ప్రతి శుక్రవారం ఆ ఛాన్స్ వస్తుంది!

Thu,April 11, 2019 12:01 AM

గత చిత్రాలు అందించిన ఫలితాల తరువాత ఏ కథ విన్నా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయడం మొదలుపెట్టాను. నాకు ఒక కథ వంద శాతం సంతృప్తిని కలిగిస్తేనే ఓకే చెబుతున్నాను. ఇకపై కూడా ఇలాగే వుండాలనుకుంటున్నాను అన్నారు సాయితేజ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి. కిషోర్ తిరుమల దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో హీరో సాయితేజ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

పేరు మార్చుకున్నట్టున్నారు. ఏదైనా న్యూమరాలజీ ఫాలో అవుతున్నారా?

అదేం లేదండీ. ఈ సినిమా నుంచి కూల్‌గా ప్రశాంతంగా వుండాలనుకున్నాను. పైగా చిత్రలహరి మంచి కథ అందుకే ఈ సినిమా నుంచి నా పేరుతో వున్న ధరమ్‌ను పక్కన పెట్టి సాయితేజ్‌గా మార్చుకున్నాను.

సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది?

విజయ్‌కృష్ణ తన జీవితంలో ఎప్పుడూ సక్సెస్‌ని చూడని వ్యక్తి. సక్సెస్ అంటే ఏంటో కూడా అతనికి తెలియదు. అలాంటి ఓ వ్యక్తి ప్రయాణమే ఈ చిత్ర కథ. తన ప్రయాణంలో అపజయాల్ని అధిగమించి విజయ్‌కృష్ణ చివరికి సక్సెస్‌ని సాధించాడా? లేదా? అన్నది తెరపైన చూడాల్సిందే.

గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారా?

కొన్ని ఫెయిల్ అవ్వొచ్చు, కొన్ని సక్సెస్ సాధించొచ్చు. అయితే ఫలితం ఎలా వున్నా పూర్తి బాధ్యతను మాత్రం నాపైనే వేసుకుంటాను. ఫ్లాప్ అయితే అది నేను చేసిన తప్పుగానే భావిస్తానే కానీ దాన్ని మరొకరిపై నెట్టేసే ప్రయత్నం చేయను.

దర్శకుడిగా కిషోర్ తిరుమలకు, హీరోగా మీకు హిట్ లేదు. ఈ సినిమా విషయంలో ఏమైనా వొత్తిడికి గురవుతున్నారా?

కథలో విషయం వుంటే సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది. ఫెయిల్యూర్‌తోనే ఆగిపోతారు అనే నమ్మకం నాకు ఎప్పుడూ లేదు. ప్రతీ నటుడికి తనని తాను నిరూపించుకోవడం కోసం ప్రతి శుక్రవారం ఒక ఛాన్స్ వస్తుంటుందని బలంగా నమ్ముతాను.

ఫ్లాప్‌ల వల్ల కథల ఎంపిక విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయా?

నేను నటించిన ఆరు చిత్రాలు వరుసగా పరాజయాన్ని చవిచూశాయి. అయితే ఫలితాల తరువాత ఏ కథ విన్నా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయడం మొదలుపెట్టాను. నన్ను ఒక కథ వంద శాతం సంతృప్తిని కలిగిస్తేనే ఓకే చెబుతున్నాను. ఇకపై కూడా ఇలాగే వుండా లనుకుంటున్నాను.

మొహమాటం కోసమే కొన్ని చిత్రాలు చేశారా?

మొహమాటం అని కాదు కానీ కమిట్ అయ్యాను కాబట్టి చేశాను. నేను ఎవరికైనా మాటిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గను. నా కుటుంబం నన్ను అలా పెంచింది. మాటిస్తే అది ఎలా వున్నా దాని కోసం నిలబడతాను.

దర్శకుడు కిషోర్ తిరుమల చిత్రలహరి కథ వినిపించినప్పుడు ఎలా అనిపించింది?

ప్రధాన పాత్రల గురించి వివరిస్తూ కిషోర్ దీన్ని ఓ కథలా విను అని చెప్పాడు. చిత్రలహరి టైటిల్‌ని కూడా నాకు ముందు నుంచే చెప్పాడు. ఓ ఐదు పాత్రలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అనే పాయింట్‌తో కథ వినిపించాడు. అప్పట్లో చిత్రలహరి అనే కార్యక్రమం ప్రతి శుక్రవారం చాలా మంది ఎదురుచూసేలా చేసింది. మా సినిమాలోనూ అంతే.

కెరీర్‌లో ఫెయిల్ అయిన వాళ్లంతా చిత్రలహరిని తమ బయోపిక్‌గా భావిస్తున్నారు?

ఆ మాటలు నేనూ విన్నాను. ట్విట్టర్‌లో నన్ను ఫాలోఅయ్యే చాలా మంది ఇది నా బయోపిక్‌లా వుందని అంటున్నారు. చిత్రలహరి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఓ ఫేజ్. చాలా మంది ఏ అంశానికి కనెక్ట్ అయ్యారో నాకు అర్థం కాలేదు.

సినిమాలో ప్లేట్ సక్సెస్ కావాలని ఓ డైలాగ్ వుంది. మీకు ఈ సినిమా ఎన్నిప్లేట్‌ల సక్సెస్‌ని అందిస్తుంది?

ప్లేట్ కాదు కానీ ఫుల్ మీల్స్‌లాంటి సక్సెస్ లభిస్తే చాలు. ఈ సినిమా విషయంలో కొరటాల శివ సహకారం చాలా వుంది. తప్పకుండా సినిమా సక్సెస్ సాధిస్తుందని కొరటాల శివ బలంగా నమ్మారు. అదే విషయాన్ని మాకు చెప్పారు. నిర్మాణ సంస్థ దగ్గరి నుంచి దర్శకుడు, నటీనటుల వరకు మా టీమ్ అంతా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాం. అయితే వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరికి తెలియకుండానే చిన్న భయం ఏర్పడింది. ఆ భయాన్ని కొరటాల శివ పోగొట్టే ప్రయత్నం చేశారు.

యుఎస్ ట్రిప్‌కు ఎందుకు వెళ్లారు?

నేను హేయిర్ సర్జరీ కోసమో లేక లైపో సెక్షన్ కోసమో యుఎస్ వెళ్లానని చాలా మంది అనుకున్నారు. అయితే విన్నర్ సినిమా సమయంలో గుర్రపు స్వారీ వల్ల నాకు చాలా దెబ్బలు తగిలాయి. అప్పట్లో నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తేజ్ ఐ లవ్‌యు సినిమా సమయంలో ఆ గాయాలు బాధించాయి. దాంతో ఫిజియో థెరపి కోసం యుఎస్ వెళ్లాల్సి వచ్చింది.

2899

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles