పోరాడటమంటే నాకిష్టం!


Wed,December 6, 2017 11:40 PM

Sapthagiri Interview about Sapthagiri LLB Movie

హాస్యనటులు కథానాయకులుగా మారడం తెలుగు చిత్రసీమలో కొత్తేమీకాదు. అలీ, సునీల్‌తో పాటు పలువురు హాస్యనటులు హీరోలుగా అవతారమెత్తి విజయాల్ని అందుకున్నారు. వారి బాటలోనే అడుగులు వేశారు సప్తగిరి. హాస్యనటుడిగా అచిర కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న ఆయన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హీరోగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. సామాజిక ఇతివృత్తాలు,వినోదం మిళితమైన కథలను ఎంచుకుంటూ కథానాయకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారాయన. సప్తగిరి హీరోగా నటించిన తాజా చిత్రం సప్తగిరి ఎల్.ఎల్.బి. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ పతాకంపై డా॥రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చరణ్ లక్కాకుల దర్శకుడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా సప్తగిరి పాత్రికేయులతో పంచుకున్న సంగతులివి..
saptagiri

సప్తగిరి ఎల్‌ఎల్‌బీ ఎలాంటి న్యాయవాది?

-సామాన్యుడికి ప్రాతినిధ్యం వహించే ఓ న్యాయవాది కథ ఇది. తాను చేపట్టిన ప్రతి పనిలో ఓటమిని ఎదుర్కొనే అతడు ఓ ఉన్నతమైన లక్ష్యం కోసం ఎలాంటి పోరాటాన్ని సాగించాడనేది ఆసక్తిని పంచుతుంది.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

-జాలీ ఎల్‌ఎల్‌బీ అనే హిందీ సినిమా ఆధారంగా రూపొందిన చిత్రమిది. మాతృకను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించడం కాకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా వాణిజ్య విలువలు మేళవించి రూపొందించాం. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి న్యాయపరంగా సమానమైన హక్కులు ఉండాలనే లక్ష్యంతో సామాన్యుల పక్షాన పోరాడే న్యాయవాదిగా నా పాత్ర వినూత్నంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణంలో అడుగుపెట్టే లాయర్‌గా కనిపిస్తాను. నేను కనిపించే ప్రతి సన్నివేశం మనసును హత్తుకుంటుంది.

సప్తగిరి అంటే ప్రేక్షకులు వినోదాన్నే ఎక్కువగా ఆశిస్తారు..?

-భావోద్వేగాలతో పాటు నా శైలి వినోదం మిళితమైన కథ ఇది. నేను కనిపించే ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. హిందీతో పోలిస్తే కమర్షియల్ హంగులు, హీరోయిజం తెలుగులో ఎక్కువగా కనిపిస్తాయి. పాటలు,పోరాట ఘట్టాలు, డ్యాన్సులు అన్ని కథానుగుణంగానే ఉంటాయి. సినిమాలో చివరి 45 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఉత్కంఠతతో పాటు భావోద్వేగానికి లోనుచేస్తాయి.

తొలి సినిమాతో పోలిస్తే ఈ సినిమా విషయంలో ఎక్కువ ఒత్తిడికిలోనవుతున్నట్లున్నారు?

-తొలి సినిమా కోసం ఎంత ఉత్కంఠతో ఎదురుచూశానో అదే టెన్షన్ ఈ సినిమాకు ఉంది. హాస్యనటుడినైనా నేను శక్తివంతమైన కథతో ప్రేక్షకుల్ని మెప్పించడానికి చాలా కసరత్తులు చేయాల్సివచ్చింది. ఎంతో శ్రమించాను.

హాస్యనటులు హీరోలుగా రాణించలేరనే విమర్శలు ఉన్నాయి. హీరోగా మారి తప్పుచేశాననే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా?

-జీవితంలో పోరాడటమంటే నాకు చాలా ఇష్టం. హీరోగా ప్రయత్నం చేయడంలో తప్పులేదనిపించింది. సహాయదర్శకుడిగా కెరీర్‌ను మొదలుపెట్టిన నేను కాకతాళీయంగా హాస్యనటుడినయ్యాను. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోగా మారాను. హాస్యనటుడిగా చాలా సినిమాలు చేశాను. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధంలేకుండా ప్రతి సినిమాతో ప్రేక్షకుల్ని నవ్వించడానికి ప్రయత్నించాను. అయితే పదే పదే అలాంటి పాత్రలు చేయడంలో కొత్తదనమేది లేదనిపించింది. వైవిధ్యంగా అడుగులు వేయాలనే కోరిక నాలో బలంగా మొదలైంది. నా ఆలోచనలకు అనుగుణంగా నిజాయితీతో కూడిన మంచి పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో తొలి అడుగులో సక్సెస్‌అయ్యాను. ఈ సినిమాతో అదే ఫలితం దక్కుతుందని అనుకుంటున్నాను.

నిర్మాత రవికిరణ్‌తో రెండో సినిమా చేశారు? ఆ అనుభవం ఎలా ఉంది.

-డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ నేను చేసే సినిమా ఉన్నత నిర్మాణ విలువలతో కూడినదై ఉండాలని నిర్మాత రవికిరణ్ చాలా ఖర్చు పెట్టి ఈ సినిమా చేశారు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా కథకు న్యాయం చేయడానికి తపించారు. నటనపై ఉన్న మక్కువతో రవికిరణ్ ఈ సినిమాలో చిన్న పాత్రను పోషించారు

మీ పేరుతోనే వరుసగా సినిమాలు చేయడానికి కారణమేమిటి?

-సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రానికి తొలుత కాటమరాయుడు అనే పేరును ఖరారు చేశాం. సినిమా పూర్తవుతున్న తరుణంలో ఆ టైటిల్ కావాలని పవన్‌కల్యాణ్ అడగటంతో ఇచ్చేశాము. సెట్స్‌లో నేను చాలా వేగంగా పనిచేస్తుంటాను. నా బాడీలాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సప్తగిరి ఎక్స్‌ప్రెస్ పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఆ పేరు కలిసివచ్చింది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఈ చిత్రానికి సప్తగిరి ఎల్‌ఎల్‌బీ అనే టైటిల్‌ను ఖరారుచేశాం.

భవిష్యత్తులో రీమేక్ కథల్లో నటించడానికి సిద్ధమేనా?

-మంచి కథలు అనిపిస్తే రీమేక్‌లలో నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బందిలేదు. ప్రస్తుతం కొందరు దర్శకులు మంచి కథలతో నన్ను సంప్రదిస్తున్నారు.

1070

More News

VIRAL NEWS