కామెడీ బోనస్ లాంటిది!

Fri,November 22, 2019 11:58 PM

ఎఫ్-2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మహేష్‌బాబుకు ఈ కథ వినిపించాను. సింగిల్‌సిట్టింగ్‌లోనే ఆయన ఓకేచేశారు అని అన్నారు అనిల్‌రావిపూడి. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం సరిలేరునీకెవ్వరు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు అనిల్‌రావిపూడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా ముచ్చటించారు.


మహేష్‌బాబుతో సినిమా చేయాలని అనుకున్నప్పుడు కెరీర్‌లో ఇప్పటివరకు ఆయన టచ్ చేయని పాత్ర, బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆయన చేసిన సినిమాల్ని విశ్లేషిస్తే ఆర్మీ నేపథ్య కథాంశంలో ఆయన నటించలేదు. ఈ బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉంటుందనిపించింది. మేజర్ అజయ్‌కృష్ణ అనే ఆర్మీ అధికారిగా మహేష్‌బాబు కనిపిస్తారు. చాలా రోజులు జనాలకు గుర్తుండిపోయే మంచి పాత్ర ఇది. మహేష్‌బాబు పాత్రచిత్రణ, మాస్ అప్రోచ్, ఎనర్జీ లెవల్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఉంటుంది. ప్రతి సినిమాలో పాత్రలపరంగా దర్శకుడు రాసుకున్న ప్రమాణాలు, కొలతల్లో మహేష్‌బాబు సరిగ్గా ఇమిడిపోతారు. పూర్తిగా ఆయన దర్శకుల హీరో. మహేష్‌బాబు లాంటి హీరో దొరికితే పండగే. దర్శకుడిని పూర్తిగా నమ్మడమే కాకుండా తన అభినయంతో కథను, పాత్రల్ని మరోస్థాయికి తీసుకెళతారు. ఆర్మీ అధికారిగా ఆయన మాట్లాడేతీరు, స్పందించే విధానం సినిమాలో విభిన్నంగా ఉంటాయి.

45 నిమిషాలు వినగానే...

సుప్రీమ్ సినిమా సమయంలో జోధ్‌పూర్ నుంచి ట్రైన్‌లో వస్తున్నప్పుడు ఓ సైనికుడు పరిచయమయ్యారు. చాలా సెన్సాఫ్‌హ్యూమర్‌తో సరదాగా మాట్లాడాడు. సోల్జర్స్ ఎందుకిలా ఉండకూడదనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. సమాజం కోసం ఓ ఆర్మీ అధికారి ఏం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. 45 నిమిషాలు కథ వినగానే మనం ఈ సినిమా చేస్తున్నామని మహేష్ అన్నారు. హీరో క్యారెక్టరైజేషన్ ఆయనకు చాలా నచ్చింది. దర్శకులకు ముందుగానే కంఫర్ట్‌జోన్‌ను సృష్టిస్తుంటారాయన. అందుకే సూపర్‌స్టార్‌తో పనిచేస్తున్నాననే టెన్షన్ లేకుండాసినిమా మొదలుపెట్టాను. అంతర్లీనంగా కథలో చక్కటి సందేశం ఉంటుంది. పదమూడేళ్ల తర్వాత విజయశాంతి నటిస్తున్న సినిమా ఇది. ప్రొఫెసర్ భారతిగా ఆమె పాత్ర శక్తివంతంగా ఉంటుంది. మహేష్‌బాబుతో ఆమె కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాను. ప్రస్తుతం కొచ్చిన్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. మరో పదిహేను రోజుల్లో సినిమా పూర్తవుతుంది. అవుట్‌పుట్ చూసుకున్నాం. బ్లాక్‌బస్టర్ హిట్ కొడతామనే బలమైన విశ్వాసంతో ఉన్నాం. చిత్రీకరణ మొత్తం సంతోషంగా సరదాగా పూర్తయింది. నా ప్రతి సినిమాలో కామెడీ బోనస్‌గా నిలుస్తున్నది. జనాలకు నచ్చే కామెడీతో పాటు విలువలతో కూడిన మంచి సినిమా ఇది.

362

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles