అంతరిక్షాన్ని సృష్టించారు!


Wed,December 12, 2018 11:42 PM

Rama Krishna And Mounika on About Antariksham movie

ఈ ఏడాది ప్రారంభంలోరంగస్థలంతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నాం. ఇదే ఏడాది చివరలో అంతరిక్షం వంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆనందంగా వుంది అన్నారు కళాదర్శకులు రామకృష్ణ, మోనిక. తాజాగా వీరిద్దరూ కలిసి పనిచేసిన చిత్రం అంతరిక్షం. వరుణ్‌తేజ్ కథానాయకుడు. సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కళాదర్శకులు రామకృష్ణ, మోనిక మాట్లాడుతూ మేము ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు ఈ సినిమాకు చాలా వ్యత్యాసం వుంది. అంతరిక్షం లాంటి కథ మన భారతీయ తెరపై ఇంత వరకు రాలేదు. స్పేస్ కథతో తెలుగులో వస్తున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాకు వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.

ఇలాంటి కథని తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు ముందుకు రావడం మంచి పరిణామం. దర్శకుడు సంకల్ప్ కథ చెప్పకుండా స్టోరీ బోర్డ్ వేసి చూపించాడు. పక్కా ప్లాన్‌తో కథకు ఎక్కడ ఎలాంటి సెట్స్ అవసరమో దానికి తగ్గ పూర్తి స్పష్టత అతనిలో వుంది. పైగా సైన్స్ నేపథ్య కథ కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి విషయంపై తను పరిశోధన చేశాడు. స్పేస్ షిప్స్‌లో ఎన్నిరకాలుంటాయి. శాటిలైట్స్ అంటే ఏమిటి? ఎలా వుండాలి వంటి విషయాల్ని పూర్తిగా మాకు వివరించాడు. కమర్షియల్ కథలకు సెట్స్ వేయడం చాలా సులువు. కానీ అంతరిక్షం నేపథ్య సినిమాకు సెట్ వేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ఇది ఫాంటసీ, రొబోటిక్ సినిమా కాదు. సెట్స్ మనకు కావాల్సినట్టుగా మార్చుకోవడానికి. స్పేస్‌లో ఎలా వుంటుందో ఆ అనుభూతిని కలిగించే విధంగా సెట్ వుండాలి. అలాంటి వాతావరణాన్ని సృష్టించాలి. సెట్ నిర్మాణం కోసం 45 రోజుల సమయం పట్టింది. ఇందుకు ఏ హాలీవుడ్ సినిమాను ప్రామాణికంగా తీసుకోలేదు. కథకు అనుగుణంగానే సెట్స్‌ని రూపొందించడం జరిగింది.

ఎన్టీఆర్ నుంచి అందుకే తప్పుకున్నాం

రంగస్థలం తరువాత చాలా అవకాశాలొచ్చాయి. మంచి పేరు కూడా వచ్చింది. అందాల రాక్షసి సమయంలోనే మా పేరు వినిపిస్తుందని ఆశించాం. కానీ రంగంస్థలం తరువాత నుంచి మాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అది మాకు లభించిన బాధ్యతగా భావిస్తున్నాం. ఎన్టీఆర్ సినిమాకు తొలుత మేమే పనిచేశాం. ప్రారంభం రోజు దానవీర శూరకర్ణ సెట్‌ని రూపొందించాం. కానీ తరువాత దర్శకుడు మారడం, మరో దర్శకుడు ఎవరనే విషయంలో సరైన స్పష్టత లేకపోవడం వంటి కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీమూవీస్ నిర్మించనున్న ఓ సినిమా, రానాతో గుణశేఖర్ రూపొందించబోతున్న హిరణ్యకశ్యప చిత్రాలకు పనిచేయబోతున్నాం. హిరణ్యకశ్యప చిత్రానికి సంబంధించిన వర్క్ ఇప్పటికే అమెరికాలో మొదలైంది. ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో భారీ సెట్స్ వేయబోతున్నాం. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ సినిమా వుండబోతుంది.

1496

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles