సెలబ్రిటీలు అన్నీ భరించాలా?

Tue,March 12, 2019 11:54 PM

సోషల్‌మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై మండిపడింది సీనియర్ కథానాయిక రేణూదేశాయ్. సెలబ్రిటీలకు భావోద్వేగాలు ఉండవా? వాళ్లు మామూలు మనుషులు కాదా? అంటూ ప్రశ్నించింది. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి ఇటీవల రేణూదేశాయ్ ఓ ఛానల్‌తో కలిసి కొన్ని గ్రామాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలో ఆమెపై కొందరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను 20ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. రైతుల కోసం మీలాంటి వాళ్లు ఏం చేశారు? డబ్బుల కోసం కెమెరాల ముందు డ్రామా చేశారంతే అంటూ ఓ నెటిజన్ అసభ్యకరమైన భాషలో వ్యాఖ్యానించాడు. సదరు వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రేణూదేశాయ్. ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా అలాంటి అభ్యంతరకరమైన పదం తన అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు.

అది ఒక బ్రేకింగ్ న్యూస్‌లా మారుతుంది. నిర్దయగా, చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తూ దూషిస్తారు. కానీ అదే పదం ఒక మామూలు మనిషి సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో స్పందించకూడదు. ఒక సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు దూషించవొచ్చు. అవన్నీ ఆ సెలబ్రిటీ భరించాలి. సహించాలి. ఎలాంటి భావోద్వేగానికి గురికావొద్దు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు ఉండకూడదు. సోషల్‌మీడియాలో రోజూ ఎవరో ఒకరు మిమ్మల్ని దూషిస్తూ పోస్ట్‌లు పెడుతుంటే మీకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. రైతులకు ఏదో రకంగా సహాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం దారుణం. అనవసరంగా సెలబ్రిటీలను దూషించకుండా మంచి పనులపై దృష్టిపెడితే బాగుంటుంది అని రేణూదేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

1142

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles