మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు!

Tue,October 22, 2019 12:09 AM

‘హీరోగా అశ్విన్‌ను ఈ సినిమాతో ప్రేక్షకులు స్వీకరించడం ఆనందంగా ఉంది. నటన, డ్యాన్సులు, యాక్షన్‌ ఘట్టాల్లో ప్రతిభను చాటాడని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు’ అని అన్నారు ఓంకార్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజుగారి గది-3’. అశ్విన్‌బాబు, అవికాగోర్‌ జంటగా నటించారు. ఇటీవలే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఓంకార్‌ మాట్లాడుతూ ‘నాతో పాటు సినిమా విజయం కోసం ప్రతి ఒక్కరూ రాత్రింబవళ్లు శ్రమించారు. సమిష్టి కృషికి చక్కటి ఫలితం దక్కింది. సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ ఇష్టపడి ఈ సినిమా చేశారు. మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తున్నది. థియేటర్లలో నవ్వుల వర్షాన్ని కురిపిస్తున్నది’ అని అన్నారు. అశ్విన్‌బాబు మాట్లాడుతూ ‘హీరోగా ఈ సినిమాతో నాకంటూ సొంత మార్కెట్‌ ఏర్పడిందని అందరూ చెబుతుండటం సంతోషంగా ఉంది. సినిమా చూసినవారంతా బాగుందని అంటున్నారు. థియేటర్లలో ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా వీక్షించాం. వినోదం, ఎమోషన్స్‌తో పాటు ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు’ అని చెప్పారు. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నవ్విస్తున్న మంచి చిత్రమిదని అలీ అన్నారు. ‘వినోదం కోసం తీసిన చిత్రమిది. ఇప్పటివరకు నాలుగు కోట్ల గ్రాస్‌ రాబట్టింది’అని ఛాయాగ్రాహకుడు ఛోటా.కె.నాయుడు చెప్పారు.
Avika-Gor

996

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles