దివికేగిన విప్లవకేతనం


Mon,October 9, 2017 11:06 PM

Senior Dialogue Writer and actor MVS Haranatha Rao passes away in Ongole

harinathrao
అభ్యుదయ భావాలతో ఎన్నో సామాజిక సందేశాత్మక చిత్రాలకు సంభాషణల్ని అందించిన ప్రఖ్యాత సినీ రచయిత ఎం.వి.హరనాథరావు (72) సోమవారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కన్నుమూశారు. దాదాపు 150 చిత్రాలకు ఆయన మాటల్ని రాశారు. కేవలం సినీ రచయితగానే కాకుండా నాటక రచయితగా తెలుగునాట మంచి పేరుప్రఖ్యాతుల్ని సంపాదించుకున్నారాయన. విప్లవభావాలు, మానవీయ కోణం కలబోతగా ఆయన రచన చేసిన సినిమాలెన్నో విశేష ప్రేక్షకాదరణ పొందాయి. తెలుగు సినీ చరిత్రలో ప్రతిభావంతులైన రచయితల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు.

నాటకాల ద్వారా కళారంగంలోకి..

గుంటూరులో జన్మించిన హరనాథరావుకు అక్కడి పరిస్థితుల ప్రేరణతో చిన్నతనం నుంచే నాటకాలపై మమకారం ఏర్పడింది. తల్లి సత్యవతీదేవి సంగీతకారిణి కావడంతో సంగీతంపై కూడా అవగాహన కలిగింది. రక్తబలి పేరుతో ఆయన తొలి నాటకాన్ని రాశారు. కాలేజీ పూర్తయ్యాక ఓ నాటక సమాజాన్ని స్థాపించి జగన్నాథ రథచక్రాలు నాటకాన్ని రచించారు. దేవుని అస్తిత్వాన్ని చర్చిస్తూ తాత్విక దృక్పథంతో రాసిన ఈ నాటకం హరనాథరావుకు మంచి పేరు తీసుకొచ్చింది. కథావస్తువుపై కొందరు విమర్శలు చేశారు కూడా. ఈ నాటకాన్ని మద్రాస్‌లో ప్రదర్శించినప్పుడు బి.ఎన్.రెడ్డి, ఆత్రేయ, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖులు చూశారు. హరనాథరావు ప్రతిభకు మెచ్చి ఆయన్ని సినిమాల్లోకి రావాలని కోరారు. అనివార్య కారణాల వల్ల ఆ సమయంలో హరనాథరావు సినిమాల్లోకి వెళ్లలేకపోయారు. అనంతరం ఆయన రచించిన క్షీరసాగరమథనం అంతం కాదిది ఆరంభం యక్షగానం నాటకాలు అనేక బహుమతుల్ని గెల్చుకున్నాయి. క్షీరసాగర మథనం సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకుంది. హరనాథరావు నాటకాలకు దర్శకత్వం వహించడమే కాకుండా కొన్నింటికి సంగీతాన్ని కూడా అందించాడు.

సినీరంగంవైపు పయనం...

కాలేజీ రోజుల్లో టి.కృష్ణతో ఏర్పడిన పరిచయం హరనాథరావుని సినీరంగంవైపు నడిపించింది. టి.కృష్ణ దర్శకత్వం వహించిన నేటి భారతం దేశంలో దొంగలు పడ్డారు వందేమాతరం ప్రతిఘటన రేపటిపౌరులు చిత్రాలకు హరనాథరావు సంభాషణల్ని అందించారు. సామాజిక వివక్షను, రాజకీయ అవినీతిని, సమాజంలో పేరుకుపోయిన రుగ్మతల్ని ప్రశ్నిస్తూ హరనాథరావు రాసిన డైలాగ్‌లు ఆనాడు సంచలనం సృష్టించాయి. విప్లవ సంభాషణలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పీడితులు పక్షపాతిగా ఆయన రాసిన మాటలు నాటి సామాన్య ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. కేవలం అభ్యుదయ భావాలతో రూపొందిన చిత్రాలకే కాకుండా మంచిదొంగ యుద్ధభూమి రాక్షసుడు వంటి కమర్షియల్ చిత్రాలకు కూడా రచన చేశారు. అమ్మాయి కాపురం, సూత్రధారులు, స్వయంకృషి వంటి కుటుంబ కథా చిత్రాలకు రచయితగా సత్తా చాటారు. కత్తికి రెండు వైపులా పదునన్నట్లు ఇటు విప్లవాత్మక చిత్రాలు, అటు కమర్షియల్, కుటుంబ చిత్రాల మధ్య చక్కటి సమన్వయాన్ని పాటిస్తూ అసమాన ప్రతిభాశీలిగా పేరుపొందారు. రాక్షసుడు సినిమాలో చేసిన చిత్ర పాత్ర అనంతర కాలంలో నటుడిగా అవకాశాల్ని తెచ్చిపెట్టింది. దాదాపు ఇరవైకిపైగా చిత్రాల్లో నటించారాయన. ప్రతిఘటన భారతనారి ఇదా ప్రపంచం అన్న అమ్మాయికాపురం చిత్రాలకుగాను సంభాషణల రచయితగా నంది అవార్డుల్ని అందుకున్నారు.

జీవితానుభవాలే స్ఫూర్తిగా...

జీవితగమంలో తనకు ఎదురైన పరిస్థితులు, సమాజపు తీరుతెన్నులు తనను రచయితగా మారడానికి ప్రేరణ నిచ్చాయని చెబుతుండేవారు హరనాథరావు. ఆకలి, అన్నం విలువ ఏమిటో తెలుసుకాబట్టే అభాగ్యుల కష్టాలు, కన్నీళ్ల గురించి తన సినిమాల్లో సాధికారికంగా డైలాగ్‌లు రాయగలిగానని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. మధ్యతరగతి జీవితంలోని సంఘర్షణలు, వ్యక్తుల స్వభావాలే తొలిరోజుల్లో తన నాటకాలకు స్ఫూర్తినిచ్చాయని చెప్పేవారు. త్రిపురనేని గోపీచంద్, చలం, శరత్‌చంద్ర, సముద్రాల రాఘవాచార్యులు, మల్లాది రామకృష్ణశాస్త్రి, ఆత్రేయ ఆయనకు స్ఫూర్తిగా నిలిచారు.

సొంత ఊరితో విడదీయరాని అనుబంధం..

గుంటూరులో పుట్టినప్పటికీ హరనాథరావుకు ఒంగోలుతో ఎక్కువ అనుబంధం వుంది. అందుకే హైదరాబాద్‌లో ఇల్లున్నా ఒంగోలులోనే స్థిరపడ్డారు. తన సినిమా రచనలన్ని ఒంగోలులో చేసినవేవని చెప్పేవారు. తెలుగు సినీ రచనలో హరనాథరావుది ప్రత్యేకమైన ముద్ర. రెండు తరాల వారిని ఆయన సంభాషణలు ప్రభావితం చేశాయనడం అతిశయోక్తికాదు. కథల కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదని..సమాజంలోని సమస్యల్ని, మనుషుల సంక్షుభిత జీవితాల్ని గమనించగలిగే మేథస్సు వుంటే ఎన్నో వాస్తవమైన మానవీయ కథలు వస్తాయన్నదే తన సిద్ధాంతమని ఆయన చెప్పేవారు. వయసుపైబడుతున్నా ఆయన నాటక రచనను మాత్రం వీడలేదు. కొద్ది సంవత్సరాల క్రితమే రెడ్‌లైట్ ఏరియా మీ పేరేమిటి పేరుతో నాటకాల్ని రచించారు. తెలుగు సినీ రచనలో హరనాథరావుది ఓ చిరస్మరణీయమైన అధ్యాయం. నమ్మిన విలువలకు కట్టుబడి సమాజ శ్రేయస్సు కాంక్షిస్తూ సంభాషణల్ని రాశారాయన. సినిమాకు తప్పకుండా సామాజిక ప్రయోజం వుందని..సమాజాన్ని ప్రభావితం చేసే దృశ్యసాహిత్యం సినిమా అని బలంగా విశ్వసించారాయన.

2291

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles