నా లక్ష్యం నిజాల్ని చెప్పడమే

Sat,March 9, 2019 12:57 AM

నాకు మనశ్శాంతి దొరికింది -లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఏ పేజీలనయితే చింపేయాలనుకున్నారో, ఆయన చివరి రోజుల్లోని చరిత్రను చెరిపివేయాలని అనుకున్నారో ఆ అంశాలను తీసుకొని నేను సినిమా తీస్తానని చెప్పి రామ్‌గోపాల్‌వర్మ ధైర్యంగా ముందుకు వచ్చారు. 23 ఏళ్లుగా ఓ స్త్రీ వేదనకు ఎవరు న్యాయం చేస్తారో అనే ఎదురుచూపులకు రామ్‌గోపాల్‌వర్మ సమాధానం ఇచ్చారు. ఈ సినిమా విషయంలో రామ్‌గోపాల్‌వర్మ నాకు న్యాయదేవతలా కనిపించారు. ఇకనాకు మనశ్శాంతి లేదేమోనని అనుకున్నాను. కానీ ఇప్పుడు దొరికింది అని అన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలతో రూపొందుతున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్యమంజు దర్శకులు. రాకేష్‌రెడ్డి, దీప్తిబాలగిరి నిర్మాతలు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ పాత్రికేయులతో ముచ్చటించారు.

ప్రతి సినిమా చేయడం వెనుక ఓ వ్యక్తి తప్పకుండా స్ఫూర్తిగా ఉంటాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేయడానికి నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి బాలకృష్ణ. ఈ సినిమాను ఆయనకు అంకితం ఇస్తున్నాను. బాలకృష్ణకు ఎందుకు అంకితం ఇస్తున్నానో అనే దాని వెనుక పెద్ద కథ ఇది. ఆ విషయాలు తర్వాత చెబుతాను. ఈ సినిమాకు సంబంధించిన నిజాల్ని నేను అప్పటి ఘటనలకు సాక్ష్యంగా ఉన్న తటస్థ వ్యక్తుల వద్ద సేకరించాను. ఎందుకుంటే వారు ఎలాంటి సంశయం లేకుండా నిజాలు చెబుతారు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య అనుబంధాన్ని రెండున్నర గంటల్లో చూపించడం సాధ్యం కాదు. కాబట్టివారి కథలోని ఆత్మను అప్పటి ముఖ్య సంఘటనల్ని మాత్రమే సినిమాలో చూపించాను. నా కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైన సినిమా ఇది. నేను ఈ సినిమా తీయడం వల్లనే క్రేజ్ రాలేదు. కథాంశంలోని సంఘర్షణే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నది. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. ఏదైనా మనిషి బ్యాడ్‌ఫేజ్ చూసినప్పుడే వారి నిజమైన అంతరంగం ఆవిష్కృతమవుతుంది.

ఆ విషయంలో వాస్తవం లేదు

బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ కార్యరూపం దాల్చనందునే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారా అనే ప్రశ్నకు రామ్‌గోపాల్‌వర్మ సమాధానం ఇస్తూ బాలకృష్ణతో సినిమా అనుకున్నాను. ఆ సినిమాకు సంబంధించిన సబ్జెక్ట్ పూర్తిస్థాయిలో సిద్ధంచేయలేదు. ఒకవేళ బాలకృష్ణతో సినిమా ఒప్పుకుంటే లక్ష్మీపార్వతి ఎపిసోడ్ లేకపోతే ఆ సినిమా కూడా తీయలేకపోయేవాణ్ణి. బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని అనుకున్నా కాబట్టే లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించిన కథ ఐడియా వచ్చింది. నేను ఎలాంటి ప్రయోజనం ఆశించి ఈ సినిమా తీయలేదు. నాకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. నేను ఏ పార్టీ గురించి పట్టించుకోను. అయితే ఈ కథకు పార్టీలతో సంబంధం ఉంది కాబట్టి కొందరు దీనికి కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో నేను నమ్మిన నిజాల్ని చూపించాను.

నేను కూడా బెదిరిస్తా..

ఈ సినిమా విషయంలో నిజంగా నాకు ఇప్పటివరకు ఎలాంటి బెదిరింపులు రాలేదు. టీవీ చర్చల సందర్భంగా ఎవరో కొందరు ఫోన్‌చేసి వార్నింగ్ ఇచ్చేవారు. అంతేకానీ నేను బెదిరే స్థాయిలో ఎవరూ బెదిరింపులు చేయలేదు. ఒకవేళ ఎవరైనా నన్ను బెదిరిస్తే నేను కూడా వారిని తిరిగి బెదిరిస్తా. ఈ సినిమా కథలోని నిజాలు అందరికి తెలుసు. ఆ నిజాల వెనకున్న అసలు కథను ఇందులో చూపించాను. ఏ లక్ష్యాన్ని ఆశించి సినిమా తీయలేదు. నా లక్ష్యం నిజాల్ని చెప్పడమే. నేను జీవితంలో చాలా పాపాలు చేశాను. ఈ సినిమా ద్వారా గొప్ప నిజం చెప్పి వాటన్నింటిని ప్రక్షాళన చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ సినిమాకు అగస్త్యమంజు చాలా సహాయం చేశారు. అందుకే దర్శకుడిగా నాతో పాటు అతడికి క్రెడిట్ ఇచ్చాను. నేనెప్పుడూ కుటుంబ కథల్ని తీయలేదు. అందుకే ఈ సినిమాకు కుటుంబ కుట్రల చిత్రం అనే క్యాప్షన్ ఇచ్చాను(నవ్వుతూ).

ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని తగ్గించలేదు.

ఎన్టీఆర్ తన జీవితం అంతా మహారాజులా బతికారు. కానీ చరమాంకంలో మాత్రం ఎంతో బాధకు, క్షోభకు గురయ్యారు. ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తిని ప్రతికూల పరిస్థితులు, కొందరు మనుషులు ఎలాంటి స్థితికి తీసుకొచ్చారు అన్నదే ఈ సినిమా ఇతివృత్తం. ఇమేజ్‌లేని నటీనటులు అయితేనే ఈ కథకు న్యాయం చేయగలుగుతారని కొత్తవాళ్లను తీసుకున్నాను.

చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు మీకు నిజంగా ధైర్యం ఉంటేనే చేయమని వర్మ అన్నారు. నేను ఏ మాత్రం భయపడకుండా అన్ని వాస్తవాల్ని చూపిస్తా అని ఆయన చెప్పారు. వర్మ ఇచ్చిన ధైర్యంతోనే ఈ సినిమా చేశాను అని తెలిపారు. నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ఎవరైతే అవినీతిపరులో, వెన్నుపోటుదారులో వెధవ వేషాలు వేస్తారో వాళ్లే భయపడతారు. వ్యక్తులు నీతిగా ఉంటే రామ్‌గోపాల్‌వర్మ ఇలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది. ఇది నిజంగా జరిగిన కథ. ఈ సినిమా చూసి ప్రజలు రియలైజ్ అవుతారు. వెధవ వేషాలు వేసినవారు తప్పకుండా నాశనం అవుతారు అని పేర్కొన్నారు.

-రామ్‌గోపాల్‌వర్మ

2392

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles