విలన్‌గా నటించాలనుంది

Mon,October 7, 2019 12:29 AM

మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందిన ఈ సినిమాను చేయాలా? వొద్దా? అ ని తొలుత సంశయించాను. కానీ కథతో పాటు నా పాత్రకున్న ప్రాముఖ్యత నచ్చి అంగీకరించాను. నటుడిగా ఈ సినిమా నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు తేజస్ కంచెర్ల. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ఆర్‌డీఎక్స్ లవ్. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించారు. శంకర్‌భాను దర్శకుడు. పాయల్ రాజ్‌పుత్ కథానాయిక. ఈ నెల 11న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో తేజస్ కంచెర్ల మాట్లాడుతూ సిద్ధు అనే లవర్‌బాయ్‌గా సినిమాలో కనిపిస్తాను. నా నిజజీవితానికి పూర్తి భిన్నంగా పాత్ర ఉంటుంది. హీరోలా కాకుండా కథను నడిపించే కీలకమైన పాత్రనాది. బాధ్యతలు లేకుండా సరదాగా సాగిపోతున్న అతడి జీవితంలోకి ఓ అమ్మాయి ఎలా ప్రవేశించింది? ఆమె లక్ష్యసాధనలో ఆ యువకుడు ఎలాంటి తోడ్పాటునందించాడన్నది ఆకట్టుకుంటుంది.


పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమిది.పాయల్‌తో నా కెమిస్ట్రీ బాగుంటుంది.అశ్లీలత లేకుండా దర్శకుడు పాటల్ని, ప్రేమ సన్నివేశాల్ని అందంగా తెరకెక్కించారు. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లు అవుతోంది. తొలుత నీకు నాకు డాష్‌డాష్ చిత్రానికి తేజ వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాను. హుషారు హీరోగా మంచి విజయాన్ని అందించింది. సినిమాలు తప్ప నాకు మరో వ్యాపకం లేదు.సంపాదించినదంతా సినిమాల్లో పెట్టాలని నిర్ణయించుకున్నాను. నిర్మాతగా మారే ఆలోచన ఉంది. అవకాశం వస్తే విలన్‌గా నటించాలనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను అని చెప్పారు.

1086

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles