వినోదం అలరిస్తుంది


Sat,March 9, 2019 02:07 AM

sumanth ashwin nandita swetha starrer prema katha chitram 2 trailer released

ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత హారర్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆ ఆలోచనతో చాలా సినిమాల్ని తిరస్కరించాను. ఈ చిత్రాన్ని అంగీకరించానని తెలియగానే మళ్లీ హారర్ సినిమా చేస్తున్నావా? అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. కథ విన్న తర్వాత ఇందులో నటించననే మాట చెప్పలేకపోయాను అని చెప్పింది నందితా శ్వేత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రేమకథా చిత్రమ్-2. ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మించారు. సుమంత్ అశ్విన్, సిద్ధ్ది ఇద్నాని జంటగా నటించారు. హరికిషన్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో హాస్యనటుడు సప్తగిరి విడుదలచేశారు. ఈ సందర్భంగా నందితాశ్వేత మాట్లాడుతూ తొలిభాగంలోని నందు పాత్రను కొనసాగిస్తూ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. నా పాత్ర చాలా కాలం పాటు అందరిని వెంటాడుతుంది అని తెలిపింది. తొలి భాగానికి ధీటుగా ఛాలెంజింగ్‌గా భావించి ఈ సినిమా చేశామని దర్శకుడు హరికిషన్ పేర్కొన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ సప్తగిరి లేకుండా ప్రేమకథా చిత్రమ్ లేదని అందరూ అంటున్నారు. తప్పకుండా ఆయనతో మూడోభాగం చేస్తాం. రామ్‌ప్రసాద్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ కథను నమ్మి ఈ సినిమాను నిర్మించాం.తొలి సినిమా అయినా దర్శకుడు హరికిషన్ ఎంతో అనుభవజ్ఞుడిలా తెరకెక్కించారు. సుమంత్ అశ్విన్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. ఏప్రిల్ 6న ఉగాది సందర్భంగా సినిమాను విడుదలచేయనున్నాం. తొలిభాగంతో ఈ సినిమాను పోల్చిచూడవద్దు. వినోదం, కథా పరంగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌చేస్తారు అని తెలిపారు. తొలి భాగానికి మించి ఈ సీక్వెల్ పెద్ద విజయాన్ని సాధించాలని సప్తగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్, సిద్ధి ఇద్నానీ, జేబీ తదితరులు పాల్గొన్నారు.

1051

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles