ఆ కీర్తిప్రతిష్ఠలు వెలకట్టలేనివి

Sun,October 27, 2019 12:08 AM

సైరా చిత్రం విషయంలో వాణిజ్య సమీకరణాల్ని పట్టించుకోలేదు. నాన్నకు ఈ సినిమా రూపంలో అపురూపమైన బహుమతిని అందించాలనుకున్నా. డబ్బు కంటే ఈ సినిమా ద్వారా వచ్చే కీర్తిప్రతిష్టలు ముఖ్యమనుకున్నా అని అన్నారు రామ్‌చరణ్. ఆయన నిర్మాతగా వ్యవహరించిన సైరా చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా సంభాషించారు. ఆయన చెప్పిన సంగతులివి..


మాలధారణలో కనిపిస్తున్నారు..క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారా?

-వీలును బట్టి ప్రతి ఏడాది రెండుసార్లు మాలధారణ చేస్తాను. మన నిత్యజీవితంలో ఉండే ఒత్తిళ్లు, షూటింగ్‌ల హడావుడి నుంచి ఉపశమనం పొంది ఆధ్యాత్మికంగా ప్రశాంతచిత్తాన్ని సాధించే సాధనంగా మాలధారణను భావిస్తాను. అందుకే క్రమం తప్పకుండా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాను.

సాధారణంగా తమ వారసుల కెరీర్‌పై తండ్రులు శ్రద్ధ తీసుకుంటుంటారు. కానీ మీరు నాన్నగారి సినిమా వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు?

-అమితాబ్‌బచ్చన్, నాన్నగారి వంటి లెజెండ్స్‌ను ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలతో భావోద్వేగమైన సంబంధాలు ఉన్నవారు కాబట్టి వృత్తిపరంగా అనుకోకుండా తీసుకున్న విరామం వారి కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపదు. సీనియర్స్ ఎవరైనా సరే ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగిస్తే జూనియర్స్ ఎవరూ పనికిరారు (నవ్వుతూ).

సైరా సినిమా విషయంలో మీరు పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయని భావిస్తున్నారా?

-స్వచ్ఛమైన హృదయంతో కథను ఎంతగానో విశ్వసించి ఈ సినిమాను తెరకెక్కించాం. చరిత్రను కళ్లముందుంచే ప్రయత్నం చేశాం. చిరంజీవిగారిని ఆ పాత్రలో ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అదే సంకల్పంతో తెరపై ఆవిష్కరించాం. సైరా విజయం వందశాతం సంతృప్తినిచ్చింది. ఈ విజయాన్ని బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. కథల్లో కొత్తదనానికి, నిజాయితీకి పెద్దపీట వేస్తూ సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ ఈ చిత్ర విజయం నిరూపించింది.

ప్రతి సినిమా విజయానికి కలెక్షన్లే కొలమానం. సైరా విషయంలో మీరు అనుకున్న ఆర్థిక ఫలితాన్ని సాధించాననుకుంటున్నారా?

-ఇప్పటికే 260కోట్ల వసూళ్లు సాధించింది. ఈ దీపావళి తర్వాత కూడా కలెక్షన్స్ ఉంటాయి. దేశభక్తి అనే ఉద్వేగపూరిత, పవిత్రమైన అంశం చుట్టూ సినిమా కథ నడిపించాం. మరే ఇతర విషయాన్ని పట్టించుకోలేదు. వాణిజ్యపరంగా ఈ సినిమా ఎంతో సంతృప్తినిచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా నాన్నగారు తొలిసారి చేసిన చారిత్రక సినిమా ఇది. నటుడిగా ఆయన కలను సాఫల్యం చేసే ప్రక్రియలో మేమందరం భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా ఆర్జించిన కీర్తిప్రతిష్ఠలు వెలకట్టలేనివిగా భావిస్తున్నా. ఓ కొడుకు తండ్రికి ఇంతకంటే ఏం ఇచ్చినా తక్కువే అనుకుంటున్నా.

ఇతర భాషల్లో సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తున్నది?

-ఇతర రాష్ర్టాల నుంచి అనుకున్నంత ఫలితం రాబట్టుకోలేకపోయాం. సైరాతో పాటే విడుదలైన వార్ సినిమా 22 వరోజు మూడువందలకోట్ల కలెక్షన్స్ సాధించింది. సైరా దాదాపు 270 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం నాలుగు రాష్ర్టాల్లోనే మేము ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధించాం. వార్ ఫక్తు కమర్షియల్ చిత్రం. కానీ సైరా దేశభక్తి ప్రధానంగా తెరకెక్కింది. అలాంటిది వసూళ్ల పరంగా ఆ సినిమాకు చేరువలో ఉండటం బిగ్గెస్ట్ సక్సెస్‌గా భావిస్తున్నా. వార్ సినిమా అదే సమయంలో విడుదలకాకుండా ఉంటే సైరా 400కోట్లకుపైగా వసూళ్లు సాధించేది కావొచ్చు. బాహుబలి కేజీఎఫ్ మాదిరిగా సోలో రిలీజ్ అయివుంటే మేము ఇంకా మంచి నంబర్స్ సాధించేవాళ్లం. అయితే ప్రతి సందర్భం మనకు అనుకూలంగా ఉండాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది. త్వరలో జపాన్, చైనాలో కూడా సైరాను విడుదల చేయబోతున్నాం.

సినిమా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు నిద్రలో ఉలిక్కిపడి లేచేవాణ్ణని ఓ సందర్భంగా చెప్పారు?

-నిజం చెప్పాలంటే ఆర్థికంగా మా స్థాయికి మించి చేసిన సబ్జెక్ట్ ఇది. 63ఏళ్ల వయసులో నాన్నగారు ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. కొన్నిసార్లు షూటింగ్స్‌లో 5000 మంది వరకు పాల్గొన్న సందర్భాలున్నాయి. ప్రతిరోజు 600మంది యూనిట్ సభ్యులుండేవారు. జార్జియాలో 3000మందితో కొన్ని సీన్స్ చేశాం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక బృందంతో సినిమా చేసినా విడుదల ముందుఎక్కడో టెన్షన్ ఉంటుంది. ఫలితం ఎలా ఉంటుందో అని ఆత్రుతగా ఎదురుచూస్తాం.

ఒక నిర్మాతగా ఈ సినిమా మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది?

-మా సినిమా లైబ్రరీలో ఇదొక ఉత్తమ చిత్రంగా మిగిలిపోతుంది. నాన్నగారి కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా చెప్పవచ్చు. హీరో, దర్శకుడి కంటే సినిమా విషయంలో నిర్మాతకు మరింత బాధ్యత ఉంటుందనే విషయం ఈ సినిమాతో అర్థమైంది.

అగ్రహీరోల్లో ఒకరు అయివుండి కూడా రెమ్యునరేషన్ విషయంలో మీరు పట్టింపులు లేకుండా ఉంటారని చెబుతుంటారు?

-నేనెప్పుడు మొత్తం రెమ్యునరేషన్‌ను ఒకేసారి తీసుకోను. సినిమా షూటింగ్ జరిగే నెలల్లో ఓ సాలరీలా రెమ్యునరేషన్ తీసుకుంటా. సాధారణంగా సినిమా రిలీజ్‌కు మూడురోజుల ముందే నిర్మాతకు డబ్బుల విషయంలో ఓ స్పష్టత వస్తుంది. నిర్మాతలు అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని ముందస్తుగా పారితోషికాల్ని చెల్లిస్తుంటారు. ఆ కారణాలతోనే నేను రెమ్యునరేషన్‌ను బల్క్‌గా స్వీకరించను. మరో విషయం ఏమిటంటే నాకు ఇష్టమైన నిర్మాతలతోనే నేను సినిమాలు చేస్తుంటాను. పారిపోయే వాళ్లతో చేయను (నవ్వుతూ). పరస్పరం గౌరవమర్యాదలు ఉన్న నిర్మాతలతో నేను ప్రయాణం సాగిస్తాను.

నాన్నగారు ఇప్పుడు ఎలాంటి కథల్ని ఎంచుకుంటే బాగుంటుందనుకుంటున్నారు? ఆయన ఇమేజ్‌కు తగిన ఇతివృత్తాల్ని ఎంచుకోవడం కాస్త కష్టమనే భావన ఏమైనా ఉందా?

-అలాంటిదేమి లేదు. మాలాంటి యంగ్ హీరోలకంటే నాన్నగారి దగ్గరికే ఇప్పుడు కథలు ఎక్కువగా వస్తున్నాయి. అగ్ర దర్శకులందరూ కథలు సిద్ధం చేసుకొని ఎదురుచూస్తున్నారు. మరో నాలుగేళ్లు నాన్న బిజీగా ఉండబోతున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఏ సినిమా చేయబోతున్నారు?

-ప్రస్తుతం నా దృష్టంతా ఆర్‌ఆర్‌ఆర్ మీదే ఉంది. వందశాతం అంకితభావంతో ఆ సినిమా కోసం కృషి చేస్తున్నా. అది పూర్తయిన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా.

Ram-Charan1
నేను స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాను. సినిమా వరకే అవసరాన్ని కొనసాగించడం నాకు నచ్చదు. మానవ సంబంధాలు సినిమాను మించి గొప్పవని నా అభిప్రాయం. నా మిత్రబృందంలో ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉండే ప్రయత్నం చేస్తాను. అందరి మధ్య వారధిగా వ్యవహరిస్తాను. నాన్నగారి నుంచి నాకు ఈ లక్షణం అలవడింది.

నాన్నగారు జీవితంలో శిఖరాల్ని చూశారు. ఎవో కొన్ని కలలు మిగిలిపోయి ఉంటాయి. వాటిని సైరా సినిమా ద్వారా మేము నెరవేర్చగలిగాం. ఓ తనయుడిగా నాకు అంతకుమించిన ఆనందం మరోటి లేదు.

916

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles