కథలతోనే నా ప్రయాణం


Tue,June 11, 2019 11:43 PM

Sapthagiri Emotional Interview about Vajra Kavachadhara Govinda Movie

మంచి పాత్రలు లభిస్తే కామెడీ రోల్స్ చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. హీరోగా మారిన తర్వాత కమెడియన్ పాత్రలు అంగీకరించననే ఆలోచనతో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు అని అన్నారు సప్తగిరి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వజ్రకవచధర గోవింద. అరుణ్ పవార్ దర్శకుడు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సప్తగిరి పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...

వజ్రకవచధర గోవింద నేపథ్యమేమిటి? ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

-వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో గోవిందు అనే దొంగగా నేను కనిపిస్తాను. వజ్రానికి గోవిందుకు ఉన్న సంబంధం ఏమిటి? దాని వల్ల అతడికి ఎదురైన కష్టనష్టాలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. హీరోగా కాకుండా హాస్య నటుడి పంథాలో నా పాత్ర ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ మాదిరిగా ఈ సినిమా పేరుతో పాటు డబ్బును తీసుకొస్తుందనే నమ్మకం ఉంది.

దర్శకుడు అరుణ్‌పవార్‌తో రెండో సినిమా చేయడానికి కారణమేమిటి?

-సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా చేస్తున్నప్పుడు అరుణ్‌పవార్‌తో మరో సినిమా చేస్తానని మాటిచ్చాను. కథకు సరిపోయే దర్శకుడి కోసం అన్వేషిస్తున్న సమయంలో అరుణ్ అయితేనే న్యాయం చేయగలడనిపించింది. తొలి సినిమా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అతడితో ఈ సినిమా చేశాను.

వినోదాన్ని నమ్ముకునే ఈ సినిమా చేశారా?

-ఇదివరకు హీరోగా నటించిన సినిమాల్లో నేను సరిగా నవ్వించలేకపోయాననే విమర్శలు వచ్చాయి. కమర్షియల్ హంగులను నమ్మి ఆ సినిమాలు చేశాను. అందుకు భిన్నంగా ఈ సినిమాలో కథతో పాటు వినోదానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాం. ఏడేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో ఆ ప్రభావం నేను చేస్తున్న సినిమాలపై తప్పకుండా ఉంటుంది. ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశాన్ని చెప్పడానికే ప్రయత్నిస్తాను. ఇందులో క్యాన్సర్ రోగులకు సహాయం చేయాలనే సందేశాన్ని చెప్పాం.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో మీరు నటించే సినిమాల్లో అవసరమైన సలహాలు ఇస్తుంటారా?

-కథకు అవసరమైతే సలహాలు ఇస్తుంటాను. నచ్చితే దర్శకులు తీసుకుంటారు. ఒకవేళ వారు తీసుకోకపోయినా బాధపడను.

హాస్యనటులు హీరోలుగా రాణించలేరనే మాటతో మీరు ఏకీభవిస్తారా?

-ఆ మాటను నేను నమ్మను. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కథను నమ్ముకునే ప్రయాణాన్ని సాగించాలని అనుకుంటున్నాను. అదే నన్ను హీరోగా ముందుకు నడిపిస్తుందనే నమ్మకం ఉంది. కథ లేకుండా ఏ సినిమా ఆడదు. కథల విషయంలో కరెక్ట్‌గా ఉంటే ఎవరైనా విజయాల్ని అందుకోవచ్చు.

హాస్యనటుడి ఇమేజ్ హీరోగా నిలదొక్కుకోవడానికి అడ్డొస్తుందని అనుకుంటున్నారా?

-వందశాతం అడ్డొస్తుంది. తొందరలోనే దానిని అధిగమిస్తాననే నమ్మకం ఉంది.

దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?

-ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. నటనపైనే దృష్టిసారిస్తాను.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవి?

-సప్తగిరికి దయ్యం పట్టింది పేరుతో రెండు కథలను సిద్ధం చేసుకున్నాను. వాటిని తెరపై తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాను. ప్రేమకథా చిత్రమ్ తరహాలో ఇవి సాగుతాయి. సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హాస్యనటుడిగా కనిపిస్తాను.

1155

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles