ఓ బేబీతో ఆ కోరిక తీరింది!


Thu,June 6, 2019 11:15 PM

Samantha Oh Baby Movie Press Meet

మంచి సినిమాలు చేయాలి లేదంటే ఇంట్లో కూర్చోవాలి అని నిర్ణయించుకున్న తరువాత రంగస్థలం, మహానటి, సూపర్‌డీలక్స్, మజిలి వంటి చిత్రాలొచ్చాయి. నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి చిత్రాలు చేయాలో స్పష్టత వచ్చింది. అలాంటి సమయంలో వచ్చిన సినిమానే ఓ బేబీ అన్నారు సమంత. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ఓ బేబీ. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, సునీత తాటి, టి.జి. విశ్వప్రసాద్, హ్యున్ హ్యు థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ నేను నటిగా రిటైర్ అయ్యేలోపు పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని చేయలేకపోతానా? అనే చిన్న వెలితి వుండేది. ఓ బేబీతో ఆ కోరిక తీరినందుకు చాలా సంతోషంగా వుంది. ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు. ైక్లెమాక్స్‌లో కంటతడిపెట్టిస్తుంది.

చిన్నతనంలో ఏం సాధించాలని వుండేదని మా అమ్మని నేను ఎప్పుడూ అడగలేదు. నేను, నా సోదరుడు తప్ప అమ్మకు మరో లోకం లేదు. కానీ నేను నా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నాను. ఓ యాక్టర్ అయ్యాను. నాకు అవకాశం వచ్చింది. కానీ అమ్మలకు, అమ్మమ్మలకు అవకాశాలు రాలేదేమో. కానీ ఓ బేబీ సినిమా చూసిన తరువాత చాలా మంది ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మల్ని, అమ్మమ్మల్ని మీకు ఏం కావాలని వుండేదని తప్పకుండా అడుగుతారు. వాళ్లు చేసిన త్యాగాల్ని గుర్తుచేసుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు అని తెలిపారు. నందినిరెడ్డి మాట్లాడుతూ నేను కొరియన్ సినిమాలు చూడను. అయితే కొరియన్ చిత్రాన్ని చూడమని సమంత ఫోన్ చేసి చెప్పింది. చూసిన తరువాత లక్ష్మీభూపాల్‌తో మాట్లాడాను. ఈ కథలో మా అమ్మ, మా అమ్మమ్మతో పాటు మా ఇంట్లో వుండే వాళ్లంతా కనిపించారు. భాష వేరైనా ఇదొక యూనివర్సల్ స్టోరీ. దీన్ని తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాను. స్క్రిప్ట్‌లో ఏం మార్చాలి? ఏం మార్చకూడదో వాటినే మార్చాం. ఈ సినిమాని ఓ బాధ్యతగా చేశాం. ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఒరిజినల్ సినిమాపై వున్న గౌరవంతో చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమాకు మంచి టీమ్ కుదిరింది. సమంతకు ఇంత వరకు చేసిన సినిమాలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైన చిత్రమిది అన్నారు. ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, శ్రీతేజ్, లక్ష్మీభూపాల్, సునీత తాటి తదితరులు పాల్గొన్నారు.

1634

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles