ప్రకాష్‌రాజ్ చెప్పినా నమ్మలేదు


Wed,December 12, 2018 11:26 PM

Tejus Kancharla Speech at Ketugadu Audio Launch

స్నేహం విలువను తెలియజెప్పే చిత్రమిది. నలుగురు స్నేహితుల జీవితాల్లో ఎదురైన సంఘటనల సమాహారంగా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. సహజత్వానికి దగ్గరగా రూపొందిన ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నాను అన్నారు తేజస్ కంచర్ల. ఆయన నటించిన తాజా చిత్రం హుషారు. శ్రీహర్ష కొనుగంటి రూపొందిస్తున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తేజస్ మాట్లాడుతూ నా స్వస్థలం హైదరాబాద్. ఇక్కడే పుట్టిపెరిగాను. ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి ప్రవేశించాను. ముంబాయిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న తరువాత దర్శకుడు తేజ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాను. నటుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నటుడిగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రకాష్‌రాజ్ నుంచి ఫోన్ వచ్చింది.

ప్రత్యేకంగా పదిహేను నిమిషాల పాటు మాట్లాడిన తరువాత నా సినిమాలో నువ్వే హీరో అన్నారు. కానీ నేను నమ్మలేదు. ఇప్పటి వరకు ఇలాంటి మాట ఎంతో మంది చెప్పారని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాను. ప్రకాష్‌రాజ్ ఫోన్‌చేసి నువ్వే నా సినిమాలో హీరో ఇప్పటికైనా నమ్ముతావా? అన్నారు. అలా ఉలవచారు బిర్యానితో నటుడిగా నా ప్రయాణం మొదలైంది. ఆ తరువాత కేటుగాడు రూపంలో తప్పటడుగు వేశాను. ఆ తరువాత చాలా విరామం తీసుకోవాల్సి వచ్చింది. పవన్ సాదినేని వల్ల హుషారులో అవకాశం లభించింది. ఇందులో నా పాత్ర పేరు ఆర్య. నలుగురు స్నేహితుల నేపథ్యంలో సాగే సినిమా ఇది. నలుగురు యువకుల్లో ఒకరికి క్యాన్సర్ అని తెలుస్తుంది. అతని కోసం మిగతా వారు ఏం చేశారు. అతని కలను ఏ విధంగా సాకారం చేశారన్నదే ఇందులో ఆసక్తికరం. నా పాత్రకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. నటుడిగా గుర్తింపును తెచ్చిపెడుతుంది. సోలో హీరోగా ఓ సినిమా చేయబోతున్నాను. దీని తరువాత ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది అన్నారు.

3649

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles