కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తున్నారు


Wed,September 20, 2017 11:19 PM

Srivalli
ఈ రోజుల్లో కొత్తనటీనటులతో సినిమా తీసి విడుదల చేయడమే నా దృష్టిలో అతిపెద్ద యజ్ఞం. ఆ పనిని విజయవంతంగా మా నిర్మాతలు పూర్తిచేయగలిగారు. ప్రతి ఏరియాల బిజినెస్‌ను పూర్తిచేశారు. సినిమా కొన్న పంపిణీదారులందరూ సంతోషంగా ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా నా లాంటి తిక్కవాడితో సినిమా తీసి నిర్మాతలు సక్సెసయ్యారు అని అన్నారు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటించారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రవిజయోత్సవ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ సినిమా చూసిన వాళ్లందరూ శ్రీవల్లీ బాగుందని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. రజత్‌లోని నెగెటివ్ షేడ్స్ చూసే అతడికి ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాను. తన పాత్రలో ఒదిగిపోయాడు. మోహన్‌బాబు, చిరంజీవి, రజనీకాంత్ తో పాటు చాలా మంది ప్రతినాయకులుగా సినీ జీవితాన్ని మొదలుపెట్టి గొప్ప నటులయ్యారు. వారి బాటలోనే రజత్ అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. నేహాహింగేతో పాటు ప్రతి ఒక్కరూ బాగా నటించారు. రేష్మాస్ సంస్థ నా పెంపుడు కూతురు వంటిది. నేను జీవించివున్నంతకాలం ఈ సంస్థకు సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ తక్కువ బడ్జెట్‌తో మంచి కథలను తెరకెక్కించడానికి ఈ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

అవసరమైతే ఆ సినిమాలకు నా సహకారాన్ని అందిస్తాను అని తెలిపారు. నిర్మాత సునీత మాట్లాడుతూ రేష్మాస్ సంస్థ ద్వారా తొలి ప్రయత్నంలో విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సినిమా చేయడం గర్వంగా ఉన్నది. రెండు వందల థియేటర్లలో ఈ సినిమా విడుదల చేశాం. ఓవర్సీస్ నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఒక సినిమాతో మా ప్రయాణం ఆగదు. ఇకపై మా సంస్థ ద్వారా వరుసగా సినిమాలు చేస్తాం. సుకుమార్ నిర్మాణంలో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కథాబలమున్న వినూత్న పాయింట్స్‌తో సినిమాలు చేయాలన్నది మా అభిమతం అని చెప్పారు. కొత్త ప్రయత్నాన్ని అన్ని వర్గాల వారు ఆదరించడం ఆనందంగా ఉన్నదని, ఈ విజయం మరిన్ని సినిమాల్ని రూపొందించడానికి మాలో ధైర్యాన్ని నింపిందని మరో నిర్మాత రాజ్‌కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో రజత్ పాల్గొన్నారు.

284

More News

VIRAL NEWS