భవిష్యత్ గురించి ఆలోచించలేదు


Sun,April 14, 2019 11:29 PM

shraddha srinath says jersey filled honest emotions

గ్లామర్, డీ గ్లామర్ పాత్రలనే పరిమితులేవి తనకు లేవని, ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమేనని చెప్పింది శ్రద్ధాశ్రీనాథ్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం జెర్సీ. నాని హీరోగా నటిస్తున్నారు. గౌతమ్‌తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో శ్రద్ధాశ్రీనాథ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ తెలుగులో నేను సంతకం చేసిన మూడో సినిమా ఇది. ముందు అంగీకరించిన చిత్రాల నిర్మాణం ఆలస్యం కావడంతో జెర్సీ తొలుత ప్రేక్షకుల ముందుకొస్తున్నది. తమిళం, కన్నడ సినిమాల్లో నా నటన నచ్చడంతో చిత్రబృందం నన్ను సంప్రదించారు.

భావోద్వేగాలపై ఆధారపడిన సినిమా కావడంతో రెండు గంటల పాటు జాగ్రత్తగా కథ విన్నాను. కథతో పాటు నా పాత్రకున్న ప్రాధాన్యత నచ్చడంతో ఈ సినిమాను అంగీకరించాను. ఇందులో సారా అనే క్యాథలిక్ క్రిస్టియన్ అమ్మాయిగా విభిన్నంగా నా పాత్ర సాగుతుంది. క్రికెటర్‌గా గొప్ప పేరు తెచ్చుకోవాలని సంకల్పించిన ఓ వ్యక్తి తన లక్ష్యానికి ఎందుకు దూరమయ్యాడు? పదేళ్ల విరామం తర్వాత తన కలను ఎలా నేరవేర్చుకున్నాడన్నది ఇందులో ఆకట్టుకుంటుంది. అర్జున్, సారా అనే జంట జీవితంలోని 1986, 96, 2018 మూడు దశల్ని హృద్యంగా ఆవిష్కరిస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1986 ఎపిసోడ్ అర్జున్, సారాల ప్రేమాయణంతో సరదాగా సాగుతుంది. 1996లో భార్యాభర్తలుగా మారిన తర్వాత కుటుంబ బాధ్యతలతో సీరియస్‌గా సాగుతుంది. భర్తపై ప్రేమ ఉన్నా బాధ్యతల కారణంగా అతడిని ద్వేషిస్తూ కనిపిస్తుంటాను.

తల్లిగా నటించాను..
ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించడానికి చాలా ఆలోచించాను. అలాంటి పాత్రలకే సరిపోతాననే ముద్రను నాపై వేస్తారని భయపడ్డాను. కానీ ఇలాంటి వైవిధ్యమైన కథలో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుందని అనిపించింది. భవిష్యత్తును గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఈ కథలో భాగమయ్యాను. తెలుగు భాషను అర్థంచేసుకుంటూ నటించడంలో నాని చక్కటి సహకారాన్ని అందించారు. నాన్న ఆర్మీ ఉద్యోగి కావడంతో సికింద్రాబాద్‌లో ఆరేళ్ల పాటు చదువుకున్నాను. తెలుగుభాషను అప్పుడే నేర్చుకున్నాను. తెలుగులో పెళ్లిచూపులు, బాహుబలి సినిమాలు నచ్చాయి.

తరుణ్‌భాస్కర్‌తో పాటు రాజమౌళి, శంకర్‌లతో సినిమాలు చేయాలన్నది నా కల. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేశాను. భాష అంతరాలు మినహా ఇండస్ట్రీల మధ్య పెద్దగా భేదాలేవీ కనిపించలేదు. ప్రస్తుతం తెలుగులో క్షణం దర్శకుడు రవికాంత్ పేరేపుతో ఓ సినిమాతో పాటు అది సాయికుమార్‌తో జోడీలో నటిస్తున్నాను. భవిష్యత్తులో తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తూ అందరి ఆదరణ పొందాలన్నదే నా ఆశ.

948

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles