కాపీ కొట్టాల్సిన ఖర్మ ఎందుకు?


Sun,October 14, 2018 02:05 AM

SS Thaman About Aravinda Sametha Movie

తమన్..హుషారైన బాణీలతో కుర్రకారులో జోష్ నింపుతారు.ఐటెం నంబర్స్‌తో మాస్‌ను ఉర్రూతలూగిస్తారు. తెలుగు సంగీత ప్రపంచంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. మాస్ పల్స్‌ను ఒడిసిపట్టిన స్వరకర్తగా ఆయనకు మంచి పేరుంది. అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాల విజయాల్లో కీలక భూమిక పోషించారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి తమన్ సంగీతాన్నందించారు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా తమన్ శనివారం పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకున్నారు.

ఎందుకు కాపీకొట్టాలి..?

ట్యూన్స్‌ను ఎక్కడి నుంచో కాపీ కొడుతున్నారనే విమర్శల్ని నేను అస్సలు పట్టించుకోను. ధైర్యముంటే ఈ అంశంలో అగ్ర సంగీత దర్శకుల్ని ప్రశ్నించండి. ఆ పని ఎవరూ చేయరు. నేను కామ్‌గా ఉంటానని నా మీద అనవసరమైన విమర్శలు చేస్తారు. బిజినెస్‌మేన్ నా పద్దెనిమిదవ సినిమా. అందులో ఓ పాట కాపీ కొట్టానని విమర్శలు చేశారు. ఐదుపాటలకు మంచి ట్యూన్స్ ఇచ్చి ఆరో పాటకు కాపీ కొట్టాల్సిన కర్మ ఎందుకుంటుంది? అందుకే విమర్శల గురించి నేను పట్టించుకోను. ప్రతి ఒక్క సంగీత దర్శకుడికి ఓ ైశైలి ఉంటుంది. దానిని కాపీ అంటే ఎలా? ఇప్పటికీ దాదాపు 60 సినిమాలు చేశాను. కాపీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ స్థాయిలో అవకాశాలు వచ్చేవా?

త్రివిక్రమ్, తారక్ వంటి వారు ఛాన్స్ ఇచ్చేవారా?

అరవింద సమేత కోసం దాదాపు సంవత్సరకాలంగా త్రివిక్రమ్, తారక్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఈ ప్రయాణం ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. సినిమా విడుదలయ్యాక వారిద్దరు అందించిన ప్రశంసలే అత్యుత్తమమని భావిస్తున్నాను. కథతో సహానుభూతి చెంది అద్భుతమైన సంగీతాన్నందించావు. నీ కెరీర్‌లో గుర్తుంచుకునే సినిమా ఇది అని వారు అభినందించారు. పరిశ్రమలోని పలువురు దర్శకులు కూడా నా వర్క్ చాలా బాగుందని మెచ్చుకున్నారు.

స్క్రిప్ట్ బాగుంది కాబట్టే..

కమర్షియల్ సినిమా అంటే ఓ మాస్ పాట, ఐటెమ్‌సాంగ్ అంటూ కొన్ని లెక్కలుంటాయి. వాటికి అతీతంగా స్క్రిప్ట్‌కు అనుగుణంగా ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాను. ఈ రోజు అందరి అభినందనలు లభిస్తున్నాయంటే అందుకు కారణం కథాబలమే. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్, తారక్ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాంతో మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలిగాను. త్రివిక్రమ్ సినిమాలు చక్కటి కథాబలం, గొప్ప సంభాషణల మేళవింపుతో వుంటాయి. అతడు సినిమా నుంచి ఆయన సినిమాల్లోని సంగీతాన్ని గమనిస్తున్నాను. ప్రతి పాట కథలో భాగంగానే ఉంటుంది. ఎక్కువగా మెలోడీ గీతాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆయన అభిరుచుల్ని గౌరవిస్తూ ఈ సినిమాలో స్వరరచనకు శ్రమించాను.

ఎనిమిదేళ్లు పట్టింది..

త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరింది. త్రివిక్రమ్ అద్భుతమైన సృజనశీలి. ఆయన సహచర్యంలో స్కూల్ నుంచి కాలేజీకి అప్‌గ్రేడ్ అయ్యాననే భావవ కలిగింది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అందరికి అర్థమయ్యేలా చెబుతారాయన. సందర్భానుసారంగా ఎలాంటి పాటలు అవసరమో త్రివిక్రమ్ సలహా ఇచ్చారు. అందువల్లే వైవిధ్యమైన బాణీలను అందించగలిగాను.

హిట్ ఇంపార్టెంట్..

సంగీతపరంగా ఎంతటి బ్లాక్‌బస్టర్ పాటను అందించినా సినిమా ఫెయిలైతే ఆ పాటను మర్చిపోతారు. సంగీతం అందరికి చేరువకావాలంటే సినిమా విజయం చాలా ముఖ్యం. దర్శకుడి హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడే అనుకున్నరీతిలో నాణ్యమైన సంగీతాన్ని అందివ్వగలుగుతాం. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కథలోని ఆత్మను, దర్శకుడి ఆలోచనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలగాలి. పాటల విషయంలో అలా కాదు..ఓ సన్నివేశాన్ని అర్థం చేసుకుంటే పాటకు ట్యూన్ కట్టేయొచ్చు. నా దృష్టిలో పాట మ్యూజికల్ వెర్షన్ ఆఫ్ డైలాగ్ అనుకుంటాను.

అది తప్పనిసరి..

మన పరిశ్రమ హీరో ఇమేజ్, వారి అభిమానగణం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే హీరోలు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తారు. సంగీతం విషయంలో కూడా వారి ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. అలా ఉండటంలో తప్పులేదనుకుంటాను. అదే విధంగా సంగీత దర్శకుడికి హీరో మీద అభిమానం ఉండాలి. అప్పుడే అందరు మెచ్చే స్వరాల్ని అందించడం సాధ్యమవుతుంది. సరైనోడు సినిమాతో తెలుగులో నా సెకండ్‌ఇన్సింగ్స్ మొదలైంది. ఫాస్ట్‌బీట్ సాంగ్స్ చేసి రెండేళ్లయింది. ఈ మధ్యకాలంలో మాస్‌సాంగ్స్ చేయలేకపోతున్నాను.

పంథా మార్చుకున్నాను..

ఈ మధ్యకాలంలో కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాల్ని ఎంపిక చేసుకుంటున్నాను. గడచిన కొద్దికాలంగా దర్శకుల అభిరుచుల్లో కూడా చాలా మార్పులొచ్చాయి. పాటల విషయంలో రిఫరెన్స్‌లు చూపించకుండా కథ ప్రకారం ట్యూన్స్ అందించమని అడుగుతున్నారు. అందుకే గతకొంతకాలంగా తెలుగు సినిమా మంచి విజయాలతో దూసుకుపోతున్నది.

మొదటిపాటతోనే ఇంప్రెస్ చేయాలి..

నాకు ఫస్ట్‌బాల్‌కు సిక్స్ కొట్టడం ఇష్టం..కథ విన్న తర్వాత మొదటిపాట తప్పకుండా అందరికి నచ్చేలా కంపోజ్ చేయాలి. ఆ నమ్మకం చాలా ముఖ్యం. ఫస్ట్‌పాటతో మెప్పించలేకపోతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫస్ట్ పాటకు నేను ఎక్కువగా టైమ్ తీసుకుంటాను. హైదరాబాద్‌లో మ్యూజిక్ టాలెంట్ విస్తారంగా ఉంది. గాయనీగాయకులు, వాయిద్యకారులు ఎందరో ఇక్కడ ఉన్నారు. ప్రతి పనికి చెన్నైకి పోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

మ్యూజిక్ ఈజీ అయిపోయింది..

ప్రస్తుత తరుణంలో మ్యూజిక్ చాలా ఈజీ అయిపోయింది. పియానో కొనుక్కొని సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. అయితే నా దృష్టిలో సంగీత దర్శకుడిగా రాణించాలంటే సంగీతవిభావరిల్లో ఎక్కువగా పాల్గొనాలి. అది ఓ పాఠశాలల ఉపయోగపడుతుంది. మ్యూజిక్స్ కాన్సర్ట్స్‌లో అన్ని హిట్ పాటలే పాడతాం. వివిధ సంగీత దర్శకుల పాటల్ని ప్లే చేస్తాం. స్టేజీషోస్ వల్ల ప్రతిభ మరింత రాటుతేలుతుంది. కెరీర్ ఆరంభంలో నేను దాదాపు 6000లకుపైగా స్టేజీషోలు చేశాను. వాటివల్లే సంగీత దర్శకుడిని కాగలిగాను. మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం వల్ల కమర్షియల్ పాటలు ఎలా చేయాలి? ఆల్బమ్ సాంగ్స్ ఎలా చేయాలి? అనే అంశాల పట్ల అవగాహన పెరుగుతుంది. ఇవన్నీ దాటుకుని వస్తేనే సంగీతకారుడిగా రాణిస్తాం.

3069

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles