నావన్నీ క్లాస్ వర్క్‌లే..!


Thu,November 15, 2018 02:53 AM

Ravi Teja Exclusive Interview about Amar Akbar Anthony Movie

హిట్ ఇచ్చినవాడు బ్లాక్ బస్టర్ ఇవ్వొచ్చు. బ్లాక్ బస్టర్ ఇచ్చిన వాడు డిజాస్టర్ ఇవ్వొచ్చు. మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే మన పని. అందులో కొన్ని జనాలకు నచ్చుతాయి. కొన్ని నచ్చవు. అందుకే జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం నా దృష్టిలో వృధాప్రయాస అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో హీరో రవితేజ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

కెరీర్‌లో తొలిసారి మూడు భిన్న పార్శాలున్న పాత్రలో నటించడం నటుడిగా ఎలాంటి అనుభూతిని కలిగించింది?

-రెండు పార్శాల్లో సాగే పాత్రను చేయడమే కష్టం. అలాంటిది మూడు భిన్నమైన పార్శాల్లో సాగే పాత్రని ఒకే సినిమాలో చేసి మెప్పించడం అనేది నటుడిగా ఓ ఛాలెంజ్‌గా భావించాను.

అమర్ అక్బర్ ఆంటోని ఈ మూడు పాత్రల్లో ఏ పాత్ర అంటే మీకు ఎక్కువ ఇష్టం?

-నాకు వ్యక్తిగతంగా అమర్ అంటే చాలా ఇష్టం. ఈ పాత్ర భావోద్వేగాల నేపథ్యంలో సాగుతుంది. అక్బర్ ఆంటోని పాత్రల ద్వారా సినిమాకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. అమర్ పాత్ర మాత్రం మంచి ఎమోషన్‌తో సాగుతుంది. అందుకే ఈ పాత్రను ఎక్కువగా ఇష్టపడ్డాను.

మూడు విభిన్నమైన పాత్రల్లో నటించడానికి హోమ్‌వర్క్ ఏమైనా చేశారా?

-(నవ్వుతూ) నావన్నీ క్లాస్ వర్క్‌లే.. హోమ్ వర్క్ చేసిన సినిమా అంటూ ఏదీ లేదు. గతంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనికి మా చిత్రానికి ఎలాంటి పోలిక వుండదు. టైటిల్‌ని మాత్రమే తీసుకున్నాం.

శ్రీను వైట్ల సినిమాల్లో వుండే కామెడీని ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

-శ్రీను వైట్ల కూడా అదే ఫీలయ్యాడు. అందుకేచాలా జాగ్రత్తలు తీసుకుని మారిన ట్రెండుకు అనుగుణంగా ఈ జనరేషన్‌కు ఏం కావాలో దాన్నే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.

శ్రీను వైట్ల కథ చెప్పినప్పుడు మార్పులు ఏమైనా చెప్పారా?

-శ్రీను వైట్ల కథ చెప్పినప్పుడు స్క్రిప్ట్ట్ విషయంలో నాకు కొన్ని అనుమానాలున్నాయని, వాటిని నివృత్తిచేయాలని చెప్పాను. దానికి అనుగుణంగా కథలో నేను చెప్పిన మార్పులు చేశాడు. ప్రతి కథలోనూ చిన్న చిన్న లోపాలు ఖచ్చితంగా వుంటాయి. వాటన్నింటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటుంటాం. అలాగే ఈ కథలోనూ నాకు అనిపించిన కొన్ని లోపాల్ని చెప్పాను. గత సినిమాల విషయంలో శ్రీను వైట్ల చేసిన తప్పు ఈ సినిమా విషయంలో జరగదని నా గట్టి నమ్మకం.

శ్రీను వైట్ల మిమ్మల్ని నా ట్రబుల్ షూటర్ అనడానికి కారణం?

-ప్రీరిలీజ్ వేడుకలో శ్రీను వైట్ల ఆవేశంగా మాట్లాడాడో, ఉద్వేగానికి లోనయ్యాడో తెలియదు కానీ అది కాంప్లిమెంట్‌గానే భావిస్తున్నాను. ఫ్లాప్ వచ్చిందికదా అని బాధపడటం, హిట్ వచ్చిందని సంబరపడిపోవడం లాంటివి నాకు నచ్చదు. హిట్ ఇచ్చిన వాడు బ్లాక్ బస్టర్ ఇవ్వొచ్చు. బ్లాక్ బస్టర్ ఇచ్చిన వాడు డిజాస్టర్ ఇవ్వొచ్చు. మనకు నచ్చింది చేస్తుంటాం. అందులో కొన్ని జనాలకు నచ్చుతాయి. కొన్ని నచ్చవు. అందుకే జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం నా దృష్టిలో వృధాప్రయాస. తదుపరి సినిమా ఏంటీ అనే దాని గురించే ఆలోచిస్తానే కానీ పోయిన దాని గురించి పట్టించుకోను.

మీలోని పూర్తిస్థాయి నటున్ని ఆవిష్కరించే కథలు మీ దగ్గరికి రాలేదని ఎప్పుడైనా ఫీలయ్యారా?


-అలా నేనెప్పుడూ ఫీలవలేదు. నేను ఓ ప్రవాహం లాంటి వాడిని. అలా వెళ్లిపోతుంటాను అంతే. నాకు ఇలాంటి కథ రాలేదని, ఇలాంటి పాత్ర చేయలేదనే కైంప్లెంట్స్ ఏమీ లేవు.

హీరోగా ఇంకా ఎంత కాలం కొనసాగుతాను అనుకుంటున్నారు?

-ఇంత కాలమే హీరోగా కొనసాగుతానని ఎలా చెబుతాను?. ఆ విషయంలో నాకు ఎలాంటి ఆలోచన లేదు.


మాధవన్, అరవిందస్వామి తరహాలో మిమ్మల్ని ప్రతినాయకుడి పాత్రలో ఎప్పుడు చూడొచ్చు?

-నన్ను అలాంటి పాత్రల్లో చూడాలంటే కొంత సమయం పడుతుంది. విలన్ పాత్రల్లో నటించకూడదు అనే ఆలోచన మాత్రం నాకు లేదు. భవిష్యత్తులో అన్ని రకాల పాత్రల్లో నటించాలని వుంది.

రవితేజ అంటే మాస్ మసాల సినిమాలేనా? ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనే ఆలోచన చేస్తున్నారా?

-ఇమేజ్ చట్రం నుంచి బయటపడాలని నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, నేనింతే, ఈ అబ్బాయి చాలా మంచోడు వంటి విభిన్నమైన చిత్రాలు చేశాను. కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంచి కథ కుదిరితే తప్పకుండా కొత్త తరహా సినిమాలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.

మీటూ ఉద్యమ ప్రభావం ఎలా వుంది?

-మీటూ ఉద్యమం కారణంగానే అంతా సెట్టయ్యారు. సెట్ కావాలి తప్పదు. దీని వల్ల చాలా మందిలో భయం మొదలైంది. ప్రస్తుతం సినీ పరిశ్రమ చాలా ప్రశాంతంగా వుంది. ఎప్పుడూ ఇలాగే వుండాలి.

తేరి రీమేక్ చేస్తున్నారని తెలిసింది?

-తేరిరీమేక్ చేయడం లేదు. సంతోష్ శ్రీనివాస్ దాని స్థానంలో కొత్త కథ వినిపించాడు. అదే చేయబోతున్నాం.

పిరియడిక్ డ్రామాలో నటించే అవకాశం వుందా?

(నవ్వుతూ) అలాంటి కథ నాకు సూటవుతుందా?. నాకు నచ్చితే అది ఏకథ అయినా తప్పకుండా చేస్తాను.

మీరు చేసిన సినిమా బాగా లేకపోతే ఆ విషయాన్ని ముందుగా మీకు చెప్పేవాళ్లు ఎవరు?

-నా గురించి తెలిసిన వాళ్లంతా ఓపెన్‌గా చెప్పేస్తారు. ఎందుకంటే నేనూ అలాగే వుంటాను కాబట్టి. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా వుంటాను. ఎవరిదాకో ఎందుకు నా సినిమా నచ్చకపోతే ముందు నా కొడుకే చెప్పేస్తాడు.

2864

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles