నాకు పోటీ ఎవరూ లేరు!


Mon,June 10, 2019 11:53 PM

Taapsee Pannu Game Over movie Interview

ప్రయోగాలు, వినూత్న ఇతివృత్తాలతో కథానాయికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిభను చాటుకుంటున్నది తాప్సీ. కమర్షియల్‌ సినిమాలు, గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ వైవిధ్యతను నమ్మి సినిమాలు చేస్తున్నది. ఈ కొత్త ప్రయాణమే తనకు సంతృప్తినిస్తున్నదని చెబుతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గేమ్‌ ఓవర్‌'. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో తాప్సీ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

గేమ్‌ఓవర్‌' సినిమాను అంగీకరించడానికి కారణ మేమిటి?

కథలోని నవ్యత నన్ను ఆకట్టుకోవడంతో వెంటనే ఓకే చెప్పాను. ఏ భాషకైనా సరిపోయే యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ ఇది. భారతీయ తెరపై ఇప్పటివరకు ఇలాంటి ఇతివృత్తంతో సినిమాలు రాలేదు. నా పాత్రతో పాటు కథ, కథనాలు విభిన్నంగా ఉంటాయి. భాషకు సంబంధం లేకుండా అందరిని ఆకట్టుకుంటుంది.
ఇందులో మీ

పాత్ర ఎలా ఉంటుంది?

ఒక ఇంటి నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ సినిమా ఇది. వీడియో గేమ్‌ డెవలపర్‌గా నేను కనిపిస్తాను. ఆమె జీవితంలో ఎదురైన ఓ అనూహ్య సంఘటన ఏమిటి? యానివర్సరీ రియాక్షన్‌ వల్ల ఎలాంటి సంఘర్షణకు లోనైందన్నది ఉత్కంఠను పంచుతుంది. వీడియో గేమ్‌ తరహలో అనేక మలుపులతో సాగుతుంది.

నిజ జీవితంలో మీరు వీడియో గేమ్స్‌ అడుతుంటారా?

ఇప్పుడు కాదు కానీ స్కూల్‌ కాలేజ్‌ డేస్‌లో బ్యాట్‌మెన్‌, మారియో, నీడ్‌ ఫర్‌ స్పీడ్‌తో పాటు చాలా గేమ్స్‌ ఆడేదాణ్ణి. ఆ గేమ్స్‌ ఆడిన అనుభవం నా పాత్రను పోషించడానికి ఉపయోగపడింది. ఆ అనుభవాల్ని ఇందులో చూపించాం.

సినిమాలో వీల్‌చైర్‌లో కూర్చొని కనిపిస్తున్నారు. ఇలాంటి పాత్ర చేయడం నటిగా సవాల్‌గా అనిపించిందా?

యానివర్సరీ రియాక్షన్‌ అనే మానసిక సమస్యతో బాధపడే యువతిగా ఇందులో కనిపిస్తాను. వీల్‌చైర్‌లో కదలకుండా ఉంటూనే ఆ సమస్య తాలూకూ భావోద్వేగాల్ని పలికించడం సవాల్‌గా అనిపించింది. కొన్ని సార్లు పద్నాలుగు గంటల వరకు కదలకుండా కూర్చొని షూటింగ్‌ చేసిన సందర్భాలున్నాయి.

సినిమా భారాన్నంతా మీరే మోశారు కదా..?

నాకు ఇలాంటి సినిమాలు చేయడమే ఇష్టం. ఈ భారాన్ని ఎప్పుడూ ఇబ్బంది ఫీలవ్వలేదు. ఈ బరువును ఇతరులపై పెట్టడానికి ఆప్షన్‌ దొరక్కపోవడంతో నేనే మోయాల్సివస్తుంది. ఈ విషయంలో ఎవరిని నిందించడం లేదు. నా దృష్టిలో సినిమాకు దర్శకులే అసలైన హీరోలు. సినిమా అనేది పూర్తిగా దర్శకుడి మాధ్యమం. అతడి ఆలోచనల నుంచే సినమా జనిస్తుంది. నటీనటులు ఓ సాధనాలు మాత్రమే. అందుకే ఐదారేళ్లుగా దర్శకులను నమ్మే సినిమాలు చేస్తున్నాను. అయితే షూటింగ్‌ చేస్తున్నప్పుడు నా పాత్ర కీలకం కాబట్టి బాధ్యత, ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే ఆలోచన రాలేదు. అయితే పోస్టర్‌లోతాప్సీ సినిమా ఇదనే అక్షరాలు చూసిన తర్వాత టెన్షన్‌ మొదలైంది. నా పేరును పోస్టర్స్‌పై ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. అది చూసి కొంత భయపడ్డాను. అదే నాకు నిజమైన పరీక్షలా అనిపించింది.

నంబర్‌ గేమ్స్‌పై నాకు నమ్మకం లేదు. ప్రత్యేకమైన ట్రాక్‌లో నేనొక్కదాన్నే ఒంటరిగా పరిగెడుతున్నాను. అందుకే నాకు పోటీ ఎవరూ లేరు. ఉండరు(నవ్వుతూ).

కథల ఎంపికలో ఇదివరకటితో పోలిస్తే మీలో పరిపూర్ణత కనిపిస్తున్నది?

కెరీర్‌ తొలినాళ్లలో సినిమా అంటే ఏమిటో, ఎలా నటించాలో అర్థమయ్యేది కాదు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా చెప్పేవారు ఎవరూ లేరు. ఈ క్రమంలో అనేక తప్పులు చేశాను. అవి నాకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. ప్రస్తుతం ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నాను. నా సినిమాలు చూడటానికి ప్రేక్షకులు వెచ్చిస్తున్న విలువైన డబ్బు, కాలానికి న్యాయం చేసే కథల్ని ఎంచుకుంటున్నాను. నాపై గౌరవంతో థియేటర్లకు వస్తున్న వారిని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నాను.

‘బదా’ ్ల సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు? ఈ విజయం నటిగా మీపై ఎలాంటి అంచనాల్ని పెంచిందని అనుకుంటున్నారు?

‘బద్లా’ నటిగా నా బాధ్యతను మరింత పెంచింది. నా నుంచి ప్రేక్షకులు మరిన్ని మంచి సినిమాలు ఆశిస్తున్నారు. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అంచనాలు లేకపోతే కెరీర్‌లో కిక్‌ ఉండదు. నవ్వుకోవడానికి, డ్యాన్సులను చూసి సంతోషపడటానికే కాకుండా కథలోని థ్రిల్‌ను అనుభవించడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ఈ సినిమా పెంచింది.

తెలుగులో ఏడాదికో మూవీ చేస్తున్నారెందుకని?

తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. అయితే రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు కాకుండా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసే మంచి కథాంశాల్లో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. అలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నాను. కథలో భాగం అయితే తప్పకుండా గ్లామరస్‌ పాత్రలు, ప్రత్యేక గీతాల్లో కనిపిస్తాను.

భవిష్యత్తులో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించే ఆలోచన ఉందా?

ప్రస్తుతానికి నటనపైనే దృష్టిసారించాను. చిత్ర నిర్మాణంలోకి రావాలంటే వందశాతం దృష్టికేంద్రీకరించాలి. నమ్మకస్తుడైన భాగస్వామి దొరికితే ఆలోచిస్తాను.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

బాలీవుడ్‌ చిత్రం ‘మిషన్‌ మంగల్‌'లో శాస్త్రవేత్తగా నటిస్తున్నాను. యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకానుంది. ‘సాండ్‌ కి ఆంఖ్‌' సినిమా చిత్రీకరణ పూర్తయింది. దీపావళికి విడుదలకానుంది.ఇందులో అరవై ఐదేళ్ల వృద్ధురాలిగా కనిపిస్తున్నాను. తమిళంలోనూ ఓ సినిమా చేయబోతున్నాను.

2286

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles