టైమ్‌పాస్ సినిమా కాదు!


Wed,July 11, 2018 11:42 PM

RX 100 Movie Hero Kartikeya Gummakonda Exclusive Interview

సాధారణంగా తెలుగు చిత్రసీమలో ప్రేమకథలనగానే కాలేజీ బ్యాక్‌డ్రాప్, కాఫీషాప్‌లోనే మొదలవుతున్నట్లుగా చూపిస్తుంటారు. మా సినిమా అందుకు భిన్నంగా ఉంటుంది. ప్రేమలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యల్ని సహజత్వంగా ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రమిది అని అన్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆర్‌ఎక్స్ 100 అజయ్‌భూపతి దర్శకుడు. అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో కార్తికేయ పాత్రికేయులతో ముచ్చటించారు.

ఓ చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. పరిస్థితుల కారణంగా ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకున్న మార్పులేమిటి? అమాయకుడైన అతను అహంభావిగా మారడానికి దారితీసిన పరిస్థితులేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అర్జున్‌రెడ్డి సినిమాలో విజయ్‌దేవరకొండ పాత్రకు ఇందులో నా క్యారెక్టర్‌కు ఎలాంటి పోలికలు ఉండవు. రెండు ప్రేమకథలే కానీ కథ, కథనాల్ని నడిపించే విధానం వేరుగా ఉంటుంది. ప్రస్తుతం పాత్ర చిత్రణల పరంగా తెలుగులో ప్రయోగాలు చేస్తున్నారు. మూస సినిమాల తాలూకు హద్దులన్నీ చెరిపివేస్తూ చేసిన సినిమా ఇది. రెండు గంటలు టైమ్‌పాస్ కావాలని కోరుకునేవారికి ఈ సినిమా నచ్చదు.

విజయ్‌దేవరకొండ చేయాల్సింది

ప్రతి ఏడాది చాలా మంది కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. పోటీని తట్టుకొని నెగ్గుకురావాలంటే ఎవరూ చేయని కథలు, పాత్రలు ఎంచుకున్నప్పుడే మనకంటూ ఓ ప్రత్యేకత వస్తుంది. అలా ఆలోచించి చేసిన సినిమా ఇది. దర్శకుడు అజయ్‌భూపతి తొలుత విజయ్‌దేవరకొండతో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. పెళ్లిచూపులు చిత్రానికి ముందు ఈ కథను ఆయనకు వినిపించారు. కానీ ఆ తర్వాత విజయ్‌దేవరకొండకు స్టార్‌డమ్ రావడంతో ఇమేజ్ లేని నటుడు అయితేనే బాగుంటుందని నన్ను సంప్రదించారు.

సినిమా నేపథ్యం లేదు

హైదరాబాద్ నా స్వస్థలం. వనస్థలిపురంలో చదువుకున్నాను. సినీ నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చాను. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నటనపై ఆసక్తి మొదలైంది. అప్పట్లో కొన్ని లఘు చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత ప్రేమతో మీ కార్తిక్ సినిమా చేశాను. అది పెద్దగా ఆడలేదు. ఆర్‌ఎక్స్ 100 నటుడిగా నాకంటూ మంచి గుర్తింపును తీసుకొస్తుందనే నమ్మకముంది.

3563

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles