సినీ ప్రయాణం రేసు కాదు!


Sun,May 26, 2019 11:30 PM

Rakul Preet Singh  I�m playing a strong and ambitious role in NGK

కథ, పాత్రల పరంగా నవ్యత ఉండాలి. సెట్స్‌లో ప్రతిరోజు కొత్తదనం కనిపించాలి. ఆ ఉత్సుకత లేకపోతే సినిమాల్ని చేయను అని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది రకుల్. ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ఎన్‌జీకే అదే పేరుతో తెలుగులో విడుదలవుతున్నది. సెల్వరాఘవన్ దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...

పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో ఎన్‌జీకే చిత్రం రూపొందింది. వనతి అనే స్వతంత్య్రభావాలు కలిగిన రాజకీయ నాయకురాలిగా నా పాత్ర శక్తివంతంగా సాగుతుంది. నా ఆలోచన విధానాలు, పనులన్నీ ఊహలకు అందకుండా విభిన్నంగా ఉంటాయి. దర్శకుడు సెల్వరాఘవన్ కథ చెప్పినప్పుడే ఛాలెంజింగ్‌గా అనిపించింది. అది నచ్చే ఈ సినిమాను అంగీకరించాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్ర ఇది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఓ సామాన్య యువకుడి విజయంలో నా పాత్ర ఎంతవరకు ఉంటుందన్నది ఆకట్టుకుంటుంది. కల్పిత కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. నిజజీవిత సంఘటనలతో సంబంధం ఉండదు.

క్లాప్ బోర్డ్ ఉండదు..

సెల్వరాఘవన్ సినిమాను, పాత్రలను తీర్చిదిద్దిన విధానం విభిన్నంగా ఉంటుంది. ఎంత పెద్ద సంభాషణ అయినా చెప్పేటప్పుడు కనురెప్పలు మూయొద్దంటారు. అలా చేస్తే సన్నివేశంలోని ఎమోషన్, కంటిన్యూటీ మిస్ అవుతుందని చెబుతుంటారు. అలాగే యాక్షన్ చెప్పిన తర్వాత మూడు సెకన్లు ఆగిన తర్వాతే డైలాగ్ చెప్పాలనే నియమం ఉంది. అలాగే నటులకు డిఫ్రెషన్ వస్తుందని షూటింగ్‌లో క్లాప్‌బోర్డ్‌ను ఉపయోగించరు.తొలినాళ్లలో ఆయన శైలిని అర్థం చేసుకుంటూ నటించడానికి నాలుగైదు రోజుల సమయం పట్టింది. ఎలాంటి రిహార్సల్స్ లేకుండా షూటింగ్‌కు వెళ్లి ఆయన చెప్పినవి అర్థం చేసుకుంటూ నటించడం సవాల్‌గా అనిపించింది. ఈ సినిమాతో నటిగా చాలా నేర్చుకున్నాను.

తప్పులు వెతకడం సులభం..

ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా రాజకీయాలు తప్ప వేరే అంశాల గురించి మాట్లాడటం లేదు. నేను నా గళాన్ని వినిపిస్తాను. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. తప్పులు వెతకడం చాలా సులభం. నేను చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటాను.

అవగాహన చాలా ముఖ్యం

విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే దేశంలో ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఎమ్‌బీఏ, ఇంజనీర్ కావాలంటే అన్నింటికి ఓ నియమనిబంధనలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లోకి రావాలంటే మాత్రం ఎలాంటి నియమాలు, పద్ధతులు లేవు. దీనిపట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అప్పుడే మార్పు కోరుకునే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ప్రత్యేకమైన సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలి.

రేస్ కాదు..

స్పైడర్ తర్వాత హిందీ, తమిళ భాషల్లో అవకాశాలు రావడంతో తెలుగులోవిరామం వచ్చింది. దేదే ప్యార్‌దే సినిమా చేయడానికి ఏడు నెలల సమయం పట్టింది. ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీగా మారిపోయాను. ఈ విరామంలో తెలుగులో చాలా కథలు విన్నాను. కానీ సమయం లేకపోవడంలో నటించడం కుదరలేదు. గ్యాప్ ఉండకూడదని అనుకోవడానికి సినీ కెరీర్ రేసు కాదు. భాష ఏదైనా మంచి సినిమా చేయడమే నాకు ముఖ్యం. ఏడాదికి నాలుగైదు మించి సినిమాలు చేయను.

వయసు ముఖ్యం కాదు.

నాయకానాయికల వయసుల కంటే కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. ప్రస్తుతం నేను సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్నాను. కథానుగుణంగా జోడీ కుదిరిందని అనిపించినప్పుడే ప్రేక్షకులు నాయకానాయికల మధ్య వయోభేదాల గురించి ఆలోచించకుండా సినిమా చూస్తారు. మన్మథుడు-2 చిత్రంలో హీరో నాగార్జున పోల్చితే నా వయసు చాలా తక్కువగా ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో పాత్రల ఎంపికపై అవగాహన ఉండేది కాదు. కాలమే అన్ని నేర్పించింది.

సైనా నెహ్వాల్ బయోపిక్‌లో..

బయోపిక్‌లలో నటించాలనుంది. సైనా నెహ్వాల్ జీవిత కథలో నటించాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. మనకు తెలియని ఎంతో మంది గొప్ప వ్యక్తుల జీవితాల గురించి చెప్పడానికి సినిమా మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుంది.

1871

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles