నిబంధనలు మా ఇద్దరికేనా?

Mon,September 30, 2019 12:03 AM

వయసుకు మించిన పాత్రలు చేయకూడదనే నియమ నిబంధనలు చిత్రసీమలో అందరికి వర్తిస్తాయా? నాతో పాటు భూమి ఫడ్నేకర్‌కు మాత్రమే పరిమితమా? అని ఘాటుగా ప్రశ్నిస్తున్నది తాప్సీ. ప్రస్తుతం భూమిఫడ్నేకర్‌తో కలిసి తాప్సీ సాండ్ కీ ఆంఖ్ సినిమాలో నటిస్తున్నది. వృద్ధ్దాప్యంలో షూటింగ్ క్రీడలో పలు పతకాలు సాధించిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చంద్రూతోమర్, ప్రకాషీ తోమర్ అనే మహిళల జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ సినిమాలో తాప్సీ, భూమీ ఫడ్నేకర్ అరవై ఏళ్ల వయసుపై బడిన పాత్రల్లో కనిపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ యాక్టర్స్ చేయాల్సిన పాత్రలు వీరు చేయడం సరికాదంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.


ఈ విమర్శలపై తాప్సీ స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రతికూల ఆలోచనల్ని పెంచుతూ ఛాలెంజెస్‌ను ఎదుర్కొనే ధైర్యాన్ని ఆదిలోనే అణిచివేస్తున్నారు. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయగలమా అని ఆలోచించే పరిస్థితి నెలకొంది. కంఫర్ట్‌జోన్‌ను వదిలిపెట్టి మార్పు కోసం కొత్తగా ప్రయత్నిస్తే అభినందించకుండా విమర్శించడం సమంజసం కాదు. వయసుకు మించిన పాత్రలు చేయకూడదనే నిబంధనలు అందరికి వర్తిస్తాయా?మా ఇద్దరికి మాత్రమేనా? అమీర్‌ఖాన్ కాలేజీ విద్యార్థిగా, ఆయుష్మాన్ ఖురానా గే పాత్రలో నటించినప్పుడు విమర్శించలేదు. కానీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వాటన్నింటికి సినిమానే సమాధానం చెబుతుంది అని తెలిపింది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.

484

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles