పద్నాలుగు సినిమాల్ని ఫ్రీగా చేశాను!


Mon,July 8, 2019 11:50 PM

Sundeep Kishan  Ninu Veedani Needanu Nene Interview

కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు యువహీరో సందీప్‌కిషన్. ఆయన సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు విశ్వసిస్తారు. జయాపజయాల గురించి ఆలోచించకుండా కథలో నవ్యతకు పెద్దపీట వేయాలన్నదే నా సిద్ధాంతం అని చెబుతున్నారు సందీప్‌కిషన్. ఆయన కథానాయకుడిగా నటించిన నిను వీడని నీడను నేనే చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. కార్తీక్‌రాజు దర్శకుడు. ఈ సందర్భంగా సందీప్‌కిషన్ పాత్రికేయులతో ముచ్చటించారు.

-హిందీలో మనోజ్‌బాజ్‌పాయ్‌తో కలిసి అమెజాన్ వారు నిర్మిస్తున్న వెబ్‌సిరీస్ ది ఫ్యామిలీ మేన్‌లో నటించాను. చిత్రీకరణ పూర్తయింది. ఇందులో నేను కమెండోగా కనిపిస్తాను. దీనిని తెలుగులో అనువదించబోతున్నారు. నిను వీడని నీడను నేనే చిత్ర హిందీ రీమేక్ హక్కుల్ని అక్కడి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వారు అడిగారు. అందుకు సంబంధించిన ఒప్పందం గురించి త్వరలో వెల్లడిస్తాను.

హారర్ జోనర్ సినిమాలంటే అంతగా ఇష్టం ఉండదని ఓ సందర్భంలో చెప్పారు?

-స్వతహాగా నాకు హారర్ జోనర్ మీద ఆసక్తి ఉండదు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్‌లో హారర్‌కు మించిన అంశాలున్నాయి. కథ వినగానే ఉద్వేగానికి గురయ్యాను. థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు ప్రేక్షకులెవరూ హారర్ సినిమా చూశామని అనుకోరు. కథానుగుణంగా వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి.

ఇంతకి ఈ సినిమా కథేమిటి?

-2043లో మొదలైన కథ తిరిగి వర్తమానికి వస్తుంది. మరలా భవిష్యత్తులోకి వెళ్తుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా నడిచే సబ్జెక్ట్ ఇది. ఓ ప్రమాదానికి గురైన కథానాయకుడు అద్దంలో చూసుకున్నప్పుడు అందులో మరొక వ్యక్తి (వెన్నెల కిషోర్) కనిపిస్తాడు. అలా ఎందుకు కనిపిస్తాడన్నదే కథలో సస్పెన్స్. చాలా రోజుల తర్వాత భవిష్యత్తును ఆవిష్కరిస్తూ తెలుగులో వస్తున్న చిత్రమిది. 2043లో హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? అప్పుడు ఉండబోయే సాంకేతికత, ప్రజల జీవితం..ఈ అంశాలన్నింటికి వాస్తవికంగా సినిమాలోని ఓ ఎపిసోడ్‌లో చూపించబోతున్నాం.

ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు మీరే తీసుకోవడానికి కారణమేమిటి?

-నా గత మూడు చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. రిలీజ్ ముందే వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఈ సినిమాలో అలాంటి తప్పులు జరగొద్దని నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నాను. గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేశాం. ఈ చిత్ర భారాన్నంతా నామీదే వేసుకున్నాను. విడుదలకు ముందే ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తున్నది.

నిర్మాణ వ్యవహారాల వల్ల ఒత్తికి ఎక్కువై దాని ప్రభావం నటనపై పడుతుందని ఎప్పుడైనా భయపడ్డారా?

-అలాంటిదేమి లేదు. నటన నాకు అలవాటైపోయింది. కెమెరా ముందు నేను 200శాతం శ్రమిస్తాను. కాబట్టి యాక్టింగ్ పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు.

గత రెండేళ్లుగా మీ సినిమాలేవి రాలేదు. ఎందుకు విరామం తీసుకున్నారు?

-రెండేళ్లు ఎంతో సంఘర్షణకు లోనయ్యాను నన్ను నేను తెరపై చూసుకొని రెండేళ్లయింది. నక్షత్రం తర్వాత నా సినిమా ప్రేక్షకులముందుకు రాలేదు. అయితే ఆ సినిమా ఫలితం విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడం గొప్పగా అనిపించింది. ఈ రెండేళ్లలో దాదాపు 40కథల్ని విన్నాను. నా వ్యక్తిగత అనుభవంతో చెప్పాలంటే పరిశ్రమలో అవకాశాలు ఎవరూ ఇవ్వరు. మనమే సృష్టించుకోవాలి.

ఇప్పటివరకు దాదాపు 25 సినిమాలు చేశారు. మీ కెరీర్‌ను పరిశీలించుకుంటే ఏమనిపిస్తుంది?

-స్నేహగీతం చిత్రంతో నా ప్రయాణం మొదలైంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించాను. నా మనసుకు నచ్చిన కథాంశాల్ని ఎంచుకొని సినిమాలు చేశాను. అందులో జయాపజయాలు ఉన్నాయి. అయితే పరభాషల్లో చేసిన చిత్రాల్లో కొన్ని మంచి విజయాలు సాధించాయి. హోమ్‌గ్రౌండ్‌లో ఓడిపోయి బయటదేశంలో బాగా ఆడిన చందంగా నా పరిస్థితి తయారైంది (నవ్వుతూ). అయితే అవకాశాలపరంగా మాత్రం ఎప్పుడూ వెనకబడలేదు.

అపజయాల గురించి ఎప్పుడైన పునఃసమీక్ష చేసుకున్నారా?

-కథల్లో కొత్తదనానికే ప్రాధ్యానతనిస్తూ నేను సినిమాలు చేశాను. కొన్నిసార్లు నా అంచనాలు తప్పాయి. కెరీర్‌లో దాదాపు 14 సినిమాల్ని ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా చేశాను. ఒకవేళ సినిమా ఆడితే లాభాల్లో వాటా ఇవ్వాలనే ఒప్పందంతో సినిమాలు చేసేవాడిని. అందులో కొన్ని సినిమాలు ఆడాయి. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ ప్రయాణంలో నాకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాను. తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమల్లోనాకంటూగుర్తింపును సంపాదించుకున్నాను.

3079

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles