వాస్తవికతే విజయమంత్రం


Tue,May 15, 2018 11:18 PM

Rangasthalam and Bharat Ane Nenu and Mahanati are biggest hits of 2018


సమకాలీన తెలుగు సినిమా ముఖచిత్రం మారుతున్నది. సహజత్వం మేళవించిన కథాంశాలు, మానవీయ విలువలు ప్రోది చేసిన ఇతివృత్తాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. వాస్తవికతకు దూరంగా సాగే కథలను నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నారు. కథల్ని, పాత్రల తీరుతెన్నులను తెరపై ఆవిష్కరించే విధానంలో దర్శకనిర్మాతలు సృజనాత్మకతకు, ప్రామాణికతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ ఆలోచనధోరణి తెలుగు చిత్రసీమకు శుభపరిణామని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Ramcharan
రంగస్థలం భరత్ అనే నేను మహానటి విజయాలు తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడికి నాంది పలికాయి. కమర్షియల్ హంగులకంటే కథాంశాల్లోని నవ్యతకు, సామాజికాంశాలకు , కథావిష్కరణలోని సృజనాత్మకతకు ప్రేక్షకులు పెద్దపీట వేశారు. కథను నమ్మి నిజాయితీగా సినిమాలు చేస్తే విజయాల్ని అందుకోవచ్చని నిరూపించాయి. ఆర్థికంగా, హార్థికంగా ప్రేక్షకులు ఈ వేసవిలో విడుదలైన ఈ చిత్రాలకు గొప్ప విజయాల్ని కట్టబెట్టారు.

మహానటికి నిజమైన నివాళి..

అలనాటి మేటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. తెలుగులో రూపొందిన తొలి బయోపిక్ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడంతో పాటు కమర్షియల్‌గా చక్కటి వసూళ్లను రాబడుతున్నది. రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావుతో పాటు పలువురు దిగ్గజ దర్శకులు సైతం అంకితభావంతో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ప్రయత్నానికి ముగ్ధులవుతున్నారు. ముఖ్యంగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. కేవలం పది సినిమాలు చేసిన అనుభవం మాత్రమే ఉండటం, ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న ఆమె సావిత్రి పాత్రకు ఎంత మేరకు న్యాయం చేయగలుగుతుంది? అనే అనుమానాలు తొలుత వ్యక్తమయ్యాయి. కానీ తన నటనాకౌశలంతో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ప్రాణప్రతిష్ట చేసింది. సాధారణంగా బయోపిక్‌లు డాక్యుమెంటరీ తరహాలో సాగుతూ ఆర్ట్ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తాయి. కానీ కాల్పనిక అంశాలు, కమర్షియల్ హంగులకు తావులేకుండా స్వచ్ఛమైన జీవితకథను చూపించి తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు దర్శకుడు నాగ్ అశ్విన్. అందరికి తెలిసిన కథ అయినప్పటికీ చక్కటి పరిశోధనతో, వివాదాలకు తావులేకుండా, అలనాటి మహానటికి ఘన నివాళిగా చిత్రాన్ని తీర్చిదిద్దాలనే దర్శకుడి సంకల్పానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. నిజాయితీగా, ఓ మహాయజ్ఞంగా సినిమా నిర్మాణానికి పూనుకుంటే అనితరసాధ్యమైన విజయాల్ని అందుకోవచ్చని మహానటి చిత్రం నిరూపించింది. తెలుగు రాష్ర్టాలతో పాటు విదేశాల్లో ఈ సినిమా అద్భుత వసూళ్లతో దూసుకుపోతున్నది.

గ్రామీణ సొగసుల రంగస్థలం

పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంతో తెలుగు సినిమా వచ్చి చాలా కాలమయింది. రంగస్థలంతో ఆ లోటును తీర్చారు దర్శకుడు సుకుమార్. 1980 దశకాన్ని కళ్లకు కడుతూ ప్రేక్షకుల్ని ఆనాటి కాలంలోకి తీసుకెళ్లిపోయాడు. అప్పటి పల్లె జీవన సౌందర్యం, కల్మషం లేని మనుషులు, అదే సమయంలో పీడనకు ప్రతీకలా భూస్వామ్య దోపిడి వ్యవస్థను సమాంతరంగా వెండితెరపై ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఇమేజ్ పట్టింపులను పక్కనపెట్టి చెవిటివాడైన పల్లెటూరి యువకుడి పాత్రలో రామ్‌చరణ్ చక్కటి అభినయాన్ని కనబరిచారు. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలకే పరిమితమైన రామ్‌చరణ్‌ను రంగస్థలం నటుడిగా కొత్త కోణంలో ఆవిష్కరించింది. దాదాపు రెండు వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిందీ చిత్రం. కథలోని నవ్యత, సుకుమార్ సృజనాత్మకత, నటీనటుల అభినయం ఈ సినిమా విజయంలో కీలక భూమిక పోషించాయి. రామ్‌చరణ్ కెరీర్‌లో ఓ మరపురాని చిత్రంగా రంగస్థలం నిలిచిపోయింది.
BharatAneNenu

రాజకీయాలకు దర్పణం

శ్రీమంతుడు తర్వాత మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన భరత్ అనే నేను చిత్రం 200 కోట్ల గ్రాస్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. రాజకీయ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో యువ ముఖ్యమంత్రిగా మహేష్‌బాబు నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. సమాజ శ్రేయస్సుకు అనుక్షణం తపించే యువ రాజకీయ నాయకుడిగా మహేష్‌బాబు అద్వితీయమైన నటనను కనబరిచారు . సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య విలువల్ని మేళవిస్తూ అర్థవంతంగా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించడంలో పూర్తిగా సఫలీకృతుడయ్యారు. అందరికి ఆమోదయోగ్యంగా చెప్పగలిగితే రాజకీయ ఇతివృత్తాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భరత్ అనే నేను చిత్రం నిరూపించింది. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించిన తీరు, సహజత్వానికి దగ్గరగా మహేష్‌బాబు పాత్రను మలిచిన విధానం సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కనెక్ట్ అయ్యేలా చేసింది.

కథలు-చిత్రీకరణల తీరు మారుతోంది

ప్రస్తుతం వాస్తవిక జీవితాల్ని ప్రతిబింబించే, సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను తెరపై ఆవిష్కరించేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. సినిమాల చిత్రీకరణలో విషయ ప్రామాణికతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. రంగస్థలం సినిమాలో 1980 కాలం నాటి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ వేసిన సెట్స్ చిత్ర విజయంలో కీలకభూమిక పోషించాయి. ఆనాటి గ్రామీణ ప్రాంతాల వైభవాన్ని కళ్లముందు సాక్షాత్కరించాయి. అలనాటి పూరిల్లు, మండువాలోగిల్లు, అప్పటి వాహనాలు, నటీనటుల వస్త్రధారణ... వీటన్నింటిని యథార్థ కోణంలో చూపించడానికి చిత్రబృందం పడిన శ్రమ, కృషి కథకు ప్రాణంపోశాయి. అలాగే మహానటి సినిమా కోసం చిత్రబృందం 1940 కాలాన్ని పునఃసృష్టించారు. మద్రాస్ పట్టణ పరిస్థితులను, విజయ, వాహిని స్టూడియోలు, ఆనాటి చిత్రీకరణల తీరుతెన్నులను సహజత్వానికి దగ్గరగా ఈ సినిమాలో చూపించారు. పాత్ర చిత్రణల విషయంలో ఆనాటి శైలిని అనుసరించారు. అవన్నీ కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేశాయి. రంగస్థలం, మహానటి సినిమాల స్ఫూర్తితో యువ దర్శకులు కథాంశాల్ని మరింత సృజనాత్మకంగా, విస్త్రృత పరిశోధనతో వెండితెరపై తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రిప్ట్‌లో పరిపూర్ణత కోసం పూర్వనిర్మాణ పనుల కోసమే అధిక సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నిస్తున్నారు.

కొత్త కథలకే పట్టం

ప్రస్తుతం తెలుగు హీరోల ఆలోచన ధోరణిలో మార్పు కనిపిస్తున్నది. రొటీన్ ఫార్ములా, కమర్షియల్ కథలను పక్కనపెట్టి కొత్తదనంతో కూడిన ఇతివృత్తాలకే పట్టం కడుతున్నారు. పతాకస్థాయిలో హీరోయిజం, మాస్ అంశాలు, పంచ్ డైలాగ్‌లు, విధిగా పాటలు, ఫైట్లు ఉండాలనే మూస విధానాలకు స్వస్తిపలుకుతున్నారు. తమ స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి కథలు, పాత్రలపరంగా ప్రయోగాలు చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఆ తర్వాతే మిగతా వాణిజ్య అంశాల గురించి ఆలోచిస్తున్నారు. ప్రేక్షకులు సైతం కొత్తదనం లోపించిన కథల్ని తిరస్కరిస్తున్నారు. నవ్యమైన కథలకు విజయాల్ని కట్టబెడుతున్నారు. హీరోల స్థాయిభేదాలను పట్టించుకోకుండా నవ్యమైన కథల్ని అక్కున చేర్చుకుంటున్నారు.

నిడివి పెరిగినా తరగని ఆదరణ

Keerthisuresh
రంగస్థలం భరత్ అనే నేను మహానటి చిత్రాలు దాదాపు మూడుగంటలు నిడివితో రూపొందాయి. సాధారణంగా సినిమాల నిడివిని రెండున్నర గంటలకు పరిమితం చేస్తారు. ఈ సంప్రదాయాన్ని తోసిరాజని కథలోని భావోద్వేగాల్ని పరిపూర్ణంగా ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతో దర్శకులు నిడిని విషయంలో ఎలాంటి హద్దుల్ని విధించుకోవడం లేదు. కథలోని ఎమోషన్‌తో ప్రేక్షకులు సహానుభూతి చెందినప్పుడు ఎంత నిడివి వున్నా పట్టించుకోరని, కాలపరిమితిని విధించుకొని సృజనపరంగా నాణ్యతను కోల్పోవద్దని దర్శకులు భావిస్తున్నారు. ఈ సూత్రానికి ప్రేక్షకులు కూడా ఆమోదం తెలుపుతున్నారు. మూడుగంటల నిడివి వున్నప్పటికీ ఎక్కడా బోర్ ఫీల్‌కాకుండా ఆద్యంతం సినిమాను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న కొన్ని అగ్ర తారల చిత్రాలు కూడా మూడుగంటల వ్యవధితో తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వసూళ్లలో ముందంజ

ఇక వసూళ్లపరంగా తెలుగు సినిమాలు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. కలెక్షన్స్ విషయంలో బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమాలకు గట్టి పోటీనిస్తున్నాయి. వంద,రెండు వందల కోట్ల మైలురాళ్లను సులభంగా అధిగమిస్తూ ఇతర ఇండస్ట్రీలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాల్ని చేకూర్చాయి.

3046

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles