ఆ లెక్కలు చెప్పడం అవసరమా!


Wed,January 9, 2019 12:04 AM

ram charan about bollywood re entry

తెలుగు చిత్రసీమలోని అగ్ర కథానాయకుల్లో రామ్‌చరణ్ ప్రయాణం వినూత్నంగా సాగుతున్నది. ఇమేజ్ ఛట్రాల్లో బందీకాకుండా, కమర్షియల్ సూత్రాలకు అతీతంగా ప్రతి సినిమాలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని తపిస్తున్నారాయన. రంగస్థలం ఆయనలోని పరిపూర్ణ నటుడిని ఆవిష్కరించింది. అటువంటి చిరస్మరణీయ విజయం తర్వాత రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో రామ్‌చరణ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి...నాన్నగారి సినిమాల కోసమే నిర్మాతగా మారాను. బయటివాళ్లతో సినిమాలు చేసే ఆలోచనలేదు. నా సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించను. నాన్నకు నేను ఇచ్చిన పారితోషికం తెలుగు ఇండస్ట్రీలో ఏ నిర్మాత ఇచ్చి ఉండడని అనుకుంటున్నాను(నవ్వుతూ).

వినయ విధేయరామ నేపథ్యమేమిటి?

-నలుగురు అన్నదమ్ముల కథ ఇది. వారి జీవన గమనంలో ఎదురైన సంఘటనల సమాహారంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన శైలిలో అన్ని హంగుల కలబోతగా ఈ సినిమా ఉంటుంది.

ఇలాంటి కమర్షియల్ సినిమాకు సాఫ్ట్ టైటిల్ వినగానే ఏమనిపించింది?

-బోయపాటి శ్రీను సినిమాల్లో జయజానకి నాయక టైటిల్ నన్ను బాగా ఆకట్టుకున్నది. కథకు తగినట్లుగా అలాంటి పొయెటిక్ టైటిల్ ఈ సినిమాకు కుదిరింది. సంక్రాంతికి ఇదే కరెక్ట్ పేరు అనిపించింది.

ఇందులో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది.?

-ప్రతి ఇంట్లో ఇలాంటి ఓ కొడుకు ఉంటే బాగుండుననే ఆలోచనను అందరిలో కలిగించేలా బోయపాటి శ్రీను నా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో నేను అయోధ్య రాముడిలా మంచి లక్షణాలున్న యువకుడిగా కనిపిస్తాను. వినయం, విధేయతలతో నడచుకునే అతడిలో ఉండే మరో కోణం ఏమిటన్నది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

రంగస్థలం తర్వాత ఇలాంటి యాక్షన్ సినిమాను ఎంచుకోవడానికి కారణమేమిటి?

-నటుడిగా ఒకే పంథాకు పరిమితం కాకుండా అన్ని జోనర్ సినిమాలు చేయాలన్నది నా సిద్ధాంతం. 1980, 90 దశకాల్లో నాన్నగారు విభిన్న తరహా కథాంశాలతో సినిమాలు చేశారు. ఆయన మాదిరిగా సెన్సిబుల్ సినిమాలు చేయాలనుంది. మంచి కథ, కథనాలతో పాటు ప్రతిభావంతులైన దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడతాను. బోయపాటిలో ఉన్న క్లారిటీ, కన్విక్షన్ నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా చేశాను.

బోయపాటి శ్రీను సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుంది. ఇందులో అలాంటి సన్నివేశాలు కనిపిస్తాయా?

-భద్ర నుంచి జయజానకి నాయక వరకు యాక్షన్ హంగులతో పాటు ప్రేమ, కుటుంబ బంధాలు, భావోద్వేగాల మేళవింపుతో బోయపాటి శ్రీను సినిమాలు చేశారు. అయితే యాక్షన్ సన్నివేశాలే ఆయనకో బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. అదే ఆయన బలం. అవి లేకుండా నేను ఆయన సినిమా ఊహించలేను పోరాట ఘట్టాలు, హింసను ఈ కథలో సమతూకంగానే చూపించారు.

రంగస్థలంతో ఈ సినిమాను పోల్చడం ఒత్తిడిగా భావిస్తున్నారా?

-పోలికలు అనేవి సహజం. ప్రతి సినిమాకు ఆ ఒత్తిడి ఉంటుంది. అది ఎక్కువగా తీసుకుంటే అందరూ దర్శకులతో సరిగా పనిచేయలేము. సంక్రాంతి పండుగకు కుటుంబమంతా కలిసి చూసే మంచి సినిమా ఇది. రంగస్థలం చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.

సినిమాల వసూళ్లు ప్రకటించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గతంలో అన్నారు? కారణమేమిటి

-రంగస్థలంతో పాటు గత వేసవిలో విడుదలైన భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల కలెక్షన్స్ ప్రకటించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అవి వెల్లడించడం అవసరమా అనిపించింది. అందరం మంచి సినిమాలు చేశాం. అన్నీ చక్కటి వసూళ్లను సాధించాయి. పోటీ అనేది కథలు, పాత్రలు, నటనలో ఉండాలి. అంతేకానీ కలెక్షన్స్ విషయంలో ఉండటం సరికాదనిపించింది. కలెక్షన్స్ పేరుతో అభిమానులు కొట్టుకోవడం నచ్చలేదు. అందుకే నా సినిమాలకు సంబంధించి వసూళ్లు ప్రకటించాల్సిన అవసరం లేదని నిర్మాతల్ని కోరాను.

ప్రస్తుతం అగ్ర కథానాయకుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది? మహేష్‌బాబు, తారక్‌తో మీరు సన్నిహితంగా కనిపిస్తున్నారు?

-తారక్ నాకు మంచి మిత్రుడు. మహేష్‌బాబు ఈ మధ్య మంచి స్నేహితుడయ్యాడు. అయితే సోషల్‌మీడియా వచ్చిన తర్వాతే మా మధ్య ఉన్న అనుబంధం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఇలా అందరిని కలుపుకువెళ్లే మనస్తత్వం నాన్న నుంచి నాకు అలవడింది. అదే నేను ఫాలో అవుతున్నాను.

సైరా సినిమా షూటింగ్ విషయంలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి?

-మరో రెండు నెలల్లో సైరా చిత్రీకరణ పూర్తవుతుంది. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. ముందుగా వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ కుదిరేలా లేదు. దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఈ సినిమా విషయంలో రీషూట్‌లు ఏమీ జరగడం లేదు. అంత డబ్బు మా వద్ద లేదు (నవ్వుతూ).

రంగస్థలం పెద్ద విజయాన్ని సాధిస్తుందని, హీరోగా మీకు గొప్ప పేరు తీసుకొస్తుందని ముందే ఊహించారా?

-రంగస్థలం లాంటి సినిమాలు ప్లాన్ చేస్తే జరగవు. ఓ రోజు సుకుమార్, నేను సరదాగా భోజనం చేస్తున్న సమయంలో ఈ సినిమాకు అంకురార్పణ పడింది. మంచి కథ ఉంటే కలిసి సినిమా చేద్దామని సుకుమార్‌తో చెప్పగానే రెండు రోజుల్లోనే రంగస్థలం కథతో నా దగ్గరకు వచ్చారు. చాలా సింపుల్‌గా ఆ సినిమా ప్రయాణం మొదలైంది.

Ram-Charan1
రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ కథతో నా దగ్గరకు వచ్చినప్పుడు షాకయ్యాను. ఏం మాట్లాడాలో తెలియలేదు. కొద్ది క్షణాల వరకు సైలెంట్‌గా ఉండిపోయాను. ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అనిపించింది.రాజమౌళి మా కాంబినేషన్‌కు పరిపూర్ణంగా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. ఆ బాధ్యత ఆయనపైనే ఎక్కువగా ఉంది. తారక్‌తో పాటు నా అభిమానులను సంతృప్తి పరుస్తూ సినిమాను తీస్తారనే నమ్మకం ఉంది. తారక్‌తో ఉన్న అనుబంధం వల్ల అతడితో నటించడం సులభమైంది. తొలి షెడ్యూల్‌లో ఇద్దరి కాంబినేషన్‌లో పదిహేను రోజుల పాటు దర్శకుడు రాజమౌళి కీలక ఘట్టాలను చిత్రీకరించారు. సంక్రాంతి తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభంకానుంది.

3396

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles