అలా బతికితే గౌరవం ఉండదు


Tue,June 12, 2018 11:31 PM

Sudheer Babu Interview About Sammohanam Movie

సినిమా తారల పట్ల సగటు ప్రేక్షకుల్లో ఉండే అపోహల్ని, దురభిప్రాయాల్ని చర్చిస్తూ సహజంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఇతరుల్ని కించపరిచే సన్నివేశాలు, పాత్రలు ఈ సినిమాలో కనిపించవు అని అన్నారు సుధీర్‌బాబు. ప్రయోగాలు, మల్టీస్టారర్ ఇతివృత్తాలతో నవతరం కథానాయకుల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారాయన. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సమ్మోహనం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సుధీర్‌బాబు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
sudheer-babu

సినీ రంగంపై సైటెర్లు వేసినట్లున్నారు?

-సినిమారంగం పట్ల కొంతమందిలో ఉండే దురభిప్రాయాల్ని, వారి ఆలోచనాధోరణిని నా పాత్ర ప్రతిబింబిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో చూపించేవన్నీ నిజాలు కావు. తెరమీదతో పోలిస్తే నిజజీవితంలో తారలు విభిన్నంగా ఉంటారు. కెమెరా ముందు వస్తే మరోలా మాట్లాడుతుంటారని చాలా మంది అపోహపడుతుంటారు. అలాంటి సందేహలన్నీ ఈ సినిమా కొంతవరకైనా నివృత్తి చేస్తుంది. మరొకరిని కించపరిచేలా కాకుండా ఆలోచనాత్మకంగా దర్శకుడు ఆ అంశాల్ని చూపించారు. మేకప్, షూటింగ్‌లకు దూరంగా రోజువారీ జీవితంలో స్టార్స్ ఎలా ఉంటారో ఈ సినిమాలో ఆవిష్కరించారు.
సినిమాల్లో రాణించాలనే తపనతో ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తుంటారు. దర్శకులే కాకుండా కొరియోగ్రాఫర్స్, ఫైట్‌మాస్టర్స్, నటీనటులు ఇలా చాలా మంది ప్రతిభ ఉండి సరైన ప్రోత్సాహం లేక తిరిగి వెళ్లిపోతున్నారు. అలాంటి కొత్తవారిని గుర్తించి అవకాశాలివ్వాలనే ఆలోచనతో నిర్మాణ సంస్థను ప్రారంభించాను. ఈ సంస్థలో తొలి ప్రయత్నంగా ఆర్.ఎస్. నాయుడు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నాను. స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేనే కథానాయకుడిగా నటిస్తున్నాను. 80శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు నెలల్లో విడుదలచేసే ఆలోచనలో ఉన్నాం.

సినిమాలో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?

-ఇందులో విజయ్ అనే చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటర్‌గా కనిపిస్తాను. కళాకారుడిగా గొప్ప పేరుతెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. సినిమా ప్రపంచం అంటే నచ్చదు. అదితిరావ్ హైదరీ ఓ సినిమా తారగా కనిపిస్తుంది. భిన్న రంగాలు, మనస్తత్వాలు కలిగిన వారి మధ్య పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశం అలరిస్తుంది. పూర్తిస్థాయి రొమాంటిక్ లవ్‌స్టోరీతో దర్శకుడు మోహనకృష్ణ చేసిన తొలి సినిమా ఇది. హాస్యంతో పాటు అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుంది.

గత కొంతకాలంగా రియలిస్టిక్ కథాంశాలతోనే ఎక్కువగా సినిమాల్ని చేస్తున్నారు?

-నటుడిగా మూస ఇమేజ్‌కు పరిమితవ్వాలని కోరుకోవడం లేదు. మంచి నటుడిగా నిరూపించుకోవాలనే ఇండస్ట్రీలోకి వచ్చాను. యాక్షన్ ఇమేజ్‌తో ప్రతిసారి నెట్టుకురావడం కుదరదు. కథ, పాత్రలకు అనుగుణంగా ప్రతి సినిమాలో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకే తరహాలో కాకుండా డిఫరెంట్ జోనర్స్ సినిమాలు చేస్తేనే అది సాధ్యం అవుతుంది. అందుకే వెతుక్కుంటూ వచ్చిన స్క్రిప్ట్‌లలో నచ్చినవి ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాను.

మోహనకృష్ణ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడిగా తొలిసారి పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

-దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో గతంలో ఓ సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. నా తొలి సినిమా ఎస్.ఎమ్.ఎస్ విడుదలకు ముందు అవసరాల శ్రీనివాస్ సిద్ధం చేసిన ఓ కథను తీసుకొని మోహనకృష్ణ నా వద్దకు వచ్చారు. ఆడిషన్ చేసి సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం చేయడం కుదరలేదు. ఆ తర్వాత ఆ కథనే అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే పేరుతో తెరకెక్కించారు. మోహనకృష్ణతో సినిమా చేసే అవకాశం అప్పుడు చేజారిన మళ్లీ సమ్మోహనం ద్వారా కుదరడం ఆనందంగా ఉంది. గతంలో చేసిన కొన్ని సినిమాల్లో ఇంకా చక్కటి నటన కనబరిస్తే బాగుండేది అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణలో ఎప్పుడూ అలాంటి సంశయాలు తలెత్తలేదు. ఇదే నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాను.

ప్రీ రిలీజ్ వేడుకలో సుధీర్‌బాబును మేము ప్రోత్సహించకపోయినా హీరోగా నిలబడ్డాడు అని మహేష్‌బాబు అన్నారు. సొంతంగా నిలబడాలనే ఆలోచనతోనే మహేష్‌బాబు సహాయాన్ని కోరలేదా?

-నాకంటూ సొంతంగా ఏదైనా సాధించాలనే ఆలోచనతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. మా నాన్నగారికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాటిని చూసుకునే బాధ్యతల్ని చేపడుతానంటే ఆయన కాదనరు. సంతృప్తి కోసమే నాకు నచ్చిన నటనను ఎంచుకున్నాను. ఇక్కడ కూడా ఇతరుల పేర్లు చెప్పుకుంటూ వారి ద్వారా అవకాశాలు పొందుతూ బతికితే గౌరవం ఉండదు. స్వతంత్య్ర భావాలతోనే జీవించాలని కోరుకుంటాను.

ప్రీ రిలీజ్ వేడుకలో చాలా ఎమోషనల్ అయ్యారు?

-ఇప్పటివరకు ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేశాను. అనుభవజ్ఞుడైన దర్శకుడితో పనిచేయడం ఇదే తొలిసారి. నా ప్రతిభను నమ్మి మోహనకృష్ణ అవకాశమివ్వడం, ఇప్పటివరకు వరకు తాను పనిచేసిన వారిలో నేనే బెస్ట్ అని చెప్పడంతో కొంత ఎమోషనల్ అయ్యాను. ఆయన మాటల్ని ఓ అచీవ్‌మెంట్‌లా ఫీలయ్యాను. ఆయనతో ఒక్కటి కాదు వంద సినిమాలైనా చేయడానికైనా సిద్ధమే.

పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

-సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందిస్తాం. బయోపిక్ అనగానే చాలా మంది యథాతథంగా వ్యక్తుల్ని అనుకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాకుండా వారి జీవితాల్ని, వ్యక్తిత్వాల్ని చూపించే ప్రయత్నం చేయరు. ఈ బయోపిక్ ప్రారంభానికి ముందు కొన్నాళ్లు పుల్లెల గోపీచంద్‌తో కలిసి ప్రయాణించాలనుకుంటున్నాను. గోపీచంద్‌ను దగ్గరుండి పరిశీలించి ఆయన పాత్రను అర్థం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను.

మీ ప్రొడక్షన్‌లో మహేష్‌బాబుతో సినిమా చేసే ఆలోచన ఉందా?

-మంచి కథ దొరికితే తప్పకుండా మహేష్‌బాబుతో చేస్తాను. మహేష్‌బాబు, ఇంద్రగంటి కాంబినేషన్ కుదిరితే ఇంకా బాగుంటుంది. ఆయనపై మహేష్‌బాబుకు మంచి నమ్మకం ఉంది. ప్రీ రిలీజ్ వేడుక తర్వాత మోహనకృష్ణను ప్రశంసిస్తూ నాతో అరగంటపైనే మాట్లాడారు.

మోహనకృష్ణ చెప్పిన కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?

-దర్శకుడు మోహనకృష్ణ కథ చెప్పగానే ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా ఈ చిత్రానికి ఓకే చెప్పాను. నిజజీవితాలకు దర్పణంలా ఉంటుంది. నాయకానాయికల మధ్య ఉండే సంభాషణలు, రొమాన్స్, వినోదం అన్ని రియలిస్టిక్‌గా ఉంటాయి. గతంలో నేను కొన్ని లవ్‌స్టోరీస్ చేశాను. వాటికి భిన్నమైన చిత్రమిది. నాకు ఓ ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమాటిక్ అనుభూతితో కాకుండా యథార్థ జీవితాల్ని కళ్లముందు చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.

1996

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles