కవర్‌డ్రైవ్‌కు సిద్ధం

Tue,December 3, 2019 11:42 PM

ప్రయోగాత్మక కథాంశాలకు పెద్దపీట వేస్తూ బాలీవుడ్‌లో దూసుకుపోతున్నది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. ఇటీవల విడుదలైన ‘సాండ్‌ కీ ఆంఖ్‌' చిత్రంలో షూటర్‌గా చక్కటి అభినయంతో మెప్పించింది. తాజాగా ఆమె మరో ఛాలెంజింగ్‌ పాత్రకు సిద్ధమవుతున్నది. భారత మహిళా క్రికెట్‌ అగ్రశేణి క్రీడాకారిణి మిథాలీరాజ్‌ జీవితం ఆధారంగా ‘శభాష్‌ మిత్తు’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తున్నది. మంగళవారం మిథాలీరాజ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని తాప్సీ ఆమెతో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ‘ఎన్నో విషయాల్లో నువ్వు మాకు స్ఫూర్తి. వెండితెరపై నీ పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నా. జన్మదినం సందర్భంగా నీకు ఎలాంటి బహూమతి ఇవ్వాలో తెలియదు కానీ...ఈ సినిమా ద్వారా నీవు గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను’ అని తాప్సీ భావోద్వేగంగా వ్యాఖ్యానించింది. ఈ సినిమా కోసం తాప్సీ బ్యాటింగ్‌కు సంబంధించిన ప్రాథమికాంశాలపై శిక్షణ తీసుకోనుంది. ముఖ్యంగా కవర్‌డ్రైవ్‌ను పర్‌ఫెక్ట్‌గా నేర్చుకోవడంపై దృష్టిపెడుతున్నానని తాప్సీ పేర్కొంది. రాహుల్‌ ఢోలాకియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్నది.

166

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles