టాలీవుడ్ రీమేక్ మంత్రం

Mon,November 4, 2019 12:18 AM

పరభాషల్లో ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని రీమేక్ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఓ రకంగా సృజనాత్మకతను దిగుమతి చేసుకునే ప్రక్రియగా రీమేక్‌లను అభివర్ణించవొచ్చు. బాక్సాఫీస్ కోణంలో రీమేక్ సినిమాలకు సక్సెస్‌శాతం ఎక్కువగా ఉంటుంది. వాణిజ్యపరంగా ఓ భాషలో మంచి ఫలితాన్ని అందుకున్న సినిమా మరో భాషా ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుందనే భరోసా ఉంటుంది. దాంతో వివిధ భాషా చిత్రాలు పరస్పరం రీమేక్‌లను అందిపుచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ రీమేక్‌ల ట్రెండ్ ఎక్కువైంది. ఇతర భాషల్లో భారీ విజయాల్ని సాధించిన చిత్రాలు తెలుగు తెరపై పునర్నిర్మాణం కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో పలువురు అగ్రహీరోల చిత్రాలుండటం విశేషం..


రాజకీయం, కుటుంబ ఆధిపత్యం, అండర్‌వరల్డ్ అంశాలు మేళవించిన పొలిటికల్ డ్రామాగా లూసిఫర్ మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర వందకోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. స్టీఫెన్ నెడుంపల్లి అనే శక్తివంతమైన వ్యక్తి పాత్రలో మోహన్‌లాల్ అభినయం అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా రీమేక్ చేయబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్‌చరణ్ ఈ సినిమా తెలుగు హక్కుల్ని తీసుకున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఒరిజినల్ స్క్రిప్ట్‌లో మార్పులు చేయబోతున్నారని సమాచారం. దర్శకత్వ బాధ్యతల్ని ఎవరు చేపడుతారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాత లూసిఫర్ రీమేక్ పట్టాలెక్కనుంది.

పీకే పింక్...రాజకీయాల్లో బిజీగా ఉండటంతో

గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు పవన్‌కల్యాణ్. తిరిగి ఆయన కెమెరా ముందుకురాబోతున్నారు. హిందీలో విజయవంతమైన పింక్ (2016) చిత్రాన్ని తెలుగులో పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తారు. వేణుశ్రీరామ్ దర్శకుడు. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన పింక్ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ లాయర్ పాత్రను పోషించారు. తాప్సీ నాయికగా కీలక పాత్రలో కనిపించింది. ముగ్గురమ్మాయిల జీవితంలో చోటుచేసుకున్న అనూహ్యపరిణామాలు వారిని కోర్ట్ ముందు దోషులుగా ఎలా నిలబెట్టాయి? కేసు నుంచి ఓ లాయర్ వారిని ఎలా తప్పించాడన్నది చిత్ర ఇతివృత్తం. హిందీలో అమితాబ్‌బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు.

వెంకటేష్‌తో తమిళ అసురన్..


Venkatesh
ధనుష్ కథానాయకుడిగా తమిళంలో రూపొందిన అసురన్ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. వెక్కై అనే తమిళ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తన భూమిని కాపాడుకోవడానికి నిమ్న కులానికి చెందిన ఓ యువకుడు అగ్రకులానికి చెందిన భూస్వామిని హత్య చేస్తాడు. ఈ నేపథ్యంలో అగ్రవర్ణాల ఆగ్రహానికి గురైన ఆ యువకుడిని రక్షించుకోవడానికి అతడి తండ్రి చేసే ప్రయత్నాలేమిటన్నదే అసురన్ చిత్ర ఇతివృత్తం. కుల, వర్గ విభేదాల్ని చర్చిస్తూ తమిళంలో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందీ చిత్రం. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేష్ కథానాయకుడిగా నటించబోతున్నారు. దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి అసురన్ నిర్మాత కలైపుల్ థాను తెలుగు రీమేక్‌ను నిర్మించనున్నారు.

అజయ్‌దేవ్‌గణ్ రెయిడ్‌లో నాగార్జున..


Nagarjuna
నాగార్జున కథానాయకుడిగా నటించిన మన్మథుడు-2 చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం నాగార్జున చిత్రాలేవి ఖరారు కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఆయన బాలీవుడ్ చిత్రం రెయిడ్ రీమేక్‌లో నటించబోతున్నారని తెలిసింది. అజయ్‌దేవ్‌గణ్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన రెయిడ్ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంది. 1980 దశకంలో ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ ఆఫీసర్ చేపట్టిన భారీ ఆపరేషన్ స్ఫూర్తిగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్‌లో నటించడానికి నాగార్జున ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.

అంధాదున్ రీమేక్‌లో నితిన్..


Nithiin
ఆయుష్మాన్‌ఖురానా, టబు, రాధికాఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం అంధాదున్ జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది. బ్రతుకుతెరువు కోసం అంధుడిగా నటించే ఓ పియానో వాయిద్యకారుడు అనుకోకుండా ఓ హత్యకు సాక్షిగా నిలవడం..ఆ తర్వాత అతని జీవితంలో ఎదురైన ఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్ర తెలుగు రీమేక్‌లో నితిన్ నటించబోతున్నాడు. ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడి కోసం అన్వేషణ సాగుతున్నది.

తెరీ..రీమేక్‌లో రవితేజ


Ravi-Teja
ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పోలీస్ కథాంశంతో ఓ సినిమా రూపొందుతున్నది. తమిళ చిత్రం తెరీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక.

రెడ్‌గా రామ్..


Ram-Pothineni
తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తడమ్ ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అరుణ్‌విజయ్ కథానాయకుడిగా మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అరుణ్‌విజయ్ ద్విపాత్రాభినయంలో నటించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఉత్కంఠగా సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ రెడ్‌లో రామ్ నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు.

రెండు రీమేక్‌లలో సుమంత్..


Sumanth
సుమంత్ రెండు రీమేక్ చిత్రాల్ని అంగీకరించారు. తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఓ సినిమా చేయబోతున్నారు. కన్నడ థ్రిల్లర్ కావలుదారికి రీమేక్ ఇది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనితో పాటు మలయాళం గ్యాంగ్‌స్టర్ కామెడీ చిత్రం పడయోట్టమ్ తెలుగు రీమేక్‌లో సుమంత్ నటించబోతున్నారు. కొత్త దర్శకుడు వినుయజ్ఞ నిర్ధేశక బాధ్యతల్ని చేపట్టనున్నారు.

పూర్తికావొచ్చిన 96..


Sharwanand
ప్రస్తుతం శర్వానంద్ తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత కథానాయిక. ప్రేమ్‌కుమార్ దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తికావొచ్చింది. తమిళంలో విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 హృద్యమైన ప్రణయగాథగా యువతరాన్ని ఆకట్టుకుంది.

971

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles