రికార్డుల కోసం కాదు.. గౌరవంతో చేశాం

Thu,September 19, 2019 12:36 AM

రికార్డులు, డబ్బుల కోసం ఆలోచించి ఈ సినిమా చేయలేదు. క్రమశిక్షణ, గౌరవంతో రూపొందించాం’ అని అన్నారు రామ్‌చరణ్‌.చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమితాబ్‌బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. అక్టోబర్‌ 2న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు.


నాన్న కల తీరింది-రామ్‌చరణ్‌

సురేందర్‌రెడ్డి ఇదివరకు వినోదాత్మక కథాంశాలతో చాలా సినిమాలు చేశారు. ‘ధృవ’ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ కథలతో పాటు శక్తివంతమైన ఇతివృత్తాలకు న్యాయం చేయగలరనిపించింది. దర్శకుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆ సినిమా ఆవిష్కరించింది. ‘సైరా’ సినిమాను తెరకెక్కించగల సామర్థ్యం ఉన్న దర్శకుడు సురేందర్‌రెడ్డి మాత్రమేనని ఆ సమయంలో మాకు అనిపించింది. ఆయన తప్ప వేరే ఆప్షన్‌ కనిపించలేదు. పదేళ్ల క్రితమే నాన్న అంగీకరించిన కథ ఇది. సరైన సమయం, బడ్జెట్‌ ఇలా అన్ని అనుకూలంగా కుదిరినప్పుడే సినిమా చేయాలని అనుకున్నాం. నాన్న కల ఇన్నాళ్లకు తీరింది. అక్టోబర్‌ 2వ తేదీ కోసం అందరితో పాటు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నిర్మాతగా నాకు ఇలాంటి చిత్రాన్ని నిర్మించే అవకాశం దొరకడమే గొప్ప అనిపించింది. నాన్నతో పాటు పరుచూరి బ్రదర్స్‌ ఆలోచనల నుంచి ఈ కథకు అంకురార్పణ పడింది.

అది సినిమాగా తెరమీదకు రావాలంటే కేవలం డబ్బులుంటే సరిపోదు. అందుకే క్రమశిక్షణ, గౌరవంతో ఈ సినిమా చేశాం. రికార్డుల గురించి ఆలోచించి ఖర్చుపెట్టలేదు. తిరిగి డబ్బులస్తాయో లేదో పట్టించుకోకుండా తపనతో రూపొందించాం. వంద సంవత్సరాల తర్వాత ఓ వ్యక్తి జీవిత చరిత్రతో ఎవరైనా సినిమాలు తీయోచ్చని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.నరసింహారెడ్డిని ఓ కుటుంబానికి చెందిన వ్యక్తిగా పరిచయం చేయడం సబబుకాదు. దేశం కోసం, ఉయ్యాల వాడ అనే ప్రాంతం కోసం పోరాటం చేశారు. నేను భవిష్యత్తులో ఏదైనా చేయాలని అనుకుంటే ఆ ఊరి కోసం, దేశం కోసం చేస్తాను .అంతేకానీ ఓ కుటుంబం, నలుగురు వ్యక్తుల కోసం చేసి నరసింహారెడ్డి స్థాయిని తగ్గించలేను. నరసింహారెడ్డి బలమే చిరంజీవి, అమితాబ్‌తో పాటు అందరిని కలిపింది. చిరంజీవితో తెరపై కనిపించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఇందులో నటించారు.

చరిత్రకు దృశ్యరూపమిది -సురేందర్‌రెడ్డి

మాకు లభించిన ఆధారాలను అనుసరించి సినిమాను తెరకెక్కించాం. కథతో పాటు క్యారెక్టర్స్‌ డిమాండ్‌ మేరకే అమితాబ్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతిలను తీసుకున్నాం. సినిమా అంగీకరించడానికి ముందు నరసింహారెడ్డి గురించి నాకు తక్కువ తెలుసు. ఆరు నెలల పాటు ఆయన గురించి తెలుసుకోవడానికే సమయం కేటాయించాను. చాలా పుస్తకాలు చదివాను.నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి రేనాటి సూర్యచంద్రులు అనే ట్రస్ట్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన్ని కలిసి నరసింహారెడ్డికి సంబంధించిన చాలా విషయాల్ని తెలుసుకున్నాను. ప్రభాకర్‌రెడ్డి అనే మిత్రుడి ద్వారా చెన్నైనుంచి నరసింహారెడ్డికి సంబంధించిన చాలా గెజిట్స్‌ సేకరించాను. వ్యక్తులు చెప్పిన విషయాలు, గెజిట్స్‌లోని సమాచారం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తానని కలలో కూడా ఊహించలేదు. ఈ ఆఫర్‌ వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని వెల్లడించడానికి పదిహేను రోజులు సమయం తీసుకున్నాను. పీరియాడిక్‌ కథాంశం, భారీ బడ్జెట్‌, చిరంజీవి లాంటి అగ్ర నటుడితో ఈసినిమాను నేను చేయగలనా అనిపించింది. ఆ సమయంలో కష్టపడి చిరంజీవి జీవితంలో ఉన్నత శిఖరాల్ని ఎలా అధిరోహించారో మాత్రమే కనబడింది. ఆయన స్ఫూర్తి, ధైర్యంతో పాటు చరణ్‌ నా వెన్నంటి ఉన్నాడనే నమ్మకంతో ఈ సినిమా చేశాను.

ఇది చరిత్రకు దృశ్యరూపం. నరసింహారెడ్డి చేసిన త్యాగాలు విజయాలుగా అభివర్ణించవచ్చు. తన మరణంతోనే యుద్దాన్ని మొదలుపెట్టారు. ఆయన మరణాన్ని విషాదాంతంగా భావించడంలేదు. ఈ పీరియాడికల్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని పదేళ్ల క్రితం చేస్తే ఐదు వందల కోట్లు ఖర్చయ్యేది. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆనాటి కాలాన్ని సృష్టించడం సులభమైంది. రికార్డుల కోసం ఇతర సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేయలేదు. 150 సినిమాలు చేసిన చిరంజీవి కెరీర్‌లో ఈ చిత్రం నంబర్‌వన్‌గా నిలవాలి, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోవాలనే ఆలోచనతో రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మించారు. తండ్రికి పెద్ద బహుమతిని ఇవ్వాలనే సదుద్దేశ్యంతో తెరకెక్కించారు. అంతేకానీ డబ్బులు, రికార్డుల కోసం చేయలేదు. సంకల్పం గొప్పదైనప్పుడు సినిమా పెద్ద స్థాయిలో నిలుస్తుంది. నరసింహారెడ్డి జీవితం, ఆయన పోరాటంలోనే కమర్షియాలిటీ ఉందనిపించింది. ఆయనను ఉరితీసిన తర్వాత ముప్పై ఏళ్ల పాటు నరసింహారెడ్డి తలను కోటగుమ్మంపై వేలాడదీశారంటే ఆయన పట్ల అంగ్లేయుల్లో భయమే కారణం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

594

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles