మహేష్ భయంతో వణికిపోయాడు!


Fri,September 21, 2018 12:01 AM

Sudheer Babu Comments On Mahesh Babu Nannu Dochukunduvate Movie Interview

జీవితంలో స్వతంత్రంగా వుండాలనేది నా భావన. నటుడిగా కూడా స్వతంత్రుడిగా వచ్చాను. నన్ను మీ సంస్థ ద్వారా పరిచయం చేయండని, ఎవరికైనా రికమెండ్ చేయండని కృష్ణగారిని ఎప్పుడూ అడగలేదు. నాకు నేనుగా ఎదగాలనుకున్నాను. అవకాశాల కోసం తిరిగాను. నటుడిగా నిలబడ్డాను అన్నారు సుధీర్‌బాబు. ఆయన నటిస్తూ తొలిసారి నిర్మిస్తున్న తాజా చిత్రం నన్ను దోచుకుందువటే. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

నిర్మాణ సంస్థను ప్రారంభించడానికి కారణం?

నా కెరీర్ తొలి నాళ్లల్లో అవకాశాల కోసం మంచి కథ, ప్రతిభగల దర్శకుడితో పాటు యువ ప్రతిభావంతుల్ని కొంత మందిని ఎంపిక చేసుకుని ఒక్కఛాన్స్ ఇవ్వమని చాలా మంది నిర్మాతల్ని సంప్రదించాను. అలా వెళ్లి నిరాశతో వెనుదిరిగిన సందర్భాలు చాలా వున్నాయి. నేను తీసుకెళ్లిన చాలా మంది ప్రతిభావంతులు అవకాశాలు రాక ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్లిపోయారు. అప్పుడే సొంత నిర్మాణ సంస్థని స్థాపించాలని నిర్ణయించుకున్నాను.

మీ కెరీర్‌లో సమ్మోహనం పెద్ద విజయాన్ని సాధించింది. ఆ సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనతోనే నిర్మాతగా మారారని అనుకోవచ్చా?

సాధారణంగా నా సినిమాలు పూర్తి కావడానికి ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంటుంది. సమ్మోహనం విడుదలకు ముందే నన్ను దోచుకుందువటే చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. మంచి పని చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా అన్నీ కలిసివస్తాయి అంటారు అలా ఈ సినిమా విషయంలో అన్నీ కలిసొచ్చాయి.

ఈ చిత్రాన్ని తొలుత వేరే నిర్మాత నిర్మించాలనుకున్నారని తెలిసింది?

ఈ సినిమా కోసం దర్శకుడు ముందు నుంచి హీరోగా నన్నే అనుకున్నారు. అయితే నేను ఈ సినిమాకు సంతకం చేసిన తరువాత ముందు అనుకున్న నిర్మాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పుడు దర్శకుడు మీరు చేస్తారా? అన్నాడు. ప్రాజెక్ట్ నచ్చడంతో నేనే నిర్మాతగా మారాను.

మీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఖర్చు చేశారా?

మార్కెట్ గురించి పెద్దగా ఆలోచించను. సొంత నిర్మాణ సంస్థలో సినిమా కాబట్టి మార్కెట్ లెక్కలు వేసుకోలేదు. బ్యానర్‌కు పేరు రావడంతో పాటు సినిమాకు పనిచేసిన అందరికి మంచి గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో ఎక్కడా రాజీపడకుండా ఖర్చు చేశాను. తొలుత ఈ నెల 13న చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించాను. కొన్ని కారణాల వల్ల రిలీజ్ తేదీని 21కి మార్చడం జరిగింది.

సినిమాలో మీ పాత్ర చిత్రణ ఎలా వుంటుంది?

సినిమాలో నా పాత్ర పేరు కార్తీక్. కోపం ఎక్కువ. ఎమోషన్స్, సెంటిమెంట్స్ అంటూ ఏమీ వుండవు. ఎవరెన్ని చెప్పినా పట్టించుకోడు. పనిచేస్తే వుండు లేదంటే వెళ్లిపో అనే మనస్తత్వం అతనిది. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాగుతుంది. సినిమాలోని పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా వుంటాయి. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న నభానటేష్‌కు మంచి పేరొస్తుంది.

హీరోగా చెక్కులు తీసుకోవడానికి, నిర్మాతగా చెక్కులు ఇవ్వడానికి మధ్య వున్న తేడాను గమనించారా?

నవ్వుతూ) ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాలకు చెక్కులు తీసుకున్నానని అనుకుంటున్నారా?. అందులో డబ్బులు తీసుకోకుండా చేసిన సినిమాలు కూడా వున్నాయి. నేను చేసిన యాభై శాతం చిత్రాల వల్ల రూపాయి కూడా సంపాదించలేదు. వాటి ద్వారా పేరు మాత్రమే సంపాదించాను.

మీ సంస్థలో మహేష్‌బాబు నటించే అవకాశం వుందా?

మంచి కథ కుదరాలి అలా కుదిరితే మహేష్‌తో తప్పకుండా సినిమా చేస్తాను. తనతో సినిమా అంటే చాలా బాధ్యతలతో కూడుకుని వుంటుంది. వాటన్నింటిని పట్టించుకోకుండా కథ దొరికింది కదా అని చేస్తే.. అది అనుకున్న స్థాయిలో అంచనాల్ని అందుకోలేకపోతే అంతా తిడతారు.

మీ కాంపౌండ్‌లో చాలా నిర్మాణ సంస్థలు వుండగా కొత్తగా మరొకదాన్ని ప్రారంభించడానికి కారణం?

స్వతంత్రంగా వుండాలనేది నా భావన. నటుడిగా కూడా నేను స్వతంత్రుడిగా వచ్చానే కానీ నన్ను మీ సంస్థ ద్వారా పరిచయం చేయండని, ఎవరికైనా రికమెండ్ చేయండని కృష్ణగారిని ఎప్పుడూ అడగలేదు. నాకు నేనుగానే ఎదగాలనుకున్నాను. అవకాశాల కోసం తిరిగాను. నటుడిగా నిలబడ్డాను. శ్రమించాలనే తత్వమే లేకపోతే మా నాన్న స్థాపించిన సంస్థలో హాయిగా ఏసీ రూమ్‌లో కూర్చుని సంతకాలు చేస్తూ కాలం గడిపేసేవాడిని. అలా జీవించడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా నా కంటూ ప్రత్యేకత వుండాలి.

ఇకపై కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తారా?

ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన లేదు. సోలో హీరోగానే చేయాలనుకుంటున్నాను. మంచి కథలు రాకపోవడం వల్లే మల్టీస్టారర్ చిత్రాలు అంగీకరించాను. సుధీర్‌బాబు యాక్షన్ సినిమాల్లోనే నటిస్తాడు. సాఫ్ట్ రోల్స్ చేయడు అని కొంత మంది అన్నారు. దాన్ని బ్రేక్ చేయడం కోసమే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని చేశాను. నేను నటించిన కొన్ని చిత్రాలు పరాజయాలుగా మిగిలాయి కానీ నటుడిగా మాత్రం నేను ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.

మీరు నిర్మాతగా మారుతున్నారంటే మహేష్ ఏమన్నారు?

(నవ్వుతూ) మహేష్ మంచి నటుడు. ఏదీ పైకి కనిపించనివ్వడు. బయటికి ఏమీ లేనట్లుగా కనిపిస్తున్నా అతనికీ లోపల భయం, కంగారు వుంటుంది. నేను నటుడిని అవుతానంటేనే ఎలా వుంటుందో అని లోలోపల భయంతో వణికిపోయాడు. ఇక్కడ కష్టపడితే సరిపోదు దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. అసలే ఎక్కువగా మాట్లాడని వ్యక్తి నటుడిగా ఫెయిలైతే ఏమైపోతాడో అని మహేష్ కంగారుపడ్డాడు. ప్రస్తుతం నా ఎదుగుదలను చూసి గర్వపడుతున్నాడు.

5145

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles