సమంత హృదయాల్ని గెలిచింది


Wed,September 19, 2018 02:28 AM

Samantha is epitome of modern woman MP Kavitha

స్టార్స్, ఫైట్స్, చంపుకోవడం, నరుక్కోవడమే కాదు మంచి కథల కలబోతగా సినిమాలు ఉండాలని నేను నమ్ముతాను. ప్రస్తుతం భిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాల సంఖ్య పెరిగింది. యూటర్న్ ఆ తరహా ప్రయత్నమే. ఈ సినిమా మరింత పెద్ద విజయం సాధించాలి అని అన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యూటర్న్. పవన్‌కుమార్ దర్శకుడు. శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కవిత మాట్లాడుతూ ప్రేక్షకుల్లో భయాన్ని రేకెత్తిస్తూ సామాజిక సందేశాన్ని అందించడం సులభం కాదు. ఈ సినిమాలో నిజంగా ప్రజల్ని యూటర్న్ తీసుకోవడానికి భయపడేలా చేశారు.

సమాజంలోని చాలా మంది నియమనిబంధనల్ని పాటించరు. అలాంటి వారికి కనువిప్పు కలిగించే సినిమా ఇది. రోడ్డు భద్రత, హెల్మెట్ వాడకం లాంటి నియమాల్ని జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రేక్షకుల మనసుల్లో బలంగా నాటుకుపోయేలా అర్థవంతంగా సినిమాలో చూపించారు. సందేశాన్ని సున్నితంగా చెప్పడం కాకుండా వారిలో భయాన్ని కలిగించేలా చెప్పిన తీరు బాగుంది. నేను ఈ సినిమా చూడలేదు. నా పిల్లలు ఈ సినిమా గురించి నాకు మంచి విశ్లేషణ అందించారు. సంగీతం బాగుంది.

ఆధునిక మహిళలకు ప్రతీకగా నిలుస్తుంది సమంత. ప్రయోగాలు, భిన్నమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ భయపడదు. రంగస్థలంతో పోలిస్తే ఈ సినిమాలో పూర్తి భిన్నంగా కనిపించింది సమంత. పాత్రల పరంగా తను చూపించే వైవిధ్యత అనన్యసామాన్యం. నటిగా ప్రతిభను చాటుతూనే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహాయసహకారాలు అందిస్తున్నది. అలాగే తెలంగాణ హ్యాండ్లూమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నది. ఈ సినిమా ద్వారా నాతో పాటు చాలా మంది హృదయాల్ని గెలుచుకుంది సమంత. భవిష్యత్తులో ఆమె మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలి. రాహుల్ రవీంద్రన్ మంచి నటుడు. గతంలో ఆయన నటించిన ఓ సినిమా చూశాను. చాలా బాగుంది. దర్శకుడు పవన్‌కుమార్ తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలి. సమంత సినిమాతో పాటు ఒకే సమయంలో నాగచైతన్య నటించిన సినిమా విడుదలైంది. ఇద్దరి సినిమాలు విజయవంతం కావడం ఆనందంగా ఉంది. ఇంట్లోనే కాదు సినీ పరిశ్రమలో వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం బాగుంది అని తెలిపింది.

కవిత నాకు స్ఫూర్తి : సమంత

సమంత మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాల పరంగా ఎంపీ కవిత నాకు స్ఫూర్తి. ఆమె శక్తివంతమైన ప్రసంగాలంటే చాలా ఇష్టం. కవితగారు ఈ విజయోత్సవ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ సినిమా, యూనివర్సల్ కథ కాకపోవడంతో ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని తొలుత చాలా భయపడ్డాను. కానీ నా పాత్రకు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటి కంటే నా నటన బాగుందని మెచ్చుకుంటున్నారు. తొలి ప్రయత్నంగా కమర్షియల్ సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ కథను నమ్మి నిర్మాతలు శ్రీనివాస్, రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మించడం అభినందనీయం. అత్యంత సహజంగా, ప్రయోజనాత్మకంగా ప్రతి పాత్రను దర్శకుడు పవన్ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు. నటిగా ఇదే ముగింపు కాదు. ప్రతి సినిమాలో మరింత పరిణితి సాధించడానికే ప్రయత్నిస్తాను. పరిపూర్ణ నటిగా నిరూపించుకోవడానికి శ్రమిస్తాను.

కెరీర్‌లో మళ్లీ ఎప్పుడూ రాంగ్ టర్న్ తీసుకోను. సామాజిక సందేశం మిళితమైన సినిమా ఇదని మేము ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇందులోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సందేశంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 650 థియేటర్లలో సినిమాను విడుదలచేశామని, అన్ని చోట్ల సినిమాకు చక్కటి స్పందన లభిస్తున్నదని, మూసధోరణికి భిన్నంగా సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పవన్‌కుమార్, పూర్ణచంద్రతేజస్వి తదితరులు పాల్గొన్నారు.

4336

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles