక పాత్రల్లో కనిపిస్తే అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందేమోననే భావనలో ఉండేవారు మన కథానాయికలు. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులొస్తున్నాయి. కథాంశాల్లో నూతనత్వం ఉంటే ప్రతినాయిక పాత్రల్ని కూడా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకున్న నాయికలు ప్రతి నాయిక పాత్రల వైపు మొగ్గుచూపుతున్నారు.
Hansika
హన్సిక నటిస్తున్న యాభయ్యవ చిత్రం మహా. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. వాటిలో కాషాయవస్ర్తాలు ధరించి ఘాటుగా దమ్ముకొడుతున్న పోస్టర్‌తో పాటు బాత్‌టబ్‌లో రక్తపు నీళ్లలో స్నానం చేస్తూ చేతిలో తుపాకీ పెట్టుకొని తీక్షణంగా చూస్తున్న ఫొటోలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. నూతన దర్శకుడు యు.ఆర్.జమీల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డబ్బుకోసం భిన్న వేషాల్ని ధరించి మోసాలు చేసే యువతిగా హన్సిక పాత్ర ప్రతినాయిక ఛాయలతో సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. కేథరిన్ థెరిస్సా తమిళ చిత్రం నీయా-2లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించనుంది. జై కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదలకానుంది.
Payal
పంజాబీ ముద్దుగుమ్మ కాజల్‌అగర్వాల్ సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు విలనీ షేడ్స్ ఉన్న పాత్రలో నటించలేదు. నవనవలాడే అందంతో వెండితెరపై వలపుమంత్రం వేసే ఈ సొగసరి తాజాగా సీత చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించనుందని సమాచారం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ తనకు ఇష్టంలేనివారిని వేధిస్తూ ఇబ్బందులు పెట్టే మనస్తత్వమున్న పాత్రను పోషిస్తున్నదట. కథానుగుణంగా ఆమె పాత్ర చిత్రణ కీలకంగా ఉంటుందని, సీతలో పరివర్తన ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తంలో ప్రధానాంశమని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. వేసవికానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

1977

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles