ఆ లోటును భర్తీచేసే సినిమా!

Wed,November 20, 2019 12:03 AM

తోలుబొమ్మలాట లాంటి కథలకు హీరో ఎవరు అనేదానిపై చర్చలు అనవసరం. సినిమా చూశాక హీరో ఎవరో ప్రేక్షకులే నిర్ణయిస్తారు అని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తోలుబొమ్మలాట. విశ్వనాథ్ మాగంటి దర్శకుడు. విశ్వాంత్, హర్షిత చౌదరి జంటగా నటించారు. దుర్గాప్రసాద్ మాగంటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. బిగ్‌సీడీని రాజేంద్రప్రసాద్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓ బేబీ తర్వాత నేను నటించిన మరో మంచి సినిమా ఇది. ఇలాంటి అద్భుతమైన కథ కోసం దర్శకుడు విశ్వనాథ్ మమ్మల్ని ఎంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం.


ఆ నలుగురు శతదినోత్సవ వేడుకలో వంద సినిమాలు చేసినా నాకు దక్కని పేరు ఈ ఒక్క సినిమాతో నీకు వచ్చిందన్నారు. ఈ చిత్రం నిర్మాతకు అలాంటి పేరు తీసుకొస్తుందనే నమ్మకముంది అన్నారు. కథే ఈ సినిమాకు హీరో, కమర్షియల్‌గా లెక్కలు ఎలా మారినా ఎమోషన్ మాత్రం మారదనే అంశాన్ని దర్శకుడు చెప్పిన విధానం ఆకట్టుకుంటుందని విశ్వాంత్ పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు రావడం లేదనే లోటును భర్తీచేస్తుంది. నా అభిమాన నటుడు రాజేంద్రప్రసాద్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ వేడుకలో నలభైరెండేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న రాజేంద్రప్రసాద్‌ను చిత్రబృందం స్వర్ణకంకణంతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో హర్షిత చౌదరి, నారాయణరావు, జానకి, దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

234

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles