ఆ రోజు చాలా భయపడ్డాను


Sun,July 16, 2017 11:13 PM

భలేమంచిరోజు చిత్రంతో తొలి అడుగులోనే ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్నారు శ్రీరామ్ ఆదిత్య. మూసధోరణికి భిన్నంగా మాస్ ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని నవ్యమైన కథాంశంతో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకొంది. మరోసారి తనకు అచ్చొచ్చిన ఫార్ములాతోనే శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన తాజా చిత్రం శమంతకమణి. నారా రోహిత్, ఆది, సందీప్‌కిషన్, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర విశేషాల్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ సంగతులివి...
sriram-aditya

శమంతకమణి సక్సెస్‌ను ఎలా ఆస్వాదిస్తున్నారు?


నా కెరీర్‌లో ఆనందకరమైన సమయమిది. సినిమాకు చక్కటి స్పందన లభిస్తున్నది. చాలా మంది ఫోన్, మెసేజ్‌లు చేస్తూ అభినందిస్తున్నారు. అవన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది.

ఈ కథకు స్ఫూర్తినిచ్చిన అంశమేది?


నా నిజజీవితంలో జరిగిన కథ ఇది. హైదరాబాద్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌కు పార్టీకి వెళ్లాను. అక్కడ నా కారు ఎవరో దొంగిలించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే హోటల్ నుంచి కారును దొంగిలించడం అనేది సాధారణ విషయం కాదనిపించింది. ఆ కారు కోసం చాలా రోజుల పాటు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగాను. ఈ క్రమంలో నాకు ఎదురైన అనుభవాలు, పోలీస్‌స్టేషన్‌లో నేను చూసిన వాతావరణం ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నాను. నేను చూసిన వ్యక్తుల నుంచే హీరోల పాత్రలను తీర్చిదిద్దాను.

నలుగురు హీరోలతో సినిమా చేయడానికి కారణమేమిటి?


ఒక కథను భిన్న దృక్కోణాల నుంచి చెప్పాలనే ఆలోచనతో నలుగురు హీరోలతో ఈ సినిమా చేశాను. కథలోని ప్రతి అంశాన్ని విడమరచి చెప్పడం నాకు అలవాటు. ఎక్కడ కట్ చెప్పాలి, సన్నివేశానికి తగినట్లుగా ఎలాంటి సౌండ్ ఉండాలి... ఇలా ప్రతి అంశాన్ని చెబుతాను. దాంతో వినేవారిలో ఎలాంటి అనుమానాలు ఉండవు. పాజిటివ్ ఆలోచనలతో హీరోలందరూ ఈ కథను విన్నారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక్క రోజులోనే సినిమా చేయడానికి అంగీకరించారు.

హీరోల్లో కొన్ని పాత్రలను నెగెటివ్ కోణంలో ముగించాలని ఎందుకు అనిపించింది?


మంచి వాళ్లకు మంచి, చెడ్డ వాళ్లకు చెడు జరుగుతుందనే సిద్ధాంతాన్ని నమ్మే ఈ సినిమాలోని పాత్రలను తీర్చిదిద్దాను. ప్రతి సినిమా చివరకు సుఖాంతంగా ముగిసిపోతుంది. అలా కాకుండా భిన్నంగా వినోదాన్ని జోడించి చూపించాను.

మీ కెరీర్‌లో తొలుత రాసుకున్న కథ ఇదేనని ఆడియో వేడుకలో చెప్పారు. కానీ తెరపై తీసుకురావడానికి ఆలస్యమైంది. ఎందుకని?


నేను ఏ దర్శకుడి వద్ద పనిచేయలేదు. లఘు చిత్రాలు తీయడం తప్ప సినిమాల్లో ఎలాంటి అనుభవం లేకపోవడంతో నాతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. చాలా మందికి కథ వినిపించాను. అందరూ బాగుందని చెప్పారు. కొందరు హీరోలు సినిమా చేయలేకపోయినా తమ మాటల ద్వారా వారు నాలో స్ఫూర్తినినింపారు.

తదుపరి సినిమాను క్రైమ్‌కామెడీ కథతోనే చేస్తారా?


రెండేళ్ల పాటు క్రైమ్‌కామెడీ కథలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నవ్యమైన కథాంశంతో సినిమా చేస్తాను. కొన్ని కథలను సిద్ధం చేసుకున్నాను. హీరో ఎవరూ, కథాంశమేమిటనేది త్వరలో వెల్లడిస్తాను.

దర్శకుడిగా ఈ సినిమా మీకు ఎలాంటి సంతృప్తిని మిగిల్చింది?


చాలా సంతోషాన్ని మిగిల్చిన చిత్రమిది. తొలి సినిమా భలేమంచిరోజు కొత్తగా ఉన్నా కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చలేదనే విమర్శలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కుటుంబ వర్గాలతో పాటు అందరూ బాగుందని చెబుతున్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉందని అంటున్నారు. ఇంతకంటే సంతోషమేది అక్కరలేదు.

దర్శకుడిగా మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం?


లార్జర్ దెన్ లైఫ్ కథాంశాలతో సినిమాలు చేయాలనుంది. ఎమోషన్స్‌తో పాటు భిన్న భావోద్వేగాలు ఉండాలి. కథ ఏదైనా కమర్షియల్ విలువలకు మాత్రం దూరంకాను.

ఈ సినిమాలో మీరు అతిథి పాత్రలో కనిపించారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి నిడివి పాత్రల్లో నటించే ఆలోచన ఉందా?


హీరోగా నటించాలనే కోరికతోనే చిత్రసీమలో అడుగుపెట్టాను. అవకాశాల కోసం ప్రయత్నించాను. కానీ కుదరకపోవడంతో ఆ ఆలోచనను పక్కనపెట్టాను. కెమెరా ముందు కంటే వెనకాల ఉంటేనే అందరిపై ఆధిపత్యం చెలాయించవచ్చు. అదే బాగుంటుంది.

చిత్రీకరణ సమయంలో ఎప్పుడైనా నలుగురు హీరోలతో సినిమా కష్టం అనే ఆలోచన కలిగిందా?


పతాక ఘట్టాలకు ముందు నారా రోహిత్, ఆది, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌తో పాటు రాజేంద్రప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చే ఓ సన్నివేశాన్ని చిత్రీకరించే రోజు భయం వేసింది. ఐదుగురు కలిసి షూటింగ్‌లో పాల్గొనడం అదే తొలిసారి. సెట్స్‌లో అడుగుపెట్టగానే ఆరు కారావ్యాన్‌లు కనిపించగానే టెన్షన్ మొదలైంది. రాజేంద్రప్రసాద్ అనుభవంతో పాటు మిగిలిన వారు సహకరించడంతో చాలా ఎంజాయ్ చేస్తూ ఆ సన్నివేశాన్ని పూర్తిచేయగలిగాను.

631

More News

VIRAL NEWS