తెలంగాణ నిర్మాతల్ని అవమానిస్తున్నారు


Mon,June 17, 2019 11:41 PM

RK Goud warning to C Kalyan and Prasanna Kumar

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో తెలంగాణ వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు ప్రతాని రామకృష్ణగౌడ్‌. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారితో పోలిస్తే నిజాయితీగా పనిచేసిన తెలంగాణ నిర్మాతలకు అవకాశాలు ఇవ్వకుండా అవమానిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించకుండా సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుంది. దీని వల్ల కౌన్సిల్‌ డబ్బును, కాలాన్ని ఆదా చేయవచ్చు. ఎన్నికల బరిలో నిలిచిన ప్యానల్‌లు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవాలని కోరుతున్నాను. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ గౌరవంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న రోజుల్లో దిల్‌రాజు, అల్లు అరవింద్‌ లాంటి కొందరు అగ్ర నిర్మాతలు ఎల్‌.ఎల్‌.పి పేరుతో ప్రత్యేకమైన గిల్డ్‌ను ఏర్పాటుచేసుకున్నారు.

దీని వల్ల కౌన్సిల్‌కు వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఎల్‌.ఎల్‌.పి గిల్డ్‌ను ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో విలీనం చేస్తే బాగుంటుంది. మన ప్యానెల్‌ పేరుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న సి. కల్యాణ్‌, ప్రసన్నకుమార్‌లు గెలిచిన తర్వాత రాజీనామా చేసి గిల్డ్‌కు బాధ్యతల్ని అప్పగిస్తామని చెప్పారు.

అలా కాకుండా ఎన్నికలే లేకుండా ముందుగానే నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని కోరుతున్నాను. వెల్ఫేర్‌ ప్యానల్‌ పేరుతో మేము ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నాం. నాతో పాటు మా ప్యానెల్‌ మొత్తం నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎల్‌.ఎల్‌.పి గిల్డ్‌ సభ్యులు 70, మిగతా వారు ముప్పై శాతం ఉండేలా ఏక్రగీవంగా కౌన్సిల్‌ సభ్యులను ఎన్నుకొని కలిసిమెలసి పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది. ఎన్నికలు వద్దన్నది చాలా మంది నిర్మాతల అభిప్రాయం. అందుకే కల్యాణ్‌ ప్యానెల్‌ తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవాలి’ అని అన్నారు. కౌన్సిల్‌లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ప్రసన్నకుమార్‌ ఓటు వేయడానికి అనర్హుడని చెప్పిన కల్యాణ్‌ తన ప్యానెల్‌నుంచి అతడిని సెక్రటరీగా పోటీ చేయిస్తున్నారని, తెలంగాణ వారికి ఒక్కరికి ప్యానల్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని శంకర్‌గౌడ్‌ ఆరోపించారు. కుర్చీలు, పదవుల గురించే తప్ప చిన్న నిర్మాతల కష్టాల్ని కల్యాణ్‌, ప్రసన్నకుమార్‌ ఏ రోజు పట్టించుకోలేదని రమణారెడ్డి పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల బరిలో నిలిపి కౌన్సిల్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సాయివెంకట్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్‌, జీవీఆర్‌, వింజమూరి మధు, ఈశ్వర్‌, నరేష్‌కుమార్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

1540

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles