ఛలో..బాలీవుడ్!


Mon,September 9, 2019 03:47 AM

Tollywood actress who worked in Bollywood

గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు..స్టేడియంలో కొట్టినవాడికే ఓ రేంజ్ ఉంటది.. ఇటీవల విడుదలైన సాహో సినిమాలోని ఓ డైలాగ్ ఇది. బాలీవుడ్ డ్రీమ్స్‌ను సాఫల్యం చేసుకునే విషయంలో మన కథానాయికలు అదే తరహాలో ఆలోచిస్తున్నారు. దక్షిణాదిన కాస్త గుర్తింపు లభించగానే నాయికలు ముంబయి వైపు దృష్టి పెడుతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్‌తో పాటు ఆర్థికంగా కూడా భారీ మొత్తంలో ఆర్జించే అవకాశం ఉండటంతో హిందీ చిత్రసీమలో సత్తా చాటాలని తపిస్తున్నారు. సౌత్‌లో భారీ విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నాయికలు సైతం బాలీవుడ్‌ను విస్మరించడం లేదు. గతంలో బాలీవుడ్ తెరపై మెరిసిన కథానాయికలు కూడా తిరిగి రీఎంట్రీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మహానటితో చిత్రం ద్వారా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కైవసం చేసుకొని దేశవ్యాప్తంగా సినీ ప్రియుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది మలయాళీ సోయగం కీర్తిసురేష్. ఈ భామ మైదాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నది. భారతీయ ఫుట్‌బాల్‌కు సరికొత్త జవసత్వాలు అందించి స్వర్ణయుగ సృష్టికర్తగా పేరుపొందిన హైదరబాదీ శిక్షకుడు దివంగత సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సతీమణి పాత్రలో కీర్తిసురేష్ నటించనుంది. అభినయపరంగా పరిణితితో కూడిన పాత్ర కావడంతో కీర్తిసురేష్‌ను ఆ క్యారెక్టర్ కోసం ఎంపిక చేసుకున్నామని చిత్రబృంద ం తెలిపింది.
Rakul
ఇటీవలే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రం తన బాలీవుడ్ కలలకు నాంది పలుకుతుందని ఆశాభావంతో ఉంది కీర్తి సురేష్.ఇక సోగకళ్ల కన్నడ కస్తూరి రష్మిక మందన్నకు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. తెలుగులో ఛలో గీత గోవిందం సినిమాలతో యువతరం కలల రాణిగా భాసిల్లుతోంది ఈ సుందరి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అగ్ర హీరోల సరసన మూడు భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. జెర్సీ హిందీ రీమేక్ ద్వారా రష్మిక మందన్న బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నది. షాహిద్‌కపూర్ కథానాయకుడిగా నటించనున్నాడు. జెర్సీ తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి..హిందీ రీమేక్‌కు నిర్ధేశక బాధ్యతల్ని చేపట్టబోతున్నాడు.

దక్షిణాదిన ప్రతిభావంతులైన కథానాయికల్లో నిత్యామీనన్ ఒకరు. అనేక ప్రయోగాత్మక పాత్రల్లో తనదైన అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందీ మలయాళీ సుందరి. తెలుగు, తమిళం, మలయాళంలో దాదాపు 50 చిత్రాలు చేసిన నిత్యామీనన్ ఇటీవలే విడుదలైన మిషన్ మంగళ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో వర్షాపిైళ్లె పాత్రలో అద్భుతాభినయంతో మెప్పించింది. బాలీవుడ్ విమర్శకులు సైతం నిత్యామీనన్ నటనకు ముగ్ధులయ్యారు. ఈ సినిమా విజయంతో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నది నిత్యామీనన్.

ఎవరు సినిమాతో ఇటీవలే తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది రెజీనా. దక్షిణాదిన సుదీర్ఘ కాలంగా కెరీర్‌లో కొనసాగుతున్న ఈ అమ్మడు కమర్షియల్ నాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా చిత్రం ద్వారా హిందీలో పరిచయమైంది. ఈ సినిమాలో స్వలింగ సంపర్కురాలిగా ఆమె సవాలుతో కూడిన పాత్రను పోషించింది. ఈ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్‌లో రెజీనాకు మరిన్ని అవకాశాలు రానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Tamanna

రీ ఎంట్రీ ప్రయత్నాలు...

కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే, తమన్నా, శృతిహాసన్, రకుల్‌ప్రీత్‌సింగ్ వంటి తారలు గతంలో బాలీవుడ్‌లో మెరిసినవారే. అయితే గత కొన్నేళ్లుగా వీరందరూ పూర్తిగా దక్షిణాది సినిమాల మీదనే దృష్టిపెట్టారు. ఇక్కడ వరుస అవకాశాలతో బిజీగా వుంటూ కూడా హిందీ చిత్రసీమలో తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ముంబయి సాగా చిత్రం ద్వారా బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్నది. దో లఫ్జోంకి కహానీ (2016) తర్వాత హిందీలో ఏ సినిమాలోను నటించలేదు కాజల్ అగర్వాల్. ముంబయి సాగా చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇక తెలుగు చిత్రసీమలో అగ్ర నాయికగా కొనసాగుతున్నది మంగళూరు సుందరి పూజాహెగ్డే. మోహెంజోదారో (2016) చిత్రం ద్వారా ఈ సొగసరి బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పూర్తిగా తెలుగు పరిశ్రమపై దృష్టిపెట్టింది. డీజే, రంగస్థలం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఈ వయ్యారి తెలుగులో వాల్మీకి, అలవైకుంఠపురములో..సినిమాల్లో నటిస్తున్నది. హౌస్‌ఫుల్-4 చిత్రం ద్వారా పూజాహెగ్డే తిరిగి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా ఫర్హాద్ సాంజీ దర్శకత్వంలో వినోదప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

హిమ్మత్‌వాలా హమ్‌షకల్ వంటి సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది పంజాబీ సుందరి తమన్నా. గ్లామర్ నాయికగా దక్షిణాదిన మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సొగసరి నాలుగేళ్ల విరామం తర్వాత కామోషీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఆమె బోలే చుడియా అనే సినిమాలో నటిస్తున్నది. శృతిహాసన్ హిందీలో పవర్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఇందులో ఆమె పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత శృతిహాసన్ హిందీలో నటిస్తున్నది. దే దే ప్యార్ దే సినిమాతో ఇటీవలే బాలీవుడ్‌లో మంచి విజయాన్ని దక్కించుకుంది రకుల్‌ప్రీత్‌సింగ్. అంతకు ముందు ఏడాది పాటు బాలీవుడ్‌కు దూరంగా ఉన్నది. ప్రస్తుతం ఆమె మర్జావాన్ అనే సినిమాలో నటిస్తున్నది.

- చిత్రం డెస్క్

1160

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles