రఘుపతి రాఘవ రాజారాం?


Wed,March 20, 2019 12:17 AM

RRR Movie title Raghupati Raghava Rajaram

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్ (వర్కింగ్ టైటిల్) దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇటీవలే ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రాజమౌళి సినిమాకు సంబంధించిన పలు విశేషాల్ని వెల్లడించిన విషయం తెలిసిందే. తొలితరం స్వాత్రంత్య సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు జీవితానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని తీసుకొని కాల్పనిక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ప్రెస్‌మీట్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ గురించి రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ అన్ని భాషల్లో ఉమ్మడి వర్కింగ్ టైటిల్‌గా ఉంటుందని, ఒక్కోభాషలో ఆర్‌ఆర్‌ఆర్ సంక్షిప్త నామానికి పూర్తి అర్థం స్ఫురించేలా టైటిల్‌ను ఎంపిక చేస్తామని చెప్పారు. టైటిల్‌ను నిర్ణయించే బాధ్యత ప్రేక్షకులకే వదిలేస్తున్నట్లు ఆయన అన్నారు. వారు సూచించిన వాటిలో ఉత్తమమైన టైటిల్‌ను సినిమా కోసం ఎంపిక చేసుకుంటామని రాజమౌళి చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి తెలుగులో రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ అంశం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్.ఆర్.ఆర్ సంక్షిప్త నామానికి రఘపతి రాఘవ రాజారాం అనే టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా టైటిల్ విషయంలో దర్శకుడు రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోఅని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 జూలై 30న ప్రేక్షకులముందుకురానుంది. అలియాభట్, డైసీ ఎడ్గార్ జోన్స్, అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 400కోట్ల వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

2892

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles